కులమే కాదు, మతం కూడా యీ ఎన్నికలలో ప్రాధాన్యత వహించిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దేశం మొత్తం మీద యీ ధోరణి కనబడింది. తొలినుంచీ కాంగ్రెసు పార్టీకి ముస్లిములు, దళితులు దన్నుగా నిలిచేవారు. ఆ పార్టీ వాళ్లకు ఏం ఒరగపెట్టినా, లేకున్నా హిందూ మహాసభ వంటి పార్టీలను చూస్తే వాళ్లకు భయంగా వుండేది. వామపక్షాలు, సోషలిస్టు పార్టీలు సెక్యులరిస్టు ధోరణులు కనబరచినా, వారి నాస్తికవాదం ముస్లిములకు దూరం చేసింది. వీళ్ల సాలిడ్ సపోర్టుతో బాటు హిందువుల్లో కొన్ని కులాలు కూడా ఒక్కోప్పుడు మద్దతిచ్చేవి. అవి ఒక పార్టీ కంటూ కట్టుబడి వుండేవి కావు. ఇలాటి పరిస్థితుల్లో కాంగ్రెసును దెబ్బ కొట్టాలంటే హిందువులను విడకొట్టి వారిలో కొన్ని కులాలను కన్సాలిడేట్ చేసి ఓటుబ్యాంకుగా చేసుకోవాలని సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా అనుకున్నాడు. తమిళనాడులో డిఎంకె అలాటి ప్రయోగం చేసి విజయవంతమైంది. హిందువుల్లో వెనుకబడిన కులాలకు రాజకీయప్రాతినిథ్యం లభించడం లేదన్న నినాదంతో యుపి, బిహార్ రాష్ట్రాలలో ఉద్యమం చేశాడు. అది మొదట్లో బలహీనంగా వున్నా రానురాను బలపడి కర్పూరీ ఠాకూర్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వంటి వారు నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది. వట్టి బిసిలే అంటే బలం చాలదని, వీళ్లు ముస్లిములను కూడా కలుపుకుని పోసాగారు. కాంగ్రెసు మీకేం చేయలేదు, మేం మీకు రిజర్వేషన్లు కల్పిస్తాం, మీ మసీదులను స్కూళ్లగా గుర్తించి, మతబోధకులను టీచర్లగా గుర్తించి జీతాలిస్తాం అంటూ వాళ్లను ఊరించారు. దళితులకు విడిగా పార్టీ వుండాలంటూ యుపిలో బియస్పీ పుట్టుకుని వచ్చింది. ఎస్పీ, బియస్పీ ఒక థలో కలిసి పోటీ చేశారు. ఆ తర్వాత ప్రత్యర్థులుగా మారారు. మొత్తానికి బలమైన శక్తులుగా మారి అగ్రవర్ణాల నాయకత్వంలో నడిచే కాంగ్రెసు, బిజెపిలను వెనక్కి నెట్టేశారు. ఆ విధంగా మతం కార్డును ఎదుర్కోవడానికి కులం కార్డు బయటకు తీశారు వాళ్లు.
