ఏపీ బోర్డర్ నుంచి కర్ణాటకలో మొదలయ్యే మొదటి లోక్ సభ నియోజకవర్గం చిక్ బళాపుర్. ఈ లోక్ సభ సీటు పరిధి తెలుగు బెల్ట్ గా చెప్పదగిన అసెంబ్లీ సీట్లు వస్తాయి. బెంగళూరు నార్త్ లోని యలహంక అసెంబ్లీ నియోజకవర్గం వరకూ చిక్ బళాపూర్ లోక్ సభ సీటు విస్తరించి ఉంటుంది. ఇక్కడ నుంచి బీజేపీ తరఫున డాక్టర్ సుధాకర్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.
విశేషం ఏమిటంటే.. సదరు సుధాకర్ ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిక్ బళాపుర్ నుంచినే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు సుధాకర్ తరఫున ప్రచారానికి తెలుగు నటుడు బ్రహ్మానందం కూడా వెళ్లారు! అయితే సుధాకర్ ఎమ్మెల్యేగా నెగ్గలేదు, అప్పటికి మంత్రి హోదాలోని ఈ బీజేపీ నేత ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయితే ఇంతలోనే ఆయనకు ఎంపీ టికెట్ దక్కడం గమనార్హం!
అయితే చిక్ బళాపుర్ ఎంపీ టికెట్ ను మరో బీజేపీ నేత కుటుంబం ఆశించింది. యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ తన తనయుడు అలోక్ ను ఎంపీగా బరిలోకి దించాలనే ప్రయత్నం చేశారు. యలహంకలో వరసగా విజయాలను నమోదు చేస్తున్న ఈ బీజేపీ నేతకు ఇప్పుడు వారసుడిని ఎంపీగా గెలిపించుకోవాలనే ఆశ ఉన్నట్టుంది. ఇందుకోసం చిక్ బళాపుర్ సీటు గురించి గట్టిగా ప్రయత్నించారట! అయితే అధిష్టానం సుధాకర్ వైపు మొగ్గు చూపింది.
దీనిపై విశ్వనాథ వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఏమిటంటోంది! కుల సమీకరణాలనే సుధాకర్ వైపు బీజేపీ హైకమాండ్ మొగ్గుచూపిందనే టాక్ నడుస్తోంది. సుధాకర్ వక్కలిగ. విశ్వనాథ రెడ్డి. జనాభా పరంగా గట్టిగా ఉన్న వక్కలిగకు బీజేపీ మూడే సీట్లు ఇచ్చింది. అందులో చిన్నబళాపురం ఒకటి. ఇది కూడా లేదంటే.. వక్కలిగకు బీజేపీ రెండే సీట్లు ఇచ్చినట్టుగా అవుతుంది. మరోవైపు లింగాయత్ లకు గరిష్ట స్థాయి పోటీ అవకాశాలను ఇచ్చింది. వారికి బీజేపీ ఏకంగా తొమ్మిది ఎంపీ సీట్లలో పోటీకి అవకాశం ఇవ్వడం గమనార్హం. వక్కలిగల్లో సుధాకర్ తో సహా మరో ఇద్దరున్నారు. వారిలో ఒకరు యడ్యూరప్ప సన్నిహితురాలు శోభ, మరొకరు దేవేగౌడ మనవడు మంజునాథ!