వైసీపీ విజయానికి టీడీపీ నాయకుడి చేరిక కలిసొచ్చేలా వుంది. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ నాయకుడు డాక్టర్ మస్తాన్‌యాదవ్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో చేరారు. గత నాలుగేళ్లుగా వెంకటగిరి నియోజకవర్గంలో డాక్టర్ మస్తాన్‌యాదవ్ సేవలందిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ డాక్టర్ అయిన మస్తాన్‌యాదవ్‌కు టికెట్ ఇస్తామని చంద్రబాబునాయుడు, లోకేశ్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన వెంకటగిరిలో టీడీపీ బలోపేతానికి శక్తికి మించి డబ్బు ఖర్చు పెట్టారు.
తీరా టికెట్ ఇచ్చే సమయానికి చంద్రబాబు, లోకేశ్‌లకు సొంత సామాజిక వర్గ నాయకులు గుర్తు కొచ్చారని మస్తాన్ యాదవ్ ఆరోపణ. వెంకటగిరి సీటు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మస్తాన్‌యాదవ్ మనస్తాపం చెందారు. తాను మోసపోయానని గ్రహించారు. మస్తాన్‌యాదవ్‌కు టికెట్ ఇవ్వకపోతే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బీసీలంతా టీడీపీకి వ్యతిరేకంగా పని చేస్తారనే ఆ సంఘాల హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదు.
వెంకటగిరిలో 30 శాతం యాదవుల ఓట్లు ఉన్నాయి. గెలుపోటముల్లో యాదవుల ఓట్లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి పేరును జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంకటగిరి వెళ్లి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఇంకా కొలిక్కి రాలేదు.
ఈ నేపథ్యంలో వెంకటగిరిలో వైసీపీ గెలుపుపై అనుమానాలున్నాయి. ఇదే సమయంలో మస్తాన్‌యాదవ్ వైసీపీలో చేరవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. మస్తాన్‌యాదవ్ టీడీపీని వీడడంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బే. మస్తాన్‌యాదవ్‌కు ద్రోహం చేశారనే ఆగ్రహం బీసీల్లో వుంది. ఇది వైసీపీకి కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.