ఈ ఎన్నికలలో ఆ కులం కార్డును ఎదుర్కోవడానికి బిజెపి మతం కార్డు ఉపయోగించింది. ఏ కులానికి చెందినా హిందువులంతా ఒకటే, అందరూ సంఘటితంగా వుండి ముస్లిములను ఎదుర్కోవాలి. వాళ్లను అదుపులో పెట్టకపోతే పేట్రేగిపోతారు – అనే నినాదంతో అమిత్ షా ప్రచారం సాగించారు. 80 సీట్లున్న యుపిలో ముస్లిముల జనాభా 19%. మొహమాటానికైనా బిజెపి ఒక్క ముస్లిము అభ్యరికీ టిక్కెట్టు యివ్వలేదు. మాది హిందువుల పార్టీ దట్సాల్, దీనిలో ప్రతీ కులమూ మాకు ముఖ్యమే అంటూ హిందువుల్లో అన్ని కులాలకూ చేరువైంది. ఆ విధంగా ముస్లిములను బుజ్జగిస్తూ ఓట్లు తెచ్చుకుంటున్న ఎస్పీ నుండి, దళితులను బ్రాహ్మణులను నమ్ముకున్న బియస్పీ నుండి ఓట్లు గుంజుకుంది. కులాల వ్యత్యాసాలు మరచి అందరూ బిజెపికి వేయడం వలననే యుపిలో కనీవినీ ఎరుగనంతటి ఘనవిజయం బిజెపికి దక్కింది. బిహార్‌లోనూ అదే జరిగింది. అంచనాలకు మించి బిజెపి ఫలితాలు సాధించడానికి కారణం ఆ రెండు రాష్ట్రాలే! బిజెపిలోని యీ మూడ్ మన రాష్ట్రంలో కూడా పని చేసిందని నా ఊహ. 'క్రైస్తవులు, ముస్లిములు జగన్ వెంట సాలిడ్‌గా నిలబడ్డారు. వారికి దళితులు తోడవుతున్నారు. వైయస్ హయాంలో అనేక చర్చిలు కట్టడానికి ప్రభుత్వధనం ఖర్చు చేశారు. ఇక జగన్ వస్తే వాళ్లకు పట్టపగ్గాలుండవు. మతప్రచారం ముసుగులో అనిల్ రాజకీయాలు నిర్వహిస్తున్నాడు. మతమార్పిడులు విచ్చలవిడిగా చేయిస్తూ, జగన్‌కు ఓటు బ్యాంక్ పెంచుతున్నాడు. వీళ్లూ, ముస్లిములూ కలిస్తే యిక హిందూమతానికి కష్టకాలమే..' అనే ఆలోచన ఆంధ్రప్రజల్లో బాగా నాటుకుంది. తిరుపతిలో జగన్ ప్రవర్తన దానికి నీరు పోసింది. వ్యతిరేకత పెంచింది.
తూర్పు గోదావరి జిల్లా ఒకప్పుడు వైయస్‌కు, తర్వాత జగన్‌కు పెట్టనికోటగా వుండింది. ఇప్పుడు ఎందుకు ఎదురు తిరిగింది? ఉత్తరాంధ్ర వైకాపా ఆశలను వమ్ము చేయడానికి కారణం ఏమిటి? విజయమ్మ అక్కడ నిలబెట్టి జగన్ పొరబాటు చేశారా? నిజానికి అక్కడ విజయమ్మ నిలబడడం ఉత్తరాంధ్రలో వైకాపా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలి. నింపి వుంటుంది కాబట్టే 41% ఓట్లు వచ్చాయి. అయితే 'వైజాగ్ రాజధాని కాబోతోంది. విజయమ్మ యిక్కడ నెగ్గితే కడప గ్యాంగులు వచ్చి యిక్కడి భూముల్ని, వ్యాపారాల్ని కబళిస్తాయి.' అనే ప్రచారంతో స్థానిక సిండికేట్లు విపరీతంగా ధనం వెచ్చించి విజయమ్మను ఓడించాయని విన్నాను. కొందరు విశ్లేషకులు 'శాంతికాముకులైన ఉత్తరాంధ్ర, కోస్తా ప్రజలను కడప సంస్కృతిని సహించలేక వైకాపాను తిరస్కరించారు' అని రాశారు. అంటే 30% సీట్లు వైకాపాకు కట్టబెట్టిన కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఆ సంస్కృతిని వెల్‌కమ్ బోర్డు పెట్టుకుని ఆహ్వానించారా? విజయమ్మ అక్కడ నిలబడడానికి ముందూ, వెనకా అక్కడ లిక్కర్ సిండికేట్లు, ఇసుక సిండికేట్లు, ల్యాండ్ మాఫియాలు, మరోటీ మరోటీ వున్నాయి కదా! దోచుకునేవాడు దోచుకుంటూనే వుంటాడు. అవతలివాళ్లు వాటికి కులాల పేర్లూ, ప్రాంతాల పేర్లూ తగిలిస్తూ వుంటారు. హైదరాబాదులో కబ్జాలు ఎప్పుడూ జరుగుతూనే వున్నాయి. తెలంగాణ ఉద్యమం వచ్చాక వాటికి ఆంధ్ర రంగు పులిమి ఆంద్రోళ్లు వచ్చి ఆక్రమించారు అన్నారు. మొన్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అవన్నీ వైయస్ అనుచరులవని నిర్వచించారు. దోపిడీకి గురయ్యే ప్రజలకు కడప వారు దోచుకున్నా, స్థానికులు దోచుకున్నా ఒకటే, తేడా పడదు. అయినా పరాయి వాడనగానే ఫియర్ సైకోసిస్ పని చేస్తుంది.
