2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పచ్చమీడియా ఇక టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయనే వాదనను మొదలుపెట్టింది. ఫలితాలు వచ్చిన రెండో రోజే.. ఓట్లు చీలిపోయాయంటూ గగ్గోలు పెట్టింది. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఓట్లన్ని గంపగుత్తగా కూడినా మహా అంటే ఇరవైలోపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందిన ఓట్లను దాటవు!
అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు వ్యూహాల మేరకే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారనేది బహిరంగ సత్యమే! 2019 ఎన్నికల్లో జనసేన లెఫ్ట్ పార్టీలను, బీఎస్పీని కలుపుకుని పోటీ చేయడం కూడా చంద్రబాబు లెక్కల మేరకే అనేది కూడా జగమెరిగిన సత్యం. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయనేది చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరికీ కలిగించిన అభిప్రాయమే!
దాదాపు ఏడాది, రెండేళ్ల నుంచి కలిసి పోటీ చేయడం గురించి వీరి కసరత్తులు సాగుతున్నాయి. పొత్తు ప్రకటన చేసింది చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కావొచ్చు! అయితే.. అంతకన్నా ముందు నుంచినే చంద్రబాబు, పవన్ లు అపర దోస్తులు! దత్తపుత్రుడు, దత్తతండ్రి అయిపోయారు! మరి వీరి బంధం ఇంత గాఢంగా ఉన్నా.. సీట్ల లెక్కలను మాత్రం ఇన్నాళ్లు తేల్చుకోలేకపోయారా! అనేది ఆశ్చర్యం కలిగించే అంశం!
అసలు పవన్ కల్యాణ్ పోటీ చేసే సీటు విషయంలో కూడా వీరు సరిగ్గా ఇన్నాళ్లూ చర్చించుకోలేదా అని వీరి వీరాభిమానులు సైతం నివ్వెరపోయారు పిఠాపురం రచ్చను చూసి! పిఠాపురంపై పవన్ కు కన్నుంటే.. అక్కడ టీడీపీ ఇన్ చార్జికి చంద్రబాబు ఎప్పుడో తగు సమాచారం ఇచ్చి పరిస్థితిని కంట్రోల్ లో పెట్టుకోవాల్సింది. కనీసం పవన్ ప్రకటనకు ఏ రెండు మూడు రోజుల ముందో అయినా వర్మను అక్కడ చంద్రబాబు సమాధాన పరచాల్సింది! అయితే పవన్ ప్రకటన చేయడం, వర్మ బ్యాచ్ రచ్చ చేయడంతో.. ఇన్నాళ్లూ చంద్రబాబు, పవన్ దేని గురించి చర్చించారు? అనే అనుమానానికి తెరలేపింది!
ఇది ఒక్క పిఠాపురంతో ఆగిపోలేదు.. జనసేన పోటీకి తెలుగుదేశం కేటాయించిన సీట్లు, జనసేన తరఫున అప్పటికే పవన్ అభ్యర్థులకు ఆశలు రేపిన సీట్లలో పీకులాట కొనసాగుతోంది! ఇంతజేసీ జనసేన పోటీకి తెలుగుదేశం కేటాయించింది 21 సీట్లు! ఈ మాత్రం సీట్లు కేటాయిస్తేనే ఇన్ని రచ్చలు జరుగుతున్నాయి. ఒకవేళ కాపు సంఘాల వాళ్లు కోరుకున్నట్టుగా ఏ యాభయ్యో, అరవై సీట్లలో పోటీకి అవకాశం ఇచ్చి ఉంటే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో!
ఏపీ ఏమీ యూపీలా పెద్ద పెద్ద రాష్ట్రం కాదు! తనది 40 యేళ్ల అనుభవం అని చంద్రబాబు చెప్పుకోని సందర్భం అంటూ ఉండదు! 294 అసెంబ్లీ సీట్లున్నప్పుడు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు సీఎంగా చేశారు! తెలుగుదేశం అధినేతగా అదనపు అనుభవమూ ఉంది! మరి ఇప్పుడు అంత పెద్ద రాష్ట్రం కాకపాయ.. అందునా మిత్రులతో ఆటలు చంద్రబాబుకు కొత్తా కాదు! పొత్తుల పితలాటకాలు ఆయనకు బోలెడున్నాయి! మరి ఇంతజేసీ.. 21 సీట్ల విషయంలో ఇన్నిన్ని రచ్చలు జరుగుతుండటం చంద్రబాబు నాయకత్వ పటిమ సన్నగిల్లిపోవడానికి రుజువులు కావా!