Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మన్యం పులి

సినిమా రివ్యూ: మన్యం పులి

రివ్యూ: మన్యం పులి
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
సరస్వతి ఫిలిమ్స్‌
తారాగణం: మోహన్‌లాల్‌, జగపతిబాబు, కమలిని ముఖర్జీ, నమిత, లాల్‌, కిషోర్‌, విను కుమార్‌, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు
కథ, కథనం: ఉదయకృష్ణ
సంగీతం: గోపి సుందర్‌
కూర్పు: జాన్‌కుట్టి
ఛాయాగ్రహణం: షాజి కుమార్‌
నిర్మాత: 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి
దర్శకత్వం: వైశాఖ్‌
విడుదల తేదీ: డిసెంబరు 2, 2016

మలయాళంలో ఘన విజయం సాధించిన 'పులిమురుగన్‌' తెలుగులోకి 'మన్యం పులి' పేరుతో అనువాదమైంది. అటవీ ప్రాంతాలకి దగ్గరగా వుండే పల్లెలపై పులి విరుచుకు పడిందని, ఒక పల్లెటూరి జనాన్ని తరచుగా పులి చంపుతోందని వార్తల్లో తరచుగా వింటూనే ఉంటాం. ఈ బ్యాక్‌డ్రాప్‌లో ఒక కమర్షియల్‌ కథకి స్కోప్‌ ఉందని రచయిత ఉదయకృష్ణ గ్రహించాడు. అతను రాసిన కథని థ్రిల్లింగ్‌గా తెర మీద ప్రెజెంట్‌ చేసాడు దర్శకుడు వైశాఖ్‌. వీరికి మోహన్‌లాల్‌ లాంటి యాక్టర్‌ ప్లస్‌ బ్రాండ్‌ తోడవడంతో 'పులిమురుగన్‌' కేరళ బాక్సాఫీస్‌ని ఊపేసింది. 

ఇందులో హీరో పులుల్ని చంపుతుంటాడు. అతను ఎందుకని పులుల్ని చంపుతాడనే దానికి ముందే ఒక బలమైన కారణం చూపిస్తారు. అలాగే అంతటి క్రూరమైన, బలమైన పులిని ఒక మనిషి చంపడం అంత తేలిక కాదు కనుక అతను ఎలాంటి జిత్తులతో పులిని చంపుతాడనేది కూడా స్పష్టంగా తెలియజెప్తారు. ఈ పులి వర్సెస్‌ మోహన్‌లాల్‌ సీన్లన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. ఈ బ్యాక్‌డ్రాప్‌ చుట్టూ ఒక సింపుల్‌ కథ రాసుకుని, దానిని కమర్షియల్‌ స్క్రీన్‌ప్లేతో ప్రెజెంట్‌ చేశారు. ఈ క్రమంలో కామెడీకి, రొమాన్స్‌కి కూడా స్కోప్‌ ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. అదే ఈ చిత్రానికి ఒక విధంగా వీక్‌ పాయింట్‌గా మారింది. 

మోహన్‌లాల్‌ మలయాళంలో సూపర్‌స్టార్‌ కనుక కేరళ జనానికి ఈ చిత్రంలోని రొమాన్స్‌, కామెడీ సీన్లు ఇబ్బంది అనిపించి ఉండకపోవచ్చు. కానీ మన ప్రేక్షకులు దీంట్లో థ్రిల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కమలినిపై సీన్లు, ఇతర సోకాల్డ్‌ కామెడీ సీన్లు కుదించుకుని ఉంటే బాగుండేది. యాక్షన్‌ సీన్స్‌ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కమలిని-మోహన్‌లాల్‌ సీన్స్‌తో ఒకింత విసుగు వస్తుంది. నమిత ట్రాక్‌తో మాస్‌ని ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది కానీ ఆ సీన్స్‌ వల్ల అసలు కథకి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. అలాగే మోహన్‌లాల్‌, జగపతిబాబు మధ్య వైరానికి గల కారణం చాలా సాధారణంగా అనిపిస్తుంది. సినిమా బ్యాక్‌డ్రాప్‌కి తగ్గ ఫ్రెష్‌నెస్‌ ఇక్కడ కూడా చూపించినట్టయితే ఇది ఇంకో రేంజ్‌లో వుండేది. 

