వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ విజయాన్ని మరింత సులువు చేస్తున్నారు అని టీడీపీ తమ్ముళ్ళు అధినాయకత్వం మీద మండిపడుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తున్న సంగతి విధితమే. ఆయన మీద ఎవరికి పోటీలో పెట్టాలన్నది గత నెలన్నర రోజులుగా టీడీపీ సర్వేల మీద సర్వేలు చేయిస్తోంది. కానీ ఎటూ తేల్చుకోలేకపోతోంది.
బొత్సకు ధీటు అయిన అభ్యర్ధి ఈ రోజుకీ కానరాక టీడీపీ హై కమాండ్ ఆ సీటుని అలా ఖాళీగా అట్టేబెట్టేసింది. బొత్స మీద మాజీ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావుని వెళ్లమంటున్నారు. ఆయన ససేమిరా అనడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుని పోటీ చేయమంటున్నారు. ఆయన కాదు అంటే మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరుతో సర్వేలు చేస్తున్నారు.
ఇలా తడవకో పేరు చెబుతూ టీడీపీ సర్వే చేయిస్తోంది తప్ప బొత్స మీద పోటీకి వీరే అభ్యర్ధిని ప్రకటించడంలేదు. దీంతో చీపురుపల్లి ఇంచార్జి కిమిడి నాగార్జున వర్గం మండిపడుతోంది. అయిదేళ్ళుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న యువకుడు విద్యాధికుడు అయిన నాగార్జున పేరు ఎందుకు ప్రకటించరు అని ప్రశ్నిస్తున్నారు. ఏవేవో పేర్లతో హడావుడి చేయడం వల్ల జనాలకు కోరి బొత్సను బలమైన అభ్యర్ధిగా చెప్పకనే చెబుతున్నట్లుగా ఉందని అంటున్నారు.
బొత్స విషయం తీసుకుంటే ఆయన చీపురుపల్లిలో 2014లో ఓటమి పాలు అయ్యారని, ఆయనను ఓడించింది నాగార్జున తల్లి మాజీ మంత్రి కిమిడి మృణాళిని అని గుర్తు చేస్తున్నారు. చీపురుపల్లి టీడీపీకి కంచుకోటగా ఒకనాడు ఉండేదని, టీడీపీ ఆవిర్భవించాక ఇప్పటిదాకా తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు టీడీపీ గెలిచిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
ఇలా విలువైన సమయం అంతా అభ్యర్థుల ఎంపిక అంటూ గడిపేస్తుంటే వైసీపీ జనంలో దూసుకుపోతోందని దాని వల్ల చీపురుపల్లిలో మరోసారి ఆ పార్టీ గెలిచేందుకు ఆస్కారం కల్పించినట్లు అవుతోందని తమ్ముళ్ళు మధన పడుతున్నారుట.