తమను యిలా మింగేస్తూ పోతూ వుంటే పాలస్తీనా ప్రజలు ఏం చేశారు అన్న సందేహం సహజంగా వస్తుంది. వాళ్లు పాపం ప్రతిఘటిస్తూనే వున్నారు. కానీ అగ్రరాజ్యాలన్నీ వారి గొంతు నొక్కేసి, వారిపై దురాక్రమణను సహిస్తూ, సమర్థిస్తూ పోవడంతో వారిలో ఆగ్రహం పెల్లుబికింది. అది తీవ్రవాదంగా, ఉగ్రవాదంగా మారింది. అప్పటి పిఎల్ఓ (పాకిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్), యిప్పటి హమాస్ ఆవిర్భవించడానికి కారణం యిదే. మనందరం హింసామార్గాన్ని ఖండిస్తాం. పిఎల్ఓ దురాగతాల వల్లనే ఇజ్రాయేలుకు దాడి చేయవలసిన అవసరం వచ్చిందని కొందరు వాదిస్తారు కూడా. ఏది ముందు ఏది వెనక అనేది గమనించాలి. న్యాయం జరిగిందా, కనీసం జరిగినట్లు చూపడానికైనా ప్రయత్నించారా అని ఆత్మశోధన చేసుకోవాలి. బ్రిటిషువారు మనపై మితిమీరిన నిబంధనలు పెట్టి వుండకపోతే, దోపిడీకి గురి చేయకుండా వుంటే ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్ తయారయ్యేవారే కారు. కాంగ్రెసు పార్టీని పెట్టిన హ్యూమ్ ఇంగ్లీషువాడే. స్థానికులకు కొన్ని హక్కులు యిస్తే చాలనే కోరికతో పార్టీ స్థాపించాడు, బ్రిటిషువారిని తరిమేయాలనే లక్ష్యంతో కాదు. అయితే ఆ హక్కులు ఏ మేరకు అన్నదానిపై నాయకుల అవగాహన మారుతూ వచ్చింది. కొన్ని చాలు అనేవారు గోఖలే నాయకత్వంలో మితవాదులయ్యారు. స్వాతంత్య్రం నా జన్మహక్కు అన్న టిళక్ (తిలక్)ను అతివాది అన్నారు వారు. వీళ్లంతా సత్యాగ్రహాలు, ధర్నాలు చేసినవారే తప్ప రైలు పట్టాలు పీకినవారు కారు. అయినా బ్రిటిషు ప్రభుత్వం వీళ్లను అండమాన్ జైళ్లకు పంపి హింసించడంతో, చంథ్రేఖర్ ఆజాద్ వంటి వారు హింసామార్గం పట్టారు.
పత్రికా స్వేచ్ఛను హరించి, సభలు నిషేధించి, నాయకులను జైళ్లలో కుక్కి, ఉరి తీసి బ్రిటిషు ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించినా అహింసామార్గం వదలకూడదని గాంధీ అన్నాడు. మెజారిటీ ప్రజలు ఆయన మాట విన్నారు. హింసామార్గం పట్టినవారు విజయవంతం కాలేకపోవచ్చు కానీ వారు ఎందుకలా మారారో అర్థం చేసుకోకుండా వారిని దూషించకూడదు. స్వాతంత్య్రానంతరం నక్సల్బరీ ఉద్యమం వచ్చిందంటే దాని వెనుక ఎంతో దోపిడీ వుంది. దోపిడీ విపరీతంగా వున్న కొండప్రాంతాల్లో, గ్రామీణప్రాంతాల్లో అది విస్తరించింది. తక్కినచోట్ల పెద్దగా లేదు. వంచనకు గురైన పాలస్తీనా తీవ్రవాదం దారి పట్టడానికి దోపిడీయే! వారు కూడా వెంటనే ఆ మార్గం వైపు మళ్లలేదు. తమ భూభాగంలో ఇజ్రాయేలు చొచ్చుకుపోతున్న కొద్దీ హింసవైపు మరలారు. యాసర్ అరాఫత్ అనే విద్యాధికుడు, సివిల్ ఇంజనియర్ ఫతా అనే రాజకీయపార్టీ ద్వారా 1959లో పాలస్తీనా హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు. 1964 నాటికి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పిఎల్ఓ) స్థాపించి ప్రపంచ నాయకులందరి వద్దకూ వెళ్లి తమ గోడు వినిపించాడు. సానుభూతి సంపాదించసాగాడు. పాలస్తీనా ప్రజలు అరాఫత్‌ను నమ్ముకున్నారు. 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయేలు తన పొరుగుదేశాలను చావగొట్టి చెవులు మూసింది. ఇతర అరబ్ దేశాలకు తమకు సాయపడే బుద్ధి కానీ, శక్తి కానీ లేవని గ్రహించిన పాలస్తీనా యువత అరాఫత్ హితోక్తులను లక్ష్యపెట్టకుండా 1972లో టెర్రరిజానికి పాల్పడి మ్యూనిక్ ఒలింపిక్స్‌లో 11 మంది ఇజ్రాయేలీ ఆటగాళ్లను కిడ్నాప్ చేసి చంపివేశారు.
