ఎమ్బీయస్‌ : ఎన్నికల ఫలితాలు – 6

ఫలితాలపై చర్చ చూసి కొందరు ఫలితాలు వచ్చేసిన యిన్నాళ్లకి యిది అవసరమా అని వ్యాఖ్యానిస్తున్నారు. అంకెలు ఎక్కడైనా కనబడతాయి కదా అంటున్నారు. ఈ శాతాలూ అవీ బోరుగా వున్నాయంటున్నారు. ఫలితాలను వేర్వేరు కోణాలలో విశ్లేషించడం…

ఫలితాలపై చర్చ చూసి కొందరు ఫలితాలు వచ్చేసిన యిన్నాళ్లకి యిది అవసరమా అని వ్యాఖ్యానిస్తున్నారు. అంకెలు ఎక్కడైనా కనబడతాయి కదా అంటున్నారు. ఈ శాతాలూ అవీ బోరుగా వున్నాయంటున్నారు. ఫలితాలను వేర్వేరు కోణాలలో విశ్లేషించడం ఎప్పటినుండో వున్న ప్రక్రియ. సోషల్‌ సైంటిస్టులు ఏళ్ల తరబడి విశ్లేషిస్తారు. నేను 2009 ఎన్నికల తర్వాత కూడా ఎన్నో వారాల పాటు విశ్లేషణలు సేకరిస్తూనే వున్నాను. ఎందుకంటే   ఏ ఫలితానికీ సులభంగా సమాధానం దొరకదు. ప్రతీ సమాధానంలోనూ కొత్త ప్రశ్న మొలుచుకువస్తుంది. ఓటింగ్‌ పేటర్న్‌ (ధోరణి) కనుక్కోవడం చాలా కష్టం. అది తెలిస్తేనే పార్టీలు భవిష్యత్‌ కార్యక్రమాన్ని రూపొందించుకో గలుగుతాయి. భారతీయసమాజం భిన్న సంస్కృతుల మేళవింపు. ఏ వర్గం ఎలా ఓటేసిందో, ఎందుకు వేసిందో, అసలు ఓటర్లలో వర్గస్వభావం వుందో లేదో, సర్వత్రా అలాగే వుందో, వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలుగా పనిచేసిందో కనుక్కోవడం క్లిష్టమైన ప్రక్రియ. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఒక సూత్రం కనుక్కోవడానికి ప్రయత్నించడం ఒక కసరత్తు. ఎన్నికలు జరిగిపోయిన  కొన్ని నెలల దాకా జాతీయ మీడియా వీటిపై వ్యాసాలు ప్రచురిస్తూనే వుంటుంది. ఫలితాలు తెలిశాయి కదాని మానేయదు. తెలుగు మీడియా ఫలితాలు వచ్చిన రెండు మూడు రోజుల్లో విశ్లేషణలు కట్టిపెట్టేస్తుంది. జీవితంలోనే కాదు, ప్రతీ చర్యకు సింహావలోకనం, సమీక్ష అవసరం అని భావించే నేను జాతీయ మీడియాను బాగా ఫాలో అవుతాను. వాటి సారాంశాన్ని పాఠకులకు అందిస్తాను. 

ఇదంతా అనవసరం అనుకున్నవారు హాయిగా చదవడం మానేయవచ్చు. ఇదేమీ వారి సిలబస్‌లో లేదు కదా, కష్టపడి దీనిపై పరీక్ష రాయమని ఎవరూ అడగరు కదా. ఫలితాలు కరక్టుగా వూహించలేక పోయావు కానీ, యిప్పుడు గొప్పగా విశ్లేషిస్తున్నావే అని కొందరి వెక్కిరింత. కరక్టుగా వూహించడం పెర్‌ఫెక్ట్‌గా వస్తే యీ వ్యాసాలెందుకు రాసుకుంటాను? కోట్ల కొద్దీ ఖర్చు పెట్టే అభ్యర్థుల వద్ద లక్షల్లో ఫీజు తీసుకుని వారి ఫలితాలను ముందే చెప్పేసేవాణ్ని. 2009 ఫలితాలు వూహించావు కదా అంటే అది మిడతంభొట్లు జోస్యం కావచ్చునని నామీద నేనే జోకు వేసుకున్నాను. నీ ఊహ తప్పింది కాబట్టి రాజకీయవ్యాసాలు మానేయమని కొందరి సలహా. 2004, 2009లో టిడిపి అధికారంలోకి వచ్చితీరుతుందని రాసిన అనేకమంది కాలమిస్టులు ఫలితాల తర్వాత రాయడం మానేయలేదు. నేను ఏది రాసినా, అనేక షరతులతో రాస్తాను. ఎందుకంటే నాకే పుట్టెడు సందేహాలు. అలా కావచ్చు.., యిలా అయితే, అలా జరగడానికి ఆస్కారం వుంది…లాటి వాక్యాలతో ఏదీ స్పష్టంగా వుండదు. పూర్తి అవగాహన వున్నపుడే క్లియర్‌గా రాస్తాను. 

