లోక్ సభ ఎన్నికల్లో తొలి దశలో ఎన్నికలను జరుపుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది. తమిళనాట ఒకే విడతలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కానుంది. మొత్తం 39 లోక్ సభ నియోజకవర్గాలున్న తమిళనాడు రాజకీయం ఆసక్తిదాయకంగా ఉంది. ఏప్రిల్ 19న తమిళనాడులో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది!
ఇక్కడ ప్రధానంగా మూడు కూటములు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అందులో డీఎంకే-కాంగ్రెస్- కమ్యూనిస్టు పార్టీల కూటమి ముందుంది. అన్నాడీఎంకే మరో కూటమితో రెడీ అయ్యింది. బీజేపీ కూటమి తన లక్ ను పరీక్షించుకుంటోంది.
ఇండియా కూటమిలో డీఎంకే 22 లోక్ సభ సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ కు 9 సీట్లను పోటీకి కేటాయించింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఈ కూటమిలో చెరో రెండు ఎంపీ సీట్లలో పోటీ అవకాశాన్ని పొందాయి. ముస్లింలీగ్ కు ఒక సీటును, వైగోకు మరో ఎంపీ సీటును డీఎంకే కూటమి కేటాయించింది.
అన్నాడీఎంకే కూటమిలో ఆ పార్టీనే పెద్దన్నగా ఉంది. పళనిస్వామి సారధ్యంలోని అన్నాడీఎంకే ఏకంగా 32 సీట్లలో పోటీ చేస్తోంది. అన్నాడీఎంకేకు చోటామోటా మిత్రపక్షాలున్నాయి. వాటికి మిగిలిన ఏడు సీట్లలో పోటీకి ఛాన్సు ఇచ్చింది. ఇలా అన్నాడీఎంకే అన్ని సీట్లలో తన ఉనికిని చాటుకునే యత్నం చేస్తోంది.
ఇక బీజేపీ కూటమిలోనూ చాలా పార్టీలున్నాయి! వీటిల్లో టీటీవీ దినకరన్ కూడా ఉన్నాడు! శశికళ బంధువు అయిన దినకరన్ ను బీజేపీ గతంలో ఒక ఆటాడుకుంది! అయితే ఇప్పుడు దినకరన్ బీజేపీ మిత్రపక్షం. అతడు ఎంపీగా బరిలోకి దిగుతున్నాడు ఈ కూటమి తరఫున!
బీజేపీ మొత్తం 19 ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. మరో నాలుగు సీట్లలో బీజేపీ మిత్రపక్ష పార్టీలు నాలుగు బీజేపీ గుర్తు మీదే పోటీ చేస్తున్నాయట! ఈ కూటమిలో రెండో పెద్ద పార్టీ పీఎంకే! గతంలో యూపీఏ హయాంలో వెలిగిన అన్బుమణి రాందాస్ పార్టీ ఈ సారి బీజేపీ కూటమి తరఫున పది ఎంపీ సీట్లలో బరిలోకి దిగుతోంది. తమిళ మానిల కాంగ్రెస్ కూడా బీజేపీ కూటమిలో ఉంది. సైకిల్ గుర్తుమీద ఆ పార్టీ మూడు ఎంపీ సీట్లకు పోటీచేస్తోంది! తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం ఈ కూటమి మద్దతుతో ఇండిపెండెంట్ గా ఎంపీగా పోటీ చేస్తున్నారు!