ఒకరకంగా ఎన్నికల ప్రచారం బాగా వేడి పుంజుకున్నట్లే లెక్క. ఇలాంటి కీలక సమయంలో పీసీసీ సారధి షర్మిల బెంగళూరు వెళ్లి అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి, డీకే శివకుమార్, ఏఐసీసీ సారథి మల్లిఖార్జున ఖర్గే తదితరులతో ఆంతరంగికంగా సమావేశం కావడం ప్రజల్లో రకరకాల చర్చకు అవకాశం ఇస్తున్నది.
కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న షర్మిల- ఓట్ల కొనుగోలుకు అవసరమైన నిధుల సమీకరణ కోసమే బెంగళూరు వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతున్నది.
కన్నడ నాట ఎన్నికలలో కీలక భూమిక పోషించిన డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్థికంగా కూడా అభ్యర్థులకు దన్నుగా నిలవ గల స్థాయి నాయకుడు! తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడం వెనుక కూడా డీకే శివకుమార్ కీలకంగా ఉండి చక్రం తిప్పారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల వంతు వచ్చింది. అయితే ఇక్కడ ఎక్కువ స్థానాలపై విజయం కోసం పాటుపడేంత అవసరం ఆ పార్టీకి లేదు. ఎక్కువ స్థానాలలో గెలవడానికి డబ్బు వెదజల్లే ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏదో పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అన్ని స్థానాల్లో పోటీకి దిగుతున్నారే తప్ప.. గెలుస్తామని కాదు!అయితే కడప ఎంపీ స్థానం మీద మాత్రం వారికి ఆశ ఉంది. కొంచెం కష్టపడి పని చేయగలిగితే విజయం దక్కుతుందని నమ్మకం కూడా ఉంది.
నిజానికి ధనవనరుల పరంగా వైఎస్ షర్మిలకు పెద్దగా లోటు లేనప్పటికీ, కడప ఎంపీ స్థానంలో ఎంత పెద్ద మొత్తాన్ని వెదజల్లే అయినా సరే గెలవాలనే కోరికతోనే, బెంగుళూరు వెళ్లి డీకే బ్రదర్స్ ను ఆశ్రయించినట్లు సమాచారం. కడప ఎంపీగా షర్మిల గెలిస్తే జగన్మోహన్ రెడ్డికి నైతిక ఓటమి అవుతుందనే సంగతి అందరూ అనుకుంటున్నదే. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల మీద ఎంతో కొంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నదనే వార్తలు వినవస్తున్నాయి.
రాజకీయ వర్గాల్లో ఇంకో చర్చ కూడా జరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి మీద నిరంతరాయంగా బురదచల్లుతూ, ఆయనను బద్నాం చేయడానికి షర్మిల చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబునాయుడు స్పాన్సర్ చేస్తున్నారని.. అందుకే, ఆయన స్క్రిప్టునే షర్మిల ప్రతిచోటా చదివి వినిపిస్తున్నారనే అభిప్రాయం పలువురిలో ఉంది.
ఇటీవలి కాలంలోనే.. విమానాశ్రయంలో డికె శివకుమార్, చంద్రబాబునాయుడు ఇద్దరూ ఆంతరంగికంగా సాగించిన మంతనాలు కూడా ఇలాంటి అనుమానాలు వ్యాప్తి చెందడానికి ఒక కారణం. పైగా షర్మిలను కాంగ్రెసులోకి ఆహ్వానించి, ఆమెకు పీసీసీ సారథ్యం కట్టబెట్టడం వెనుక డికే శివకుమార్ హస్తమే ఎక్కువగా ఉంది. అలాంటి నేపథ్యంలో.. గ్రీన్ సిటీ బెంగుళూరులో జరిగిన మంతనాల వెనుక ఎలాంటి మంత్రాంగం అయినా ఉండవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.