ఆగడు టీజర్..మిక్స్ డ్ రెస్పాన్స్

మహేష్ బాబు ఆగడు టీజర్ విడుదలయింది. అభిమానులకు పండగే పండగ. అయితే టీజర్ పట్ల మిక్స్ డ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. టీజర్ కు పెద్ద ప్లస్ పాయింట్ మహేష్ బాబు. చాలా అందంగా, స్టయిలిష్…

మహేష్ బాబు ఆగడు టీజర్ విడుదలయింది. అభిమానులకు పండగే పండగ. అయితే టీజర్ పట్ల మిక్స్ డ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. టీజర్ కు పెద్ద ప్లస్ పాయింట్ మహేష్ బాబు. చాలా అందంగా, స్టయిలిష్ గా కనిపించాడు. అయితే మహేష్ లాంటి హీరో రేంజ్ లో టీజర్ లేదన్న వాదన వినిపిస్తోంది. 

గాల్లోకి ఎగరడాలు, కొట్టడాలు, తన్నడాలు వదిలేస్తే, మిగిలినవి రెండే సంగతులు. అవే రెండు డైలాగులు. ప్రేక్షకులకు పంచ్ డైలాగులు బాగా పడుతున్నాయన్నది ఒకటి. ఈ డైలాగ్ టీజర్ లో పెద్దగా పేలలేదు. ఇక రెండో డైలాగు పవన్, నందమూరి నటులను టార్గెట్ చేస్తూ, ప్రతివోడూ పులులు, సింహాలు,ఏనుగులు, ఎలకలతో పోల్చుకోవడం అన్నది. అది మాత్రం కాస్త సెన్సేషన్ కలిగించింది. 

శ్రీను వైట్ల కావాలనే, టీజర్ గురించి నలుగురూ మాట్లాడుకోవాలనే ఈ డైలాగ్ కట్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల బొగట్టా. అయితే డైలాగు సంచలనం అలా వుంచితే, సినిమాపై అంచనాలు పెంచే వ్యవహారమేదీ టీజర్ లో లేదు. కృష్ణ బర్త్ డే సందర్భంగా విడుదల చేయాలని ఏదో ఒకటి చేసారా..లేక, ఇంతకన్నా ఇప్పట్లో సినిమా గురించి రివీల్ చేయడం ఇష్టం లేకనా? మరో టీజరో, ట్రైలరో వస్తే గానీ అసలు సంగతి తెలియదు.