విభజనకు ముందు మాట ఎలా వున్నా, విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం, కొత్త కాంట్రాక్టులు, భారీ ఎత్తున నిధుల వ్యయం యివన్నీ వుంటాయని సాధారణ ప్రజలకు కూడా తెలుసు. జగన్‌కు అవినీతిపరుడైన ముద్ర వుంది కాబట్టి యీ ప్రక్రియలో జనరేట్ అయ్యే డబ్బులు సింహభాగం మింగేస్తాడన్న భయమూ ఓటర్లకు కలిగి వుండడంలో ఆశ్చర్యం లేదు. ఆ మాటకొస్తే ఆంధ్ర ఎన్నికలలో ధనం విపరీతంగా ప్రవహించింది. రెండు పక్షాలూ ఖర్చు పెట్టాయి. ఏ పార్టీ నెగ్గినా యిదంతా అవినీతి చేసి రాబట్టుకుంటాయని సులభంగా గ్రహించవచ్చు. కానీ మీడియా జగన్ మీదే దృష్టి ఫోకస్ చేసి, ఓటర్లను ప్రభావితం చేసింది కాబట్టి టిడిపిని ప్రజలు ఎక్కువగా విశ్వసించారు. జెసి దివాకరరెడ్డి కాంగ్రెసు వున్నంతకాలం అక్రమ పర్మిట్లతో బస్సులు నడిపేవాడన్నారు, ఆందోళనలు చేశారు. టిడిపిలో చేరగానే పునీతుడై పోయారా? ఇలాటి తమాషాలు ఎన్నో జరిగాయి కానీ ప్రచారంలో యివన్నీ కొట్టుకుపోయాయి.
ఇంకో ముఖ్యమైన అంశం – బాబు అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడారు. నేనూ మోదీ కలిసి రాష్ట్రాన్ని బాగుచేస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. జగన్ ఆ విషయంపై అతి తక్కువ మాట్లాడారు. ఎంతసేపూ వాళ్ల నాన్న కాలం నాటి సంక్షేమపథకాల గురించే మాట్లాడారు. జాతీయ స్థాయిలో తనకు ఎవరు దన్నుగా వుంటారో ఆలోచించలేదు, బయటకు చెప్పలేదు. అక్కడ హంగ్ ఏర్పడుతుందని, ఎవరు బలంగా వుంటే వారికి మద్దతిచ్చి నిధులు తెచ్చుకుంటానని అనుకున్నారు. సుస్థిరప్రభుత్వం ఏర్పడితే తన మద్దతు అవసరం పడదు కదా, అప్పుడేం చేయాలి అన్న ఊహే చేయలేదు. చివరకు అదే జరిగింది. ఎన్నికలకు ముందు చేసుకున్న పొత్తులకు ఎవరైనా ప్రాధాన్యత యిస్తారు. నిజంగా ఆంధ్రలో జగన్ నెగ్గి మోదీకి స్నేహహస్తం చాచినా, ఆయన అందుకోకపోవచ్చు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)