ఇక విశ్లేషణ కొనసాగిద్దాం. తెలంగాణ ఫలితాల గురించి నేను పోలింగుకు ముందు రాసినది – 'ఇలా చూస్తే తప్పకుండా గెలిచే స్థానాలు తెరాసకు 35-40, కాంగ్రెసుకు 35-40, మజ్లిస్‌కు 8-10 వున్నాయనుకుంటే తక్కిన 30-40 స్థానాల గురించి చెప్పడం కష్టం. టిడిపి-బిజెపిలకు కలిపి 12-15 వస్తాయనుకుంటే, వైకాపాకు 6-8 వస్తాయనుకుంటే, వామపక్షాలకు 5-7 అనుకుంటే కనీసం 10-12 సీట్లలో  క్రాస్‌ ఓటింగు జరిగి యిండిపెండెంట్స్‌, రెబెల్స్‌ గెలుస్తారు. అబ్బే, ఇంత కాంప్లికేటెడ్‌గా వుండదు, ఓటరు నిర్ణయాత్మకంగా ఓటేస్తాడు అనే ఆశాభావం వున్నవారు కూడా గెలిచే పార్టీకి (తెరాస/కాంగ్రెస్‌) 50 సీట్లకు మించి వస్తాయని గట్టిగా చెప్పలేని పరిస్థితి వుంది. అందుకే అందరూ సంకీర్ణ ప్రభుత్వం తథ్యం అంటున్నారు…'! 

ఈ అంచనా తప్పింది. తప్పడానికి కారణం – ఆఖరి రెండు రోజుల్లో తెరాస అనుకూల పవనాలు బలంగా వీచి, యితర పార్టీలన్నీ డల్‌ అయిపోవడం. కాంగ్రెసు సరేసరి. ఇతర పార్టీల గురించి చెప్పాలంటే – మజ్లిస్‌కు 7 మాత్రమే వచ్చాయి. తెలంగాణ వచ్చినా అది బలపడలేదు. ఎంపీగా నిలబడిన అసదుద్దీన్‌ ఒవైసీకి యాకుత్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి కంటె తక్కువ వచ్చాయి. హైదరాబాదులోని ఆంధ్రమూలాలున్నవారికి అండగా నిలబడతామని మజ్లిస్‌ చెప్పినా వారు పట్టించుకోలేదు. సెటిలర్లు అనే పదం ఉపయోగిస్తే వూరుకోమని, వారందరికీ రక్షణగా వుంటామనీ మజ్లిస్‌ చెపుతూ వచ్చింది. కానీ వారు టిడిపిని ఎక్కువగా నమ్మారు. పైగా తెలంగాణ వచ్చాక బిజెపివారు బలపడతారని ముస్లిములు భయపెడితే, నగరంలో మజ్లిస్‌ బలపడుతుందని బిజెపి భయపెట్టింది. మతం పేర పోలరైజేషన్‌ అనేది దేశంలో అనేక చోట్ల కనబడింది. హైదరాబాదులో కూడా మజ్లిస్‌ గతంలో ఆదరించినంతగా హిందువులు ఆదరించినట్లు కనబడలేదు. ఇక కమ్యూనిస్టులు – 5-7 అనుకున్నాను కానీ, చెరో ఒకటీ వచ్చి ఆగిపోయాయి. కాంగ్రెసునే కాదు, వారితో పొత్తు పెట్టుకున్న ప్రతీ పార్టీని  ఓటర్లు శిక్షించారు. సిపిఐకూ అదే గతి పట్టింది. సిపిఐ నారాయణ తను అభ్యర్థిగా నిలబడడంతో యితర నియోజకవర్గాలలో ప్రచారం చేయడానికి సమయం తగ్గిపోయింది. ఆయనకూ ఘోరపరాజయం తప్పలేదు. సిపిఐ క్యాడర్‌ కూడా ఉత్సాహంగా లేరు. సిపిఎంకు గతంలో కంటె ఏమీ పెరగలేదు.

వైకాపాకు 6-8 వస్తాయనుకున్నా. ఖమ్మంతో బాటు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కొందరు వేస్తారేమో అనుకున్నాను. కానీ జగన్‌, కెసియార్‌ కుమ్మక్కయ్యారని నాకు అనుమానం వచ్చినట్లే చాలామందికి వచ్చినట్లుంది, వైకాపాను దగ్గరకు రానీయలేదు. దాంతో 3 దగ్గర ఆగిపోయింది. కాంగ్రెసుకు 35 ఐనా వస్తాయనుకున్నాను. కానీ 21తో సరిపెట్టుకుంది. దేశం మొత్తం మీద కాంగ్రెసు వ్యతిరేకపవనాలు ప్రబలంగా వీచాయని గుర్తు పెట్టుకుంటే యిది మరీ అంత చేటు ఫలితం కాదని గుర్తించాలి. కాంగ్రెసు తెలంగాణ యిచ్చినా యిప్పించినది కెసియార్‌ అనే ఫీలింగే సర్వత్రా కలిగింది. పైగా తెలంగాణ వచ్చేశాక దాని ప్రయోజనాలకోసం ఆంధ్రతో కొట్లాడే సత్తా కెసియార్‌కే వుందనుకున్నారు జనం. అందుకే వాళ్లకు 14 తగ్గాయి. వీళ్లందరికీ తగ్గిన సీట్లు తెరాస ఖాతాలో పడ్డాయి. అయితే తెరాసకు దక్కిన విజయం ఏ పాటిది?

తెరాసకు వచ్చిన సీట్లు 63. అంటే మొత్తం సీట్లలో 53%. 50 వస్తే తప్ప పాస్‌ కాదు కాబట్టి 53% అనేది జస్ట్‌ పాస్‌ అయినట్లే లెక్క. ఆంధ్రలో టిడిపి ఒక్కదానికే 58% సీట్లు వచ్చాయి. టిడిపి-బిజెపి కూటమికి 60.5% వచ్చాయి. దానితో పోలిస్తే తెరాసకు వచ్చినవి 53% మాత్రమే. ఇక ఓట్ల శాతానికి వస్తే టిడిపికి 45% వస్తే టిడిపికి 34% వచ్చాయి. ఆంధ్రలో ముఖాముఖీ పోటీలో టిడిపి కూటమి విపక్షమైన వైకాపా కంటె 39 (మొత్తంలో 22.8%) ఎక్కువ సీట్లు ఎక్కువ తెచ్చుకోగలిగింది. తెలంగాణలో టిడిపి కూటమి – కాంగ్రెసు – తెరాస ముక్కోణపు పోటీ జరిగింది కాబట్టి తెరాస సమీప విపక్షమైన కాంగ్రెసు కంటె 42 సీట్లు (35.3%) ఎక్కువ తెచ్చుకోగలిగింది. ఓట్ల తేడా చూడబోతే 10%. ముక్కోణపు పోటీలో తెరాస వ్యతిరేక ఓట్లు చీలాయి కాబట్టి తెరాస గెలిచింది. నిజానికి టిడిపి తెలంగాణలో ఒక ఫోర్సుగా మిగిలిందని ఎవరూ అనుకోలేదు. కానీ అది 28 లక్షల ఓట్లు, అంటే 14.6%  తెచ్చుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోని దాని క్యాడర్‌ కాడి పారేయకుండా గట్టిగా ఆత్మవిశ్వాసంతో పని చేసి వుంటే యింకా మెరుగైన ఫలితాలు వచ్చేవి.  ఎందుకంటే ఉద్యమం బలంగా వున్న వరంగల్‌లోకూడా దానికి 2 సీట్లు వచ్చాయి. 

నిరాశ పరిచినది బిజెపి. అది ఉద్యమంలో పాలు పంచుకున్నా, తెరాసను గుర్తించినట్లుగా దాన్ని గుర్తించలేదు. ఉద్యమం నడిచిన ఉత్తర తెలంగాణ జిల్లాలలో దానికి 5.35% ఓట్లు వచ్చాయి. ఉద్యమం పెద్దగా లేని దక్షిణ తెలంగాణలో 2% ఓట్లు వచ్చాయి. ఉద్యమం బొత్తిగా లేని, ఆంధ్రమూలాలున్నవారు బహుళంగా వున్న హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో దానికి ఏకంగా 5.85% ఓట్లు, 5 సీట్లు వచ్చాయి – అది కూడా టిడిపితో జత కట్టింది కాబట్టి. కాకపోతే ఎటూ కాకుండా పోయేది. హైదరాబాదులో టిడిపి 2004 ఎన్నికలలో 27.56% ఓట్లతో రెండు సీట్లు తెచ్చుకుంటే 2009లో తెరాసతో పొత్తు పెట్టుకుని 11.21% పోగొట్టుకుని ఒక సీటు గెలుచుకుంది. మళ్లీ యిప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకుని 22.12% ఓట్లు, 9 సీట్లు సాధించింది. బిజెపి 2004లో 10% ఓట్లతో 1 సీటు గెలుచుకుంది. 2009లో ఓట్లు 1.4% పెరిగినా మళ్లీ ఒక సీటే. 2014లో 13.32% ఓట్లతో ఏకంగా 5 గెలుచుకుంది. అంటే వీళ్ల ఓట్లశాతం గణనీయంగా పెరగకపోయినా కాంగ్రెసుకు 15.3%, తెరాసకు 19.6% (2009 ఎన్నికలలో 4.6% వచ్చాయి) రావడంతో ప్రత్యర్థుల ఓట్లు చీలిపోవడం వీరికి లాభించింది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2014)

[email protected]

Click Here for Part-1

Click Here for Part-2

Click Here for Part-3

Click Here for Part-4

Click Here for Part-5