వైసీపీలో అంతా ఒక్కటి అయినట్లేనా?

గాజువాక వైసీపీకి ఎంతటి ప్రతిష్టాత్మకమో తెలిసిందే. ఆ పార్టీ 2019లో పవన్ కళ్యాణ్ నే ఓడించి విజయ ఢంకా మోగించింది. ఈసారి ఆ సీటులో మంత్రి గుడివాడ అమర్నాథ్ ని నిలబెడుతోంది. అయితే అమర్నాధ్…

గాజువాక వైసీపీకి ఎంతటి ప్రతిష్టాత్మకమో తెలిసిందే. ఆ పార్టీ 2019లో పవన్ కళ్యాణ్ నే ఓడించి విజయ ఢంకా మోగించింది. ఈసారి ఆ సీటులో మంత్రి గుడివాడ అమర్నాథ్ ని నిలబెడుతోంది. అయితే అమర్నాధ్ పేరుని డైరెక్ట్ గా ప్రకటించలేదు. డిసెంబర్ 12న స్థానిక కార్పోరేటర్ చందూని గాజువాక వైసీపీ ఇంచార్జిగా ప్రకటించారు. మూడు నెలలు పోయాక మార్చి 12న గుడివాడను గాజువాక వైసీపీ క్యాండిడేట్ అన్నారు.

ఈ మధ్యలో చందూ తానే ఎమ్మెల్యే అభ్యర్ధి అని ప్రచారం చేసుకున్నారు. ఆయన వెనక బలమైన సామాజిక వర్గం ఆశలు కూడా ఉన్నాయి. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుమారుడికి సీటు కోసం పట్టుబట్టారు. ఆయన ఆశలు కూడా అలాగే ఉండగానే మంత్రికి రాజమార్గం చేశారు.

ఈ పరిణామాలతో బలంగా ఉన్న గాజువాక వైసీపీలో కోరి అధినాయకత్వం కొత్త చిచ్చు రాజేసినట్లు అయింది. ఇపుడు ఆ చిక్కు ముడులను విప్పుకోవడం గుడివాడకు తలకు మించిన భారం అవుతోంది. ఒకరేమో సిట్టింగ్ ఎమ్మెల్యే, టికెట్ తనకే రావాలన్నది ఆయన బాధ.

మరొకరు మూడు నెలలుగా ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆశల పల్లకిలో ఉంటూ అకస్మాత్తుగా నేలకి దించేయబడిన వారు. ఈ ఇద్దరు బలమైన నాయకులు వారి వెనక ఉన్న కీలక సామాజిక వర్గాలను కలుపుకుని పోవడం మంత్రికి తలకు మించిన భారం అవుతోంది. మొత్తానికి ఆయన అందరినీ కలుస్తున్నారు.

తనకు పోటీ చేయడం ఇష్టం లేదని ముఖ్యమంత్రి జగన్ ఎదుటే ఈ నెల 7న జరిగిన అనకాపల్లి సభలో చెప్పాను అని గుడివాడ తాజాగా జరిగిన పార్టీ కార్యక్రమంలో చెప్పారు. అయినా అన్ని రాజకీయ సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ గాజువాకను తనను పంపారని ఆయన అన్నారు. అందువల్ల అంతా జగన్ మాట మీద పనిచేయాలని ఆయన కోరారు. గాజువాక అభివృద్ధి చెందాలన్నా ఏపీ బాగుపడాలన్న జగన్ రెండవసారి సీఎం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.

మంత్రి గుడివాడ ఈ విధంగా అన్ని వర్గాలను సర్దుబాటు చేసుకుంటూ మెల్లగా అడుగులు వేస్తున్నారు. కూటమి అభ్యర్ధిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దూసుకెళ్ళిపోతున్నారు. అక్కడా అసంతృప్తులు ఉన్నాయి. అక్కడా జనసేన నుంచి టికెట్ ఆశించిన వారు ఉన్నారు. రెండు పార్టీలు కలవగా లేనిది ఒక పార్టీలో నేతలు వర్గాలుగా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని వైసీపీ హితైషులు సూచిస్తున్నారు. ఇపుడిపుడే దారికి అంతా వస్తున్నారు. ఈ గ్రూప్ ఫోటో మే 13 దాకా అలాగే కొనసాగితే గాజువాకలో ఫ్యాన్ గాలి బాగానే వీస్తుంది అని అంటున్నారు