ఇక పాలస్తీనాను టెర్రరిస్టు దేశంగా ముద్ర కొట్టి ఇజ్రాయేలు వారిపై దాడి ఉధృతం చేసింది. అరాఫత్ పరపతిని తగ్గించడానికి అనేక రకాల యుక్తులు పన్నింది. అతని అనుచరుల్లో విభేదాలు సృష్టించడం, అతనితో చర్చలు జరిపి వాటిని అమలు చేయకుండా పాలస్తీనా ప్రజల దృష్టిలో అరాఫత్‌ను చేతకానివాడిగా చూపడం, అతనిపై హత్యాప్రయత్నం – యిలా రకరకాల టెక్నిక్కులు వుపయోగించింది. అమెరికాతో ప్రచ్ఛన్నయుద్ధం చేస్తున్న రష్యా ఇజ్రాయేలుకి ప్రతిగా అరబ్ దేశాలను దువ్వేది. దాన్ని నివారించడానికి 1979లో అమెరికా ఈజిప్టును ఇజ్రాయేలుకు సన్నిహితంగా తెచ్చింది. తక్కిన అరబ్ దేశాలు ఈజిప్టును వెలివేశాయి. ఇరాన్, ఇరాక్ పాలస్తీనాకు సాయపడతామంటూనే ఏమీ చేసేవి కావు. వీరితో విసిగిపోయిన అరాఫత్ ఇజ్రాయేల్‌ను కట్టడి చేసే శక్తి అమెరికాకే వుందని వారిని ఆశ్రయించాడు. వాళ్లు అతన్ని నమ్మించి, ఉసూరుమనిపించారు. అరాఫత్ రాజీ పడిపోయాడని పాలస్తీనా ప్రజలకు అనిపించేట్లు చేశారు. అతనిపై అవినీతి ఆరోపణలు కూడా చాలా వున్నాయి. అరాఫత్ తన అనుచరులను కట్టడి చేయలేకపోతున్నాడని, అతను వ్యర్థుడని ఇజ్రాయేలు ప్రచారం చేసింది.
పిఎల్ఓ చరిత్ర చెప్పాలంటే చాలా గ్రంథం వుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత అరాఫత్ 1988లో పాలస్తీనా దేశాన్ని ప్రకటించాడు. ఇండియాతో సహా 130 దేశాలు దాన్ని గుర్తించాయి. ఇజ్రాయేలుతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1994లో ఇజ్రాయేలు ప్రధానితో కలిసి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నాడు. అరాఫత్‌లో యీ మార్పును పాలస్తీనా తీవ్రవాదులు వ్యతిరేకించారు. ఇజ్రాయేలుకి అమ్ముడుపోయారన్నారు. కాదని చూపించుకోవడానికి అరాఫత్ చర్చల్లో మొండి వైఖరి ప్రదర్శించాడు. ఏం చేసినా ఎవరి గౌరవమూ పొందలేకపోయాడు. 2004లో అరాఫత్ విషప్రయోగంతో మరణించినపుడు అందరూ ఇజ్రాయేల్నే అనుమానించారు. అరాఫత్ మార్గం పనికి రాదని పాలస్తీనీయులకు తోచేట్లు చేసింది అంతర్జాతీయ సమాజం. అందుకే 2006లో హమాస్ గాజాలో ఎన్నికలలో గెలిచింది. అరాఫత్ వంటి మధ్యేమార్గ నాయకుడికి తగిన గౌరవం యిచ్చి వుంటే, అతని ద్వారా పాలస్తీనా సమస్య పరిష్కారానికి ప్రయత్నించి వుంటే వ్యవహారం ముదిరేది కాదు. కానీ అది జరగలేదు. అందుకే అది హమాస్ వంటి ఉగ్రవాద సంస్థ ఆవిర్భావానికి దారి తీసింది. ఈ రోజు హమాస్ కార్యకలాపాలు చూపించి ఇజ్రాయేలును సమర్థించడం సమంజసం కాదు.
ఇది విహంగావలోకనం వంటిది. ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్న గాజాపై దృష్టి కేంద్రీకరిద్దాం. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)