చేప మందా.? ప్రసాదమా.?

హైద్రాబాద్‌లో బత్తిన సోదరులు ఏటా ఉబ్బస రోగుల కోసం పంచే ‘చేప మందు’ కాల క్రమంలో ‘చేప ప్రసాదం’గా పేరు మార్చుకున్న విషయం విదితమే. రాజకీయ కుట్రకు చేప మందు కాస్తా చేప ప్రసాదంగా…

హైద్రాబాద్‌లో బత్తిన సోదరులు ఏటా ఉబ్బస రోగుల కోసం పంచే ‘చేప మందు’ కాల క్రమంలో ‘చేప ప్రసాదం’గా పేరు మార్చుకున్న విషయం విదితమే. రాజకీయ కుట్రకు చేప మందు కాస్తా చేప ప్రసాదంగా మారిపోయిందన్న విమర్శలున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వమే చేప మందు పంపిణీకి ఏర్పాట్లు చేసేది. కానీ, ఆ తర్వాత ఆ చేప మందు పంపిణీకి స్థలాన్ని వెతుక్కోవడమూ బత్తిన సోదరులకి కష్టమైపోయింది.

దేశవ్యాప్తంగా చేప మందుకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఉబ్బస రోగులు విదేశాలనుంచి తరలి వచ్చి మరీ బత్తిన సోదరులు పంచే చేప మందుని స్వీకరిస్తుంటారు. అందులో అసలు ఔషధ లక్షణాలే లేవన్న విమర్శలు ఓ పక్క.. రాజకీయ వివాదాలు ఇంకోపక్క.. వెరసి చేప మందు ప్రాభవాన్ని కోల్పోయింది. ఒకప్పుడు చేప మందు కోసం ఐదారు లక్షల మందికి పైగా వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఆ మధ్య హైద్రాబాద్‌ శివార్లకు చేప మందు పంపిణీ శిబిరాన్ని మార్చినా, వేల సంఖ్యలో చేప మందు కోసం ఉబ్బస రోగులు తరలివెళ్ళారు.

ఇక, ఈ సారి చేప మందు పంపిణీ తెలంగాణ రాష్ట్రంలో జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం చేప మందు పంపిణీ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇక తమ మందుకు ప్రాముఖ్యత మళ్ళీ పెరుగుతుందని చేప మందును పంపిణీ చేస్తోన్న బత్తిన వంశీకులు చెబుతున్నారు. ప్రసాదమో.. మందో.. ఏదైతేనేం తమ రోగాన్ని తగ్గిస్తోందని ఉబ్బస బాధితులు ఎదురు చూస్తున్నారు ఈ నెల 8వ తేదీ కోసం. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5.30 నిమిషాలనుంచి, మరుసటి రోజు అంటే 9వ తేదీ సాయంత్రం 5.30 నిమిషాల వరకు చేప మందు పంపిణీ జరుగుతుంది.

రాజకీయ కారణాలతో చేప మందు కాస్తా ప్రసాదంగా మారిపోయిందనీ.. పరిస్థితులు చక్కబడి మళ్ళీ చేప ప్రసాదం కాస్తా చేప మందుగా ప్రాచుర్యం పొందే రోజు దగ్గర్లోనే వుందని బత్తిన వంశీయులూ ఆశాభావంతో వున్నారు. హైద్రాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈ చేప మందు / ప్రసాదం పంపిణీ జరుగుతుంది. దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి.