రామారావు రాజసులోచన వద్దకు వెళ్లేసరికి అప్పటికే రభస జరుగుతోంది. మహారాజుని చంపి నల్లత్రాచు యింకా తిరిగిరాలేదు కాబట్టి అతన్ని మర్చిపోయి తనను పెళ్లాడమని రాజనాల ఆమెను బలాత్కరిస్తున్నాడు. ఇతను వెళ్లి అతన్ని బాగా తన్నాడు. ఇంతలో తక్కినవాళ్లు వచ్చి నల్లత్రాచు మహారాజుని ఎత్తుకుపోయి కాళీమాతకు బలియిచ్చాడని రాజధానిలో చెప్పుకుంటున్నారన్న వార్త తెచ్చారు. అందరూ నల్లత్రాచుని ఆకాశానికి ఎత్తేశారు. రాజసులోచన మరీనూ. ఇక రాజనాలలో విప్లవ నాయకుడు అణగారి పోయి, పగబట్టిన విఫల ప్రేమికుడు బయటకు వచ్చాడు. ఈ నల్లత్రాచును సేనాపతికి పట్టియిస్తేగానీ వాడి పీడ విరగడ అయి ప్రమీల తనకు దక్కదనుకున్నాడు. గుమ్మడి ఆస్థానానికి వెళ్లాడు. మహారాజు మరణించాడు కాబట్టి నీకు పట్టాభిషేకం చేస్తానని పద్మనాభంతో గుమ్మడి… ఆ నల్లత్రాచు బతికి వుండగా నేను సింహాసనం ఎక్కను, వాడు బెదిరించి పోయాడు అని పద్మనాభం. వాదించుకుంటున్న ఆ సమయంలో నల్లత్రాచు అనుచరుడు మీకు ఏదో సమాచారం యిస్తాడట అంటూ కబురు వచ్చింది. గుమ్మడి రాజనాలను పరీక్షించి కాస్త సందేహంగానే అతని వెంట వెళ్లాడు. ఎందుకంటే ఇతనే నల్లత్రాచేమోనని పద్మనాభం అతని మనస్సులో ఒక అనుమాన బీజాన్ని నాటాడు.
దానికి తగ్గట్టుగానే అక్కడ రామారావు కూడా రాజనాల సైన్యంతో చేతులు కలిపాడని తెలియగానే యిలాటి ప్లానే వేశాడు. రాజనాలే నల్లత్రాచని గుమ్మడికి అనుమానం కలిగేట్టు అతని అనుచరులందరూ వచ్చి 'ఏమిటి సేనాపతిని పట్టి తెచ్చావా?' అని అడుగుతారు. 'నల్లత్రాచు ఎక్కడ?' అని రాజనాల అడిగితే 'నువ్వే కదా, నల్లత్రాచువి. అలా అడుగుతావేం? ఓహో సేనాపతి చాటునుండి చూస్తున్నాడా? అందుకని మతలబుగా మాట్లాడావా?' అని అంటారు. ఇదంతా పక్కనుండి వింటున్న గుమ్మడికి సందేహం బలపడింది. ఎందుకైనా మంచిదని ఆ అనుచరుల్ని, రాజనాలను బంధించి రాజధానికి తీసుకొద్దామని బయలుదేరి మధ్యలో రాత్రిపూట ఓ చోట విడిది చేశాడు. ఆ క్యాంప్‌కు రామారావు, రాజసులోచన యితర అనుచరులు ముందుగానే వచ్చేసి, అక్కడ సైనికులను చంపేసి వాళ్ల స్థానాలు ఆక్రమించారు. రాజసులోచన మగసైనికుడి వేషంలో రాజనాల మధుపాత్రలో మత్తుమందు కలిపింది. అతను స్పృహ తప్పి పడిపోగానే నల్లత్రాచు ముసుగు వేసేసి, గుఱ్ఱంమీద పడేసి గుఱ్ఱాన్ని అదిలించేరు. ఇక్కడ గుమ్మడి గుడారం బయటవున్న అనుచరులు 'అదిగో నల్లత్రాచు పారిపోయాడు, అతన్ని పట్టడం వీళ్ల తరమా?' అని తమలో తాము అనుకుంటున్నట్టు బిగ్గరగా గుమ్మడికి వినబడేట్టు అన్నారు. దాంతో గుమ్మడికి అనుమానం రూఢి అయిపోయి, సైనికులను తరిమి, రాజనాలను పట్టించాడు. మర్నాడు ఉదయమే నల్లత్రాచు పేర రాజనాలని ఉరిని తీయించాడు.
ఇక్కడ కథ అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. నల్లత్రాచుని ఉరి వేస్తున్నారని వినగానే కన్నాంబ కళవెళ పడింది. నల్లత్రాచు అంటే తన కొడుకేనని ఆమె అభిప్రాయం. అందుకని కంగారు కంగారుగా పరిగెడుతూంటే కోటగుమ్మం వద్ద ఓ సైనికుడు అడ్డుకున్నాడు. 'నీ కొడుకు క్షేమం' అని చెప్పాడు. ఆ సైనికుడు రామారావే! రాత్రి గుడారం వద్దనుండి సైనికుల వేషాల్లో వాళ్లు కోటలోకి వచ్చేశారు. కన్నాంబ మనసు కుదుటపడింది, వెనక్కి వెళ్లిపోయింది. నల్లత్రాచుని చంపేశాం కాబట్టి కొడుక్కి పట్టాభిషేకం చేయవచ్చని సంబరపడుతూ వస్తున్న గుమ్మడి కంట ఈ దృశ్యం పడింది. ఆ సైనికుణ్ని తన గదిలోకి రప్పించి 'మహారాణి గారితో ఏమిటా గుసగుసలు?' అని అడిగాడు. పాతరాజు విధేయులు యింకా ఎవరైనా మిగిలిపోయారేమోనని అతని సందేహం. రామారావు నసుగుతూ ఏదో సమాధానం చెబితే సరిగ్గా అడిగితే చెప్తావా? అంటూ గుమ్మడి అతణ్ని చెంపదెబ్బ వేశాడు. దెబ్బకి రామారావు పెట్టుడు మీసం ఊడిపోయింది. రామారావును సజీవంగా చూసి గుమ్మడి నిర్ఘాంతపోయాడు. వెంటనే సైనికులచేత అతన్ని బందీ చేసి, పట్టుకెళ్లి ఓ పెద్ద నుయ్యిలాటిదాంట్లో పడేశాడు. అతన్ని ఓ స్తంభానికి కట్టేసి పైనుండి నీళ్లు వదిలారు. అయితే గుమ్మడి గది బయట కాపలా సైనికుడి వేషంలో వున్న రాజసులోచన యిదంతా గమనించింది. గుమ్మడి కన్నాంబ వద్దకు వెళ్లి కిరీటపూజ చేయాలి అని రాజమకుటాన్ని అడిగి తీసుకుంటూ 'పట్టాభిషేకం జరిగిన తర్వాత మీకో కానుక యిస్తాను. జలసమాధిలో మరణించిన నీ కొడుకు మృతదేహం అది' అని ప్రకటించాడు. కన్నాంబ గట్టిగా అరిచి స్పృహ తప్పి పడిపోయింది. గది బయట గడియ వేసేసి గుమ్మడి వెళ్లిపోయాడు. ఇది గమనించిన చెలికత్తె రహస్య సొరంగం ద్వారా గదిలోకి వచ్చి కన్నాంబను బయటకు తప్పించి రాజాస్థానానికి చేర్చింది.
సరిగ్గా పద్మనాభం నెత్తిమీద కిరీటం పెట్టబోయే తరుణంలో కన్నాంబ ప్రత్యక్షమై గుమ్మడిని నిలదీసింది. అతను బుకాయించాడు. పుత్రశోకంతో ఆమె పిచ్చిదయిందని జనాల్ని నమ్మించబోయాడు. ఆమెకు కోపం వచ్చింది, అతని అకృత్యాలన్నిటినీ ఏకరువు పెట్టింది. తర్వాత ఓ తల్లిగా ప్రాధేయపడింది. నా కొడుకుని నా కిచ్చేస్తే కిరీటం వదులుకుని పోతామని ఆశపెట్టింది. ఏమైనా గుమ్మడి చలించలేదు. ఓ సైనికుణ్ని 'ఈవిణ్ని లాక్కుపో' అని ఆజ్ఞాపించాడు. ఈ లోపున రాజసులోచన ఆ పాతాళగృహం కాపలాదారుని బెదిరించి రామారావును కాపాడింది. అతను నల్లత్రాచు ముసుగుతో రాజాస్థానంలో ప్రత్యక్షమై కన్నాంబను తాకబోతున్న సైనికుణ్ని హతమర్చాడు. రాజాస్థానంలో మారువేషాల్లో వున్న విప్లవకారులందరూ నల్లత్రాచుకీ జై అన్నారు. ముసుగు తీసి కన్నాంబను ఊరడించాడు రామారావు. నాయనా ప్రతాప్ అంది కన్నాంబ. రాజసులోచన తెల్లబోయింది. తను చంపాలనుకున్న మహారాజు, విప్లవనాయకుడు పరదేశి ఒకరేనా అని ఆశ్చర్యపడింది. ఇక ఆ పై గుమ్మడి, రామారావు యుద్ధం, గుమ్మడి మరణం, పద్మనాభాన్ని రామారావు క్షమించడం, రాజసులోచన రామారావును అర్థం చేసుకుని అర్ధాంగి కావడం జరిగిపోతాయి. కొత్తరాజుగారు, రాణీగారు దీపనృత్యాన్ని చూస్తూండడంతో సినిమా ముగుస్తుంది.ఇదీ రాజమకుటం కథ. చూడండి కథ ఎంత చక్కగా, చిక్కగా వుందో! ఇలాటి రాజనీతి ప్రధానమైన జానపద చిత్రాలను తప్పు ఎంచలేం. అటువంటివి మరిన్ని వస్తే బాగుండునని ఆశిస్తాం. ఇదీ జానపదాల గాథ! ఇంతటితో యీ సీరీస్ ముగిశాయి. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)