ఎమ్బీయస్‌: ప్రత్యేక హోదాకై ఆత్మహత్య – 04

ఇక రెండో లీకు గురించి – ఆర్థికమంత్రి ఆంధ్రకు నిధులు కురిపిస్తుందని చెప్పారట. ఆ ముక్క చెప్పినది ఎవరంటే టిడిపి ఎంపీలే. ఆర్థికమంత్రి దగ్గరకు వెళ్లి మహజరు యిచ్చినపుడు తీయించుకున్న ఫోటోకు యీ న్యూస్‌…

ఇక రెండో లీకు గురించి – ఆర్థికమంత్రి ఆంధ్రకు నిధులు కురిపిస్తుందని చెప్పారట. ఆ ముక్క చెప్పినది ఎవరంటే టిడిపి ఎంపీలే. ఆర్థికమంత్రి దగ్గరకు వెళ్లి మహజరు యిచ్చినపుడు తీయించుకున్న ఫోటోకు యీ న్యూస్‌ కలిపి పేపర్లో వేయించేసుకున్నారు. తెలంగాణ, సమైక్య ఉద్యమాలప్పుడు యిలాటి తమాషాలు చాలా చూశాం. వెళ్లొచ్చిన ప్రతీవాళ్లూ 'సోనియా తమ మాటలను శ్రద్ధగా ఆలకించి, అలాగే జరుగుతుందని హామీ యిచ్చార'ని యిరు పక్షాల వారూ చెప్పేసుకునేవారు. కేంద్రం ఆంధ్రకు యిప్పటిదాకా ఏమీ విదల్చలేదని అందరికీ తెలుసు. ఇవ్వవలసినది కూడా యివ్వలేదని, బజెట్‌ లోటు పూరించలేదనీ తెలుసు. అయినా బజెట్‌ లోటు పూరించడం అనేది అర్థం లేని మాట. ఎంత యివ్వాలో అంత యివ్వాలి కానీ, నీ లోటెంతో చెప్పు అంతే యిస్తాం అనడమేమిటి? ప్రజలకు యివ్వాల్సినవి యివ్వకుండా ఎండగట్టి, లోటు తగ్గిస్తే దానివలన కేంద్రానికి లాభమన్నమాట. 

పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సులతో మోదీ సర్కారు రాష్ట్రాలకు నిధులు ప్రవహింప చేస్తోందన్నమాట వట్టి మాట అని మొన్ననే గణాంకాలతో సహా వార్త వచ్చింది. కేంద్ర పన్నుల్లో వాటా పెంచడం వలన రాష్ట్రాలకు రూ.1.78 లక్షల కోట్ల నిధులు పెరిగాయని చెప్తున్నారు కానీ కేంద్ర ప్రాయోజిక పథకాల్లో కోత, రాష్ట్ర ప్రణాళికలకు కేంద్ర మద్దతు రద్దు వంటి చర్యల ద్వారా కేంద్రం 2.68 లక్షల కోట్లు  తగ్గించేసిందని చెప్పటం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 34 పథకాల భారాన్ని కేంద్రం తనే పూర్తిగా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే బజెట్‌లో వాటిపై ఆర్థిక భారాన్ని తగ్గించుకుంది. 66 కేంద్ర ప్రాయోజిత పథకాలకు 2014-15 బజెట్‌లో 2.52 లక్షల కోట్లు ఎలాట్‌ చేస్తే 2015-16 బజెట్‌లో 1.69 కోట్లే ఎలాట్‌ చేసింది. రాష్ట్ర పథకాలకు కేంద్ర మద్దతుకై పాత బజెట్‌లో 3.38 లక్షల కోట్లు ఎలాటయితే, ప్రస్తుత బజెట్‌లో 2.04 లక్షల కోట్లు ఎలాట్‌ చేసింది. ఇంకో 20 ముఖ్యమైన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా మార్చబోతున్నామని ప్రకటించి, ఆ నిష్పత్తిని నిర్ధారించే పని బిజెపి సిఎం చౌహాన్‌ నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది. వాళ్ల రిపోర్టు ఎలా వుంటుందో వూహించడానికి చిన్న సంకేతం – వీటి కింద కేంద్ర వాటాను 1.38 లక్షల కోట్ల నుండి  ప్రస్తుత బజెట్‌లో 0.78 లక్షల కోట్లకు తగ్గించేసింది. ఈ లెక్కన గతంలో కంటె కేంద్రం రాష్ట్రాలకు 90 వేల కోట్లు తక్కువగా యిస్తోంది. ఇలాటి కేంద్రం ఆంధ్రకు నిధులు కట్టబెడుతుందంటే ఎలా నమ్ముతాం? పైగా 14 నెలల్లో మన అనుభవం ఏం చెపుతోంది? హుదూద్‌కు మనం అడిగినదెంత? వాళ్లు యిచ్చినదెంత? ఇవన్నీ చూసిన ఆంధ్రులకు కేంద్రం ఒరగబెడుతుందంటే నమ్ముతారా?

నమ్మలేదని బాబుకు కూడా తోచినట్టుంది. అందువలన బుధవారం ఉదయం నుంచి రాత్రివరకు చర్చలు జరిపి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు – దానిలో కూడా స్పష్టత లేదు. బాబు మాటలను రిపోర్టు చేస్తూ ఆ వార్తను ''ఈనాడు'' 'ప్రత్యేక హోదా యిచ్చి తీరాల్సిందే' అనే శీర్షిక కింద వేస్తే ''సాక్షి'' 'హోదా తోనే అన్నీ రావు' అనే శీర్షికతో యిచ్చారు. ఆంధ్రభూమి 'ప్రజలకే చెబుతా' అనే శీర్షికతో యిచ్చారు. వివరంగా చూడబోతే – 'విభజన సందర్భంగా ప్రత్యేక హోదా వంటి అనేక హామీలు తెరపైకి వచ్చాయి, ప్రస్తుతం ఏం జరుగుతోంది, హామీలు నెరవేరకపోతే ప్రత్యామ్నాయాలు ఏమిటి అనే విషయాలను ప్రజల ముందు  ఐదు రోజుల్లో వుంచుతా, నీతి ఆయోగ్‌ ఏర్పాటు ద్వారా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు చాలా మేర నిధుల కేటాయింపులో కోత పడింది, మనకూ ఆ హోదా వస్తే మనకూ కోత పడి హోదా వలన నష్టపోతాం.' అని ఆంధ్రభూమి రాయగా, సాక్షి యివన్నీ రాస్తూ 'ప్రత్యేక హోదా రాదని మనమే ఒక నిర్ణయానికి రావడం సరికాదు, దీనిపై ప్రధాని స్పష్టత యివ్వాల్సి వుంది' అని అన్నారని జోడించింది. ఈనాడు మాత్రం 'ప్రత్యేక హోదా యిస్తే లాభాలను గుర్తుంచుకోవాలి, ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు యిచ్చిన హామీల మేరకు ప్రత్యేక హోదా యివ్వాల్సిందే' అని అన్నట్టు రాసింది. ఆ సమావేశంలో బాబు యితర విషయాలు కూడా మాట్లాడారు.

ఆంధ్రజ్యోతికి అదే ముఖ్యంగా తోచింది 'టి-సర్కారు కలిసి రావటం లేదు' అని శీర్షిక పెట్టి కింద వార్తలో ప్రత్యేక హోదా గురించి ఏమీ రాయలేదు. అయితే బాబును ఉటంకించకుండా న్యూస్‌ ఎనాలిసిస్‌లో భాగంగా -ట కబుర్లు రాశారు. దాని ప్రకారం బిజెపి ప్రత్యేకహోదాకు బదులు ప్యాకేజీ యిద్దామనుకుంటోందని, ఆ ప్యాకేజీ ఎలా వుంటుందో తమతో చర్చించి ఫైనలైజ్‌ చేయాలని బాబు అంటున్నారనీ రాశారు. ఈ ప్యాకేజీలో పారిశ్రామిక రాయితీలు వుండాలని బాబు ఆలోచనట. జిఎస్‌టి వచ్చిన తర్వాత దేశమంతా ఒకే రకమైన పన్నులు వుంటే ఏపికి ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఎలా యిస్తామని బిజెపి అంటోందట. మొత్తం మీద చూస్తే బాబు మాటలు ఒక్కోరికి ఒక్కోలా అర్థమయ్యాయని తెలుస్తోంది. 

తను సమైక్యవాదో, ప్రత్యేకవాదో చెప్పకుండా కాలక్షేపం చేసేసిన చంద్రబాబు యిప్పుడు కూడా ప్రత్యేక హోదా అవసరమో కాదో తేల్చడం లేదు. కాస్సేపు  కావాలంటారు, కాస్సేపు దాని వలన ఒనగూడేది లేదు, రాయితీలు, ప్రోత్సాహకాలు, నిధులు వుంటే బెటరు కదా అంటారు. మరి ఈ ఆలోచన ఈశాన్య రాష్ట్రాల వారికి ఎందుకు లేదో!? వాళ్లు కూడా మాకు హోదాలు వద్దు, నిధులివ్వండి అనవచ్చుగా. అనడం లేదెందుకు? వాళ్లేనా, బిహార్‌, ఒడిశా, తెలంగాణ అందరూ అడుగుతున్నారు. హోదా వలన లాభం ఏదీ లేకపోతే వాళ్లు అడుగుతారా? హోదా వుంటే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా రాష్ట్రం పుంజుకుంటుంది. ఇది తెలిసే అందరూ అడుగుతున్నారు. కొందరు సాధిస్తున్నారు. బాబుకు హోదా తెప్పించలేకపోతే చేతకాదని చెప్పి చేతులెత్తి దణ్ణం పెట్టేస్తే సరిపోతుంది. ఎవరూ కొరత వేయరు. ఇంకో నాలుగేళ్ల పాటు పాలించమని అధికారం ముందే యిచ్చారు. దిగిపొమ్మనరు.

పరిశ్రమలంటారా, ఎన్ని వస్తే అన్ని వస్తాయి. సినిమా పరిశ్రమలో ఎక్కువమంది ఆంధ్రులున్నారు కాబట్టి ఆంధ్రకు తరలిపోతుందనుకున్నారు. ఇప్పుడా సూచనలేమీ కనబడటం లేదు. ఇక్కడ స్టూడియోలు కట్టుకున్న వారిని ఆకట్టుకోవడానికి కెసియార్‌ 'ఫిల్మ్‌ నగర్‌లో వున్న వాటి మార్కెట్‌ వేల్యూ పెరిగింది కాబట్టి స్టూడియోలను ఊరికి దూరంగా మరో చోటకు తరలించే మాటయితే ప్రస్తుతం అవి వున్న చోట షాపింగు కాంప్లెక్సులు కట్టుకోవడానికి అనుమతిస్తాం' అనేశారు. సినిమా షూటింగులకు అంతరాయాలు, రిలీజ్‌కు ముందు బెదిరింపులు అన్నీ ఆగిపోయినట్లున్నాయి. తక్కిన పరిశ్రమలు కూడా తరలిపోవడానికి తొందరగా ఏమీ లేవు. దానికి బాబు కాదు, మరొకరు ముఖ్యమంత్రిగా వున్నా చేయగలిగేది ఏమీ లేదు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించి, హోదా గురించి, రాయితీల గురించి ఆశలు పెట్టుకోకండి, ఉన్నదాంట్లో సర్దుకుందాం అని చెప్తే సరిపోతుంది. బుకాయింపులతో మోసం చేయడం ప్రమాదకరం. (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

[email protected]

Click Here For Archives