ప్రముఖ పారిశ్రామికవేత్త, రాయలసీమ బలిజ నాయకుడు గంటా నరహరి జనసేన వీడి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రెండు వారాలకే జనసేనపై ఆయనకు మొహమెత్తడం గమనార్హం. జనసేనాని పవన్‌కల్యాణ్ మాట నిలబెట్టుకోలేరని చాలా త్వరగా గ్రహించి, ఆ పార్టీలో వుంటూ రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఆయన అనుకున్నారు. దీంతో జనసేన నుంచి వెంటనే బయటపడ్డారు.
2022లో టీడీపీలో ఆయన చేరారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గంటా నరహరిని రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ఆర్థిక వనరులు పుష్కలంగా వున్నాయనే ఉద్దేశంతోనే ఆయన్ను పార్టీలోకి తీసుకుని, రాజంపేట బాధ్యతలు అప్పగించారు. టీడీపీ కోసం ఆయన డబ్బు బాగా ఖర్చు పెట్టారు. ఏమైందో తెలియదు కానీ, నరహరిని చంద్రబాబు పక్కన పెట్టారు.
ఈ నేపథ్యంలో జనసేనకు ఆయన టచ్‌లోకి వెళ్లారు. గత నెల 11న పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకున్నారు. తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇస్తానని పవన్ హామీ ఇచ్చారనే ప్రచారం అప్పట్లో జరిగింది. చివరికి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి సీటు ఇచ్చారు. బహుశా తనకు మాట ఇచ్చి, తప్పాడనే కోపంతో ఆయన జనసేన వీడినట్టున్నారు.
దివంగత టీటీడీ చైర్మన్ డీకే ఆదికేశవులునాయుడికి గంటా నరహరి సమీప బంధువు. తనను మోసగించిన పవన్‌కు గుణపాఠం చెప్పేందుకే నరహరి వైసీపీలో చేరినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. కానీ జనసేనలో పట్టుమని గట్టిగా రెండు వారాలు కూడా ఉండకపోవడం చర్చనీయాంశమైంది.