అయితే పులికి సంబంధించిన సీన్స్‌తో పాటు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అన్నీ పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కడంతో 'మన్యం పులి' గ్రాఫ్‌ డౌన్‌ అయినప్పుడల్లా మళ్లీ పుంజుకోవడానికి దోహదపడ్డాయి. సినిమా ఆరంభమే అద్భుతంగా అనిపిస్తుంది. పిల్లవాడు పులిని చంపే సన్నివేశానికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ సీన్‌తోనే మొత్తం సినిమాకి తగ్గ మూడ్‌ సెట్‌ అయిపోతుంది. హీరో ఎంటర్‌ కాకుండానే కథలోకి లీనం చేయడంలోనే దర్శకుడి టాలెంట్‌ తెలుస్తుంది. కథాపరంగా కొత్తదనం ఏమీ లేకపోయినా కేవలం ఈ పులిని చంపే సీన్లతోనే మన్యం పులి ఫ్రెష్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ద్వితీయార్థంలో ఇదంతా మిస్‌ అయి రొటీన్‌ హీరో వర్సెస్‌ విలన్‌ వ్యవహారం ఉండడం వల్ల కాసేపు బోర్‌ కొట్టిస్తుంది. పతాక సన్నివేశాలు మళ్లీ ఆరంభానికి తగ్గట్టే చక్కగా కుదిరాయి. 

అయిదు పదుల వయసులో మోహన్‌లాల్‌ ఇలాంటి భారీ స్టంట్స్‌ ఉన్న పాత్రని టేకప్‌ చేయడం, దానికి నూటికి నూరు శాతం న్యాయం చేయడం ఆయనకే చెల్లుతుంది. అటవీ ప్రాంతానికి చెందిన బలశాలిగా మోహన్‌లాల్‌ చక్కగా తన పాత్రలో ఇమిడిపోయారు. పులిని వేటాడే సన్నివేశాల్లో ఆయన కళ్లల్లోని తీక్షణత విశేషంగా ఆకట్టుకుంటుంది. నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్లోనే తెలుగు వాళ్లకి తెలిసిన మోహన్‌లాల్‌ తనలోని మాస్‌ కోణాన్ని, తన స్టార్‌ ఇమేజ్‌ని ఇందులో ఇందులో చూపిస్తారు. జగపతిబాబు మరోసారి తన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటే, కమలిని ముఖర్జీ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. తనపై చెయ్యి వేసిన వాడిని తన భర్త కొడుతుంటే ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్బ్‌. కాకపోతే ఆమె పాత్ర సినిమా అంతటా వన్‌ డైమెన్షనల్‌గానే ఉంటుంది. తనపై సీన్లన్నీ అవే మళ్లీ మళ్లీ రిపీట్‌ అవుతుంటాయి. నమిత పాత్ర వల్ల కథకి ఒరిగిందేమీ లేదు. కిషోర్‌, లాల్‌, మకరంద్‌ దేశ్‌పాండే తమ పాత్రలకి సరిగ్గా సూటయ్యారు. 

సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వంక పెట్టడానికేం లేదు. సినిమాటోగ్రఫీ ఎంత అద్భుతంగా కుదిరిందంటే, ఈ చిత్రం చూసిన తర్వాత తప్పకుండా ఓసారి కేరళ వెళ్లి రావాలనిపిస్తుంది. 'పులిరా పులిరా మన్యంపులిరా' ట్యూన్‌ సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలా సేపు మనల్ని వెంటాడుతుంది. గోపి సుందర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌. పీటర్‌ హెయిన్స్‌ చెలరేగిపోయాడు. ఫైట్స్‌ అన్నీ స్పెషల్‌గా ఉండేట్టు చూసుకున్నాడు. పులితో పోరాటాలు రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. పులికి సంబంధించిన గ్రాఫిక్స్‌ కూడా సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. 

కథా పరంగా కొత్తగా లేకపోయినా, ద్వితియార్ధం మరీ రొటీన్‌గా, ప్రిడిక్టబుల్‌గా అనిపించినా... థ్రిల్స్‌తో, యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో 'మన్యం పులి' కట్టి పడేస్తుంది. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకులని ఈ చిత్రం విశేషంగా అలరిస్తుంది. పులిని వేటాడే సీన్లన్నీ పైసా వసూల్‌ అయితే మిగతాదంతా బోనస్‌ అనిపిస్తుంది. 

బాటమ్‌ లైన్‌: థ్రిల్లింగ్‌ పులి!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?