తిరుపతి టికెట్ విషయంలో ఇటు జనసేన, అటు టీడీపీ నాయకులు పవన్‌కల్యాణ్‌పై బ్లాక్ మెయిల్‌కు తెగబడ్డారు. పొత్తులో భాగంగా తిరుపతి సీటును చంద్రబాబునాయుడు జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని బరిలో నిలపాలని పవన్ భావించారు. ఈ మేరకు ఆయన పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి.
దీంతో తమకు టికెట్ లేదనే అక్కసుతో టీడీపీ, జనసేన నాయకులు తిరుపతిలో ఒక హోటల్‌లో సమావేశమై తమ అక్కసు వెళ్లగక్కారు. స్థానికేతరుడు, ఇంత కాలం అధికార పార్టీలో ఉన్న ఆరణికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించడం గమనార్హం. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే… ఇంతకాలం పవన్‌కల్యాణ్ వెంటే నీడలా వుంటూ, ఎంతో నమ్మకస్తుడిగా నటించిన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్‌రాయల్ కూడా టీడీపీ అసంతృప్త నేతలతో జత కట్టారు.
అసలు ఆరణి శ్రీనివాసుల్ని తిరుపతిలో అడుగు పెట్టనివ్వమని టీడీపీ నేతలు ఊకా విజయ్‌కుమార్, పెద్దబ్బ, పులిగోరు మురళీధర్‌రెడ్డి హెచ్చరిస్తుంటే, అడ్డుకోవాల్సిన పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, అందుకు విరుద్ధంగా వంత పాడడం గమనార్హం. అంటే పవన్‌కల్యాణ్ ఏమీ ఆలోచించకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారా? అనే అనుమానం వీళ్ల తిరుగుబాటును చూస్తే కలుగుతోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు, తంబళ్లపల్లె అభ్యర్థులుగా గురజాల జగన్‌మోహన్, జయచంద్రారెడ్డి అనే కాంట్రాక్టర్లను చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్లకు కనీసం టీడీపీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. అయినప్పటికీ చంద్రబాబు క్యాష్ సమీకరణల రీత్యా వారిని తెరపైకి తెచ్చారు. వీళ్లద్దరిని మార్చాల్సిందే అంటూ స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తంబళ్లపల్లె టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ అనుచరులు ఏకంగా విజయవాడ పార్టీ కార్యాలయం వద్దకెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంటామని హెచ్చరించారు.
అలాగే చిత్తూరు టికెట్ తమ సామాజిక వర్గానికే కేటాయించాలని, చంద్రబాబు సామాజిక వర్గానికి ఎలా ఇస్తారంటూ బలిజలు చిత్తూరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అయినప్పటికీ చంద్రబాబు చలించలేదు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, పార్టీకి నిజమైన విధేయులైన వారెవరైనా అనుసరిస్తారు.
అదేంటో గానీ, తిరుపతిలో జనసేన, టీడీపీ నాయకులు ఒక్కసారిగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆరణి శ్రీనివాసులుకు టికెట్ ఇవ్వకూడదని ఎందుకు డిమాండ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. అయినా జనసేనకు సీటు కేటాయించిన తర్వాత , అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలో టీడీపీ నేతలు చెబితే ఎలా? వీరికి కిరణ్‌రాయల్, పసుపులేటి హరిప్రసాద్ మద్దతు పలకడం అంటే, తమ నాయకుడిపై మిత్రపక్ష పార్టీ శ్రేణుల్ని దగ్గరుండి ఎగదోలుతున్నట్టుగా వుంది.
ఇప్పటికే పవన్‌కల్యాణ్ చాలా స్పష్టంగా… సలహాలు ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చారు. వ్యూహాన్ని తనకు వదిలి పెట్టాలని ఆయన పదేపదే కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి టీడీపీ, జనసేన నేతల బెదిరింపు, ధిక్కార రాజకీయాలకు పవన్ భయపడతారా? అనే చర్చకు తెరలేచింది.