Advertisement

Advertisement


Home > Politics - Analysis

స్టార్ క్యాంపెయినర్లు స్టేటుకా? పిఠాపురానికా?

స్టార్ క్యాంపెయినర్లు స్టేటుకా? పిఠాపురానికా?

ఏ రాజకీయ పార్టీకి అయినా సరే స్టార్ క్యాంపెనర్లు అంటే రాష్ట్రమంతా తిరిగి ఆ పార్టీని విజయపథాన నడిపించగల సత్తా కలవారై ఉండాలి. పార్టీ ఎక్కడెక్కడ అయితే పోటాపోటీగా తలపడుతున్నదో ఆయా నియోజకవర్గాలలో పర్యటించి తమ సెలబ్రిటీ హోదా ద్వారా అదనంగా కొన్ని ఓట్లను రాబట్టడం ద్వారా పార్టీకి విజయాలను అందించాలి. అంతే తప్ప బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా క్యాంపైనింగ్ స్టార్లు అని చెప్పుకునే వాళ్ళందరూ పవర్ స్టార్ చుట్టూ మూగి ఆయన నియోజకవర్గంలో మాత్రం పని చేస్తూ ఉంటే ఆ వ్యవహారం చాలా కామెడీగా ఉంటుంది. కానీ ఇప్పుడు జనసేన పార్టీలో అదే జరుగుