ఊహించని మలుపులతో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న షీనా బోరా హత్య కేసు, ఇంద్రాణి ముఖర్జీ వ్యక్తిగత జీవితం మరో మలుపు తిరిగింది. అందరూ ఇప్పటిదాకా ఊహిస్తున్నట్టు షీనాబోరాను కన్న తండ్రి ఇంద్రాణి మాజీభర్త కాదని మంగళవారం తాజాగా వెల్లడైంది.
షీనాబోరా అసలైన తండ్రి ఆచూకీని ఒక ఆంగ్ల చానెల్ రాబట్టింది. ప్రస్తుతం కోల్‌కతలో నివసిస్తున్న అతడిని సదరు చానెల్ చేసిన ఇంటర్వ్యూలో షీనా తండ్రి పలు అంశాలు వెల్లడించాడు.
తన పేరు సిద్ధార్ధ దాస్ అని అంగీకరించిన అతను… షీనా బోరా తన కూతురేనని, అయితే తాను ఇంద్రాణి పెళ్లి చేసుకోలేదని, కేవలం లివిన్ రిలేషన్ షిప్ లో మాత్రమే కొన్నాళ్లు కలిసున్నామని చెప్పాడు. చట్ట ప్రకారం పెళ్లి చేసుకోలేదు కాబట్టి తాను షీనాకు మాజీ భర్త కానన్నాడు. తనతో కొంతకాలం ఉండి, ఒక షీనా పుట్టాక ఇంద్రాణి తనను వదిలిపెట్టి వెళ్లిపోయిందన్నాడు. దీనికి కారణం ఏమిటో తనకు సరిగ్గా తెలియనప్పటికీ… తాను మధ్య తరగతి వాడు కావడం, ఇంద్రాణికి హై లైఫ్ స్టైల్, సంపన్న ప్రియత్వం ఉందని బహుశా అందుకే తను వెళ్లిపోయి ఉంటుందనుకుంటున్నా అన్నాడు.
మొదటి నుంచి కూడా ఇంద్రాణి డబ్బు మనిషని, ఆమె మనీ మైండెడ్ అన్నాడు. ఆమె అత్యంత సంపన్న కుటుంబీకుని పెళ్లి చేసుకుందని తెలిశాక, ఇక తాను ఆమెని కలవాలనుకోలేదన్నాడు. షీనాకు తాను తన తండ్రి అని తెలుసనీ, 10వ తరగతిలో ఉండగా తనతో ఒకసారి మాట్లాడింది కూడా అని చెప్పాడు. తనకు కూడా పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారన్నాడు. అందుకే కూతురిని కూడా కలవాలని అనుకోలేదన్నాడు. అయితే షీనాను ఇంద్రాణి చంపి ఉండొచ్చా అన్న ప్రశ్నకు ఆ అవకాశాలు కొట్టిపారేయలేం అని అలా జరిగి ఉండవచ్చునన్నాడు.
తాను చిన్న జాబ్ చేసుకుంటూ తన కుటుంబంతో హ్యపీగా ఉన్నానని, ఈ సమయంలో తన జీవితాన్నిడిస్ట్రబ్ చేసుకోవడం ఇష్టం లేకే తన మొహం దాచుకుని ఇంటర్వ్యూ ఇస్తున్నానన్నాడు. అయితే ఈ కేసు విషయంలో పోలీసులకు ఎటువంటి సమాచారం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే డిఎన్ఎ టెస్ట్‌కు సైతం తాను సిద్ధమే అన్నాడు.