డెవలప్‌మెంట్ ఓరియెంటెడ్ అయిన బాబే ప్రస్తుత అవసరం అని ప్రజలు అనుకున్నారు. దానికి తోడు ఆయన రైతు రుణాల మాఫీ ప్రకటించి సంక్షేమం పేర కూడా ఆకట్టుకోవాలని చూశారు. కానీ అదే ఎన్నికలలో నెగ్గడానికి కారణం అంటే నాకు నమ్మడం కష్టంగా వుంది. రైతులుండే గ్రామాలలో కంటె పట్టణాల్లో టిడిపికి ఎక్కువ సీట్లు వచ్చాయి. 111 గ్రామీణ నియోజకవర్గాలు 63 వుంటే టిడిపి కూటమి అక్కడ గెలిచినది 57% సీట్లు. పట్టణ, పల్లెలు కలిసిన 35 సెమి అర్బన్ నియోజకవర్గాలలో 20 గెలిచిన టిడిపి కూటమి గెలిచినది 57% సీట్లు మాత్రమే. కానీ 29 అర్బన్ నియోజకవర్గాలలో 23 గెలిచి, అక్కడ 79% సీట్లు తెచ్చుకుంది. అంటే టిడిపి కూటమిని అర్బన్ ఓటర్లే ఎక్కువగా ఆదరించారన్నమాట. మధ్యతరగతి ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్నారు కాబట్టే టిడిపికి యీ విజయం దక్కిందని చెప్పవచ్చు. రైతులు ప్రతి జిల్లాలో వున్నారు. రుణ మాఫీ కేవలం ఒక ఫ్యాక్టర్ కాకుండా, అదే మెయిన్ అయి వుంటే అన్నిటా టిడిపికి ఓట్లు కురవాలి కదా!
ఇక ఎన్నికల సందర్భంగా టిడిపి అవలంబించిన స్ట్రాటజీల గురించి ఓ రెండు ముక్కలు. బిజెపి-టిడిపి కూటమిని బిజెపి జాతీయనాయకులు ఆహ్వానించినా తెలంగాణ బిజెపి నాయకులు, ఆంధ్ర టిడిపి నాయకులు హర్షించలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తాము టిడిపితో చేయి కలిపితే మైల పడిపోతామని, తెలంగాణ ఓట్లు తమకు రావని బిజెపి తెలంగాణ నాయకులు పొత్తును నిరాకరిస్తూనే వచ్చారు. బహిరంగంగా ప్రకటనలు చేశారు. చివరకు ఏం జరిగింది? ఉద్యమం జరిపిన చోట్ల బిజెపి సీట్లు గెలవలేదు. అక్కడంతా తెరాసే గెలిచింది. బిజెపి గెలిచిన హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో ఉద్యమమే లేదు. అక్కడ ఎందుకు గెలిచిందంటే – టిడిపితో చేయి కలిపింది కాబట్టి, ఆంధ్రమూలాలున్న హైదరాబాదు, రంగారెడ్డి వాసులు తమను రక్షించేది టిడిపి మాత్రమే అని నమ్మి దానికీ, దానితో పొత్తు పెట్టుకున్న బిజెపికి ఓట్లు వేశారు కాబట్టి! టిడిపికి అక్కడ 10 సీట్లు వచ్చి జిల్లాలలో యింకో 5 వచ్చాయి. బిజెపికి అక్కడ ఏమీ రాలేదు.
ఇక ఆంధ్రలో బిజెపికి బలం ఏమీ లేదు కాబట్టి, దానితో పొత్తు అనవసరమనీ, పైగా విభజనకు కాంగ్రెసుతో సహకరించింది కాబట్టి దానిపై వ్యతిరేకత వుంటుందని, బిజెపికి సీట్లు ఎలాట్ చేయడం వలన సొంత క్యాడర్‌కు అన్యాయం జరుగుతుందని టిడిపి నాయకులు బిజెపితో పొత్తును వ్యతిరేకించారు. కానీ బాబు ఎవరి మాటా వినకుండా బిజెపితో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందారు. గతాని కంటె భవిష్యత్తే ముఖ్యమని నమ్మిన ఆంధ్రులు మోదీ ఎలాగూ గెలుస్తున్నాడని, అతనితో చేతులు కలిపిన బాబును కూడా ఆదరించాలనీ నిశ్చయించుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషనే తమను గట్టెక్కిస్తుందని ఆశ పెట్టుకుని ఓట్లు వేశారు. పథకాలు, మానిఫెస్టోలూ అన్నీ సెకండరీ అనుకుని వుండాలి. అందుకనే వేరే ఊళ్ల నుంచీ, దేశాల నుంచీ ఎక్కడెక్కడినుంచో వచ్చి ఓట్లు వేశారు. మోదీ వచ్చి బాబును ప్రశంసించడం, యిద్దరి మధ్య సఖ్యత అనేక సభల్లో బాహాటంగా కనబడడంతో మోదీకి వున్న గుడ్‌విల్ బాబుకి కూడా ప్రసరించింది. నిర్మాణదకక్షుడిగా బాబుకు ముందే పేరుంది. దానికి మోదీ హవా తోడ్పడింది. ఏ మేరకు తోడ్పడింది, బిజెపితో పొత్తు పెట్టుకుని వుండకపోతే ఏమై వుండేది అనేవి ఎకడమిక్ టాపిక్స్. ఒకటి మాత్రం వాస్తవం. టిడిపికి వచ్చిన పార్లమెంటు సీట్లకు, అసెంబ్లీ సీట్లకు తూకం కుదిరింది. కేంద్రంలో కూడా బాబు ప్రముఖంగా వుండాలన్న ఆకాంక్ష అలా తెలుస్తోంది. బిజెపికి వదిలిన సీట్లలో కూడా టిడిపి ఓటు చేసి వుంటే గెలుపు దక్కేదేమో! కానీ పొత్తు నిలిచేది కాదు. నిజానికి రాయలసీమలో బిజెపికి పొత్తు లాభం చేకూరలేదు. తిరుపతిలో బిజెపి అభ్యర్థి 38 వేల తేడాతో ఓడిపోయారు. పురంధరేశ్వరి 1.74 లక్షల తేడాతో ఓడిపోయారు. మదనపల్లెలో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గుంతకల్లులో బిజెపి అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. కడపలో కూడా డిటో. టిడిపి ఓట్లు బదిలీ కాకపోవడం వలననే యిలా జరిగిందని బిజెపి భావన. పైగా చివరి రెండింటిలో టిడిపి తన అభ్యర్థులను నిలబెట్టింది.
బాబు స్ట్రాటజీస్‌లో విమర్శకు గురైన యింకో అంశం – కాంగ్రెసు నుండి ఫిరాయింపులను ప్రోత్సహించడం! దానివలన పూర్తి లాభం చేకూరలేదు. కాంగ్రెసు నుండి తీసుకున్న వారిలో రాయపాటి, జెసి దివాకరరెడ్డి, పితాని, తోట, గంటా, మండలి యిత్యాదులు నెగ్గారు. శత్రుచర్ల, టిజి వెంకటేశ్, గల్లా అరుణకుమారి, శిల్పా బ్రదర్స్ యిత్యాదులు ఓడారు. అంటే యీ పాలసీ మిశ్రమ ఫలితాలను తెచ్చిపెట్టిందన్నమాట. కాంగ్రెసుపై ప్రజలకున్న ద్వేషం ఏ స్థాయిలో వుందో చూశాక వీళ్లు పార్టీ మారకపోయి వుంటే చావుదెబ్బ తిని వుండేవారని అర్థమవుతోంది. ఆ ఫిరాయింపుదార్లను తీసుకోకపోయినా ఆ నియోజకవర్గాల్లో వారి వలన ఏ హానీ జరిగేది కాదు. టిడిపికి పాజిటివ్ ట్రెండ్ కనబడిన యీ ఎన్నికలలో ఆ ఫిరాయింపులు అనవసరమనే తోస్తోంది. వీళ్లు పార్టీలో ప్రముఖ స్థానాలు ఆక్రమించారంటే వీళ్ల గతచర్యలపై విచారణ జరిగే అవకాశాలు కనుమరుగవుతాయి. ఏది ఏమైనా పదేళ్ల తర్వాత బాబు అధికారంలోకి వస్తున్నారు. పూర్తి రాష్ట్రానికి కాదు, సగం రాష్ట్రానికే. సగం చేయడానికి కారణభూతుల్లో ఆయనా ఒకరు. విభజన చేసినందుకు కాంగ్రెసుకు పెద్ద శిక్షే పడింది. విభజన చేయమని లేఖ యిచ్చినందుకు టిడిపికి పడిన శిక్ష – సగం ముక్క మాత్రమే దొరకడం! విభజన పాపంలో భాగస్వామి అయిన బిజెపికి శిక్ష ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈ సగం రాష్ట్రానికైనా బాబు సిఎం కాగలుగుతున్నారంటే దానికి కారణం – విభజనే! ఇదొక పారడాక్స్!
ఈ విజయం కోసం ఆయన అమ్ములపొదిలో అన్ని అస్త్రాలనూ వాడారు. ఎక్కడా ఛాన్సు తీసుకోలేదు. ఎందుకంటే అది ఆయన నాయకత్వానికి జీవన్మరణ సమస్య అయిపోయింది. ఈ సారి టిడిపి ఓడిపోతే, అధ్యకక్షుడిగా ఆయన తప్పుకోవాలనే డిమాండ్ వచ్చేది. ఆ పరిస్థితి తలెత్తకుండా ఆయన విజయం సాధించారు. అప్పుడే యిద్దరు ఎమ్మెల్యేలు అదనంగా ఆయన పార్టీలో చేరుతున్నారు. వైకాపా నుండి యింకా కొందరు వచ్చి చేరతామనవచ్చు. వీరు తెచ్చిపెట్టే తలకాయనొప్పులు ఎలా వుంటాయో తెలియదు. కొత్త రాష్ట్రాన్ని నిర్మించే అవకాశం బాబుకి దక్కింది. ఆర్థికపరిస్థితి అధ్వాన్నంగా వుంది కాబట్టి ఎన్నో సవాళ్లు కూడా వున్నాయి. వాటిని అధిగమించి, ఫలితాలు అందిస్తే ఆయనకు మంచి ఖ్యాతి లభిస్తుంది. టిడిపి ఓటర్లకు ఎన్నో ఆశలు కల్పించింది. ఏ మాత్రం విఫలం చెందినా వారి నిరాశ కూడా అంతే తీవ్రంగా వుంటుంది. కేవలం 2% ఓట్ల తేడాతో వెనకబడి వున్న ప్రతిపక్షం బలపడుతుంది. పదేళ్లగా అధికారానికి దూరంగా వున్న పార్టీ సభ్యులు, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన నాయకులు అవినీతిరహితంగా ప్రభుత్వాన్ని నడపనిస్తారో లేదో వేచి చూడాలి. అంతేకాదు, మోదీ ప్రభుత్వాన్ని శాసించబోతున్న కార్పోరేట్ సంస్థలే ఆంధ్రప్రభుత్వాన్ని శాసించాలని చూస్తాయి. ముఖ్యంగా తీరప్రాంతపు పెట్రోలుపై కన్నేసిన రిలయన్స్! గుజరాతీ పెట్టుబడిదారులు ఆంధ్రను ముంచెత్తవచ్చు. ఆర్థికప్రగతికి వారి అవసరం వున్నా, వారిని అదుపు చేయకపోతే అనర్థం తప్పదు. అసలే బాబుకి ప్రపంచబ్యాంకు మనిషన్న పేరుంది. దానికి తోడు యీ కార్పోరేట్ బంధువున్న ముద్ర తోడయితే, గతం పునరావృతమవుతుంది. పొగడ్తల అగడ్తలో పడకుండా సామాన్యుడి బాధ అర్థం చేసుకుంటేనే ఆయనకూ, పార్టీకి లాభం. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)