ఇదిగో వైరల్ అవుతుంది.. అదిగో వైరల్ అవుతుంది అంటూ ఎదురు చూడ్డమే మిగిలింది. ఫ్యామిలీ స్టార్ నుంచి ఇప్పటివరకు వైరల్ సాంగ్ రాలేదు. ఓ పాట హిట్ అవ్వడం వేరు, వైరల్ అవ్వడం వేరు. ఈ విషయం అర్థం చేసుకున్నోళ్లకు ఫ్యామిలీ స్టార్ సినిమా పాటలకు సంబంధించి అసలు మేటర్ ఈజీగానే అర్థమౌతుంది.
గీతగోవిందం మేజిక్ ను రీ-క్రియేట్ చేయాలనేది ప్రాధమిక లక్ష్యం. అందుకే పరశురామ్-విజయ్ దేవరకొండ కలిశారు. అలా జరగాలంటే ముందుగా హిట్టవ్వాల్సింది పాటలే. అందుకే గోపీసుందర్ ను కూడా రిపీట్ చేశారు. ఇలా అన్నీ అనుకున్న విధంగా సెట్ చేశారు కానీ, వైరల్ సాంగ్స్ ను మాత్రం క్రియేట్ చేయలేకపోయారు.
గీతగోవిందం సినిమాకు రిలీజ్ కు ముందే అంత ఊపు రావడానికి కారణం ఒకే ఒక్క సాంగ్. సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఇంకేం కావాలే’ అనే పాట రోజుల వ్యవథిలో వైరల్ అయింది. సినిమాను హాట్ టాపిక్ గా మార్చేసింది. మరి అలాంటి పాట ఫ్యామిలీ స్టార్ లో ఎక్కడుంది?
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు 3 పాటలు రిలీజ్ చేశారు. సంగీత పరంగా, సాహిత్య పరంగా ఇవి బాగున్నాయి. హోలీ నాడు రిలీజ్ చేసిన మూడో పాట కూడా ఓకే. కానీ బాగుంటే సరిపోదు, వైరల్ అవ్వాలి. ఆ ఎలిమెంట్ మిస్సయిందిక్కడ.
గీతగోవిందంలో కూడా పాటలన్నీ బాగుంటాయి. కానీ ఆ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చేపాట సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ మాత్రమే. అలాంటి సాంగ్ ఫ్యామిలీ స్టార్ నుంచి ఇప్పటివరకు రాలేదు.
సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైమ్ ఉంది. బెస్ట్ సాంగ్స్ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసినట్టున్నాయి. సో.. ఈ సినిమా నుంచి వైరల్ సాంగ్ కోసం ఇక వెయిట్ చేయనక్కర్లేదు. పాటల పరంగా గీతగోవిందం మేజిక్ రీ-క్రియేట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక మిగిలింది సినిమా కంటెంట్ మాత్రమే.