జనసేనాని పవన్‌కల్యాణ్ అజ్ఞాన కామెంట్స్‌పై అనుకున్నట్టే అవుతోంది. పిఠాపురంలో పవన్‌కల్యాణ్ పోటీ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ, మరో జనసేన నాయకుడికి మద్దతు ఇవ్వరని అంతా ఊహించారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తానని, ఒకవేళ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా బరిలో దిగుతానని పవన్‌కల్యాణ్ మంగళవారం స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో కాకినాడ ఎంపీగా నిలబెట్టాలని అనుకుంటున్న ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురంలో పోటీ చేస్తారని పవన్ తెలిపారు. ఈ కామెంట్స్‌పై వివాదం చెలరేగింది. పిఠాపురంలో జనసేన నాయకుడు ఉదయ్ శ్రీనివాస్ నిలబడొచ్చనే పవన్ కామెంట్స్‌పై టీడీపీ ఇన్‌చార్జ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
పవన్‌కల్యాణ్ కాకుండా మరెవరో పోటీ చేస్తానంటే తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని వర్మ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తేనే ఆయన గెలుపు కోసం పని చేస్తానని ఆయన చెప్పారు. అంతే తప్ప, పవన్ ప్రకటించిన జనసేన నాయకుల పల్లకీ మోయడానికి సిద్ధంగా లేనని ఆయన తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయకపోతే టికెట్ నీకే అని చంద్రబాబు తనతో అన్నట్టు వర్మ వెల్లడించడం విశేషం. కావున పవన్ పోటీ చేయకపోతే బరిలో తానే వుంటానని ఆయన మరోసారి తేల్చి చెప్పారు.
పవన్‌కల్యాణ్ పిఠాపురంపై అనవసర కామెంట్స్ చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏవేవో అనుకున్నవన్నీ బయటికి చెప్పాల్సిన అవసరం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ అజ్ఞానంగా మాట్లాడ్డం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం వుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.