అంతా మంచి వాళ్లే, అయితే దాంపత్యబంధంలో రకరకాల గొడవలు రేగుతూ ఉంటాయి. కలిసి ఉన్నా లేని పోని దుఖాలు తలెత్తుతూ ఉంటాయి ఆ గొడవలతో! మరి సమస్య ఎక్కడ అంటే.. ఏ సమస్యను అయినా అవతలి వారి కోణం నుంచి ఆలోచించకపోవం వల్ల అని సులభంగా తీర్మానించవచ్చు.
భార్యభర్తల మధ్యన లేదా ప్రేమికుల మధ్యనో, ఇంకా సహజీవనంలో ఉన్న వారి మధ్యనో.. ఏ సమస్యను అయినా అవతలి వారి కోణం నుంచి ఆలోచిస్తే పరిష్కారం ఇవతలి వారికి కూడా సులభంగా అర్థం అవుతుంది. అయితే అలా చేయాలంటే రకరకాల అభ్యంతరాలు అంతర్గతంగా పేరుకుని ఉంటాయి. మరి అలా తెలీకుండానే బంధంలో జరిగే పొరపాట్లు ఏమిటంటే.. వాటి గురించి రిలేషన్షిప్ కౌన్సెలర్లు వివరంగా చెబుతారు. అదెలాగంటే!
వినే అలవాటు లేకపోవడం!
చాలా మంది చెప్పడంలో చక్కగా వ్యవహరించినా, వినడంలో మాత్రం సరిగా వ్యవహరించారు! పార్ట్నర్ చెప్పే విషయాలను అయితే మరీ లెక్కలేనట్టుగా వ్యవహరిస్తారు. దీన్ని నిరాకరించవచ్చు కానీ, పార్ట్ నర్ ఎంతగానే విశదీకరించి చెప్పాలనే విషయాలను వినడానికి అస్సలు ఆసక్తి ఉండదు. చాలా విషయాల్లో అలాంటి అనాసక్తి, పట్టించుకోకపోవడం, వినకపోవడం చాలా మందికి ఉండే అలవాటే. ఇది పెద్ద విషయం అని కూడా వారు అనుకోవచ్చు. పార్ట్ నర్ చెప్పేదీ పెద్ద విషయం కాదు, తాము సరిగా వినిపించుకోకపోవడమూ పెద్ద విషయం కాదనుకోవచ్చు. కానీ ఇది ఈ అలవాటు సరి కాదనేది రిలేషన్ షిప్ కౌన్సెలర్ల మాట!
ఎమోషనల్ నీడ్స్ ను పట్టించుకోకపోవడం!
కావాల్సినవన్నీ కొనిస్తున్నాం, చెప్పిన పనులన్నీ చేసి పెడుతున్నాం, ఫిజికల్ నీడ్స్ ను తీరుస్తున్నాం.. ఇంతకన్నా పార్ట్ నర్ గా చేసేది ఏం ఉంటుందనేది కూడా చాలా సహజమైన భావనే! అయితే బంధంలో ఎమోషనల్ నీడ్స్ ను తీర్చడం అనేది కీలకమైన బాధ్యతే. అయితే దీనిపై చాలామందికి ఆసక్తి ఉండదు. ఇరువురి ఎమోషన్లలో స్పష్టమైన తేడాలుంటాయి, ఇరువురి దృక్పథాలూ వేరే ఉండటం వల్ల ఒకరి ఎమోషన్స్ ను మరొకరు పట్టించుకోకపోవచ్చు. దీని వల్లే ఏర్పడే గ్యాప్ ను పూరించుకోవాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉంటుందంటున్నారు కౌన్సెలింగ్ లో అనుభవజ్ఞులు!
కొన్ని చర్చలకు ఇష్టపడకపోవడం!
దాంపత్యంలోనో, కుటుంబ పరంగానో, వ్యక్తిగతంగానో తలెత్తే కొన్ని రకాల సమస్యలను చర్చించడానికి ఇష్టపడకపోవడం, దాటేయాడం సరైన పద్ధతి కాదనేది నిపుణుల మాట. ఇబ్బందికరమైన అంశమో, కాసేపు వాతావారణాన్ని వాడీవేడిగా మార్చే అంశం గురించి అయినా మాట్లాడుకోవడం మంచి పద్ధతి. దాటేయడం వల్ల తాత్కాలికంగా సమస్యకు పరిష్కారం లభించినా, దీర్ఘకాలంగా అది నానడానికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుందనేది నిపుణులు చెప్పే అంశం.
గ్రాంటెడ్ గా తీసుకోవడం!
భార్యను భర్త గ్రాంటెడ్ గా తీసుకోవడం లేదా భర్తను భార్య గ్రాంటెడ్ తీసుకోవడం, ఇది కూడా మన సొసైటీలో బాగా ఉండే అలవాటు! భర్త ఎంత మేధావి అయినా భార్యకు ఇంట్లో లోకువే, భార్యలు భర్తలకు ఎన్ని రకాలుగా లోకువో వేరే చెప్పనక్కర్లేదు. గ్రాంటెడ్ గా తీసుకోవడం సహజమైన అలవాటు. అయితే స్పెషల్ గా ట్రీట్ చేస్తే దక్కే ఆనందం ఎంతుటుందో అర్థం అయితే గ్రాంటెడ్ గా తీసుకోవడం ఉండకపోవచ్చు!
మైండ్ రీడింగ్ తెలీదు!
తమ పార్ట్ నర్ కు తమ మైండ్ రీడ్ ను చేసే ఎబిలిటీ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఎన్నాళ్లు కాపురం చేసినా కొన్ని విషయాల్లోనే పార్ట్ నర్ ను అర్థం చేసుకోవడం సాధ్యం అవుతుంది. అన్ని వేళలా మైండ్ రీడింగ్ సాధ్యం కాదనే విషయాన్ని గుర్తుంచుకుని, పార్ట్ నర్ కు అర్థమయ్యేలా చేయడం మంచి పద్ధతి అవుతుంది!