ఎంపీ ఎటుపోయినా సినిమాకు ప్రమోషన్ బాగుంది!

ఇప్పుడు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఏపీలో ఆరు ఎంపీ స్థానాల్లోనూ, 30 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించబోతున్నదట. ఆ రకంగా రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా సరే, అందులో కాంగ్రెస్…

ఇప్పుడు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఏపీలో ఆరు ఎంపీ స్థానాల్లోనూ, 30 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించబోతున్నదట. ఆ రకంగా రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా సరే, అందులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతున్నదట. ఈ జోస్యం చెప్పింది ఎవరో తెలుసా..? సాక్షాత్తూ ఆ పార్టీ సారథి షర్మిల గానీ, మరో కీలక సీనియర్ నాయకులు గానీ కాదు. నిన్నటిదాకా ఆయన పేరు రాజకీయ నాయకుడిగా పెద్దగా పాపులర్ కాకపోయినప్పటికీ.. విశాఖ ఎంపీగా అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న పులుసు సత్యానారాయణ రెడ్డి (సత్యారెడ్డి) చెబుతున్న మాటలివి.

సత్యారెడ్డి అనే వ్యక్తి ఇప్పుడంటే ఎంపీగా బరిలో ఉన్నారు గానీ.. సినిమా నిర్మాతగా ఇప్పటికే చాలా పాపులర్ అని అనుకోవాలి. సంఖ్యాపరంగా ఎన్ని చిత్రాలు నిర్మించారు అనేదే గనుక కొలబద్ధ అయ్యేట్లయితే.. ఈ సత్యారెడ్డి కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు చాలా పెద్ద నిర్మాతల్లో ఒకరు కింద లెక్క. ఇప్పటిదాకా ఆయన 53 సినిమాలను నిర్మించారు. 

గుంటూరు జిల్లాకు చెందిన ఈ సత్యారెడ్డి, విశాఖలో స్థిరపడ్డారు. తెలుగుసేన అనే పార్టీని కూడా స్థాపించారు గానీ, తర్వాత కాంగ్రెసులో చేరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేశారు. అదే పాయింట్ మీద ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా తీశారు. అందులో ఉద్యమనేతగా హీరోపాత్ర కూడా ఆయనే పోషించారు. దర్శకత్వం కూడా ఆయనే. ప్రజాగాయకుడు గద్దర్ నటించిన చివరి చిత్రం అది.

53 సినిమాలు నిర్మించినప్పటికీ.. హీరో నిర్మాత దర్శకుడు పాత్రలన్నీ పోషించినప్పటికీ సత్యారెడ్డి పెద్దగా పాపులర్ కాకపోవడానికి, ఆయన నిర్మించిన సినిమాల పేర్లు కూడా ఎవ్వరికీ తెలియకుండా పోవడానికి తప్పు ఆయనది కాకపోవచ్చు. మొత్తానికి ఎంపీ టికెట్ అయితే దక్కింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఉంటూ.. పనిలో పనిగా తన సినిమా ‘ఉక్కు సత్యాగ్రహం’ ను కూడా ఆయన ప్రమోట్ చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న సత్యారెడ్డి.. స్టీల్ ప్లాంట్ కోసం సినిమా తీశానంటూ దాని గురించి కూడా చెప్పుకున్నారు. హీరోగా, దర్శకుడిగా తన బహుముఖ ప్రతిభ విశాఖ వాసులకు తెలిసేలాగా.. విశాఖ థియేటర్లలో ఆ సినిమా ఫ్రీ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారేమో అని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఎంపీ ఎన్నికల పుణ్యమాని.. గెలుపు సంగతి ఎలా ఉన్నా.. ఆయన సినిమాకు బాగానే ప్రమోషన్ దక్కుతోందని చర్చించుకుంటున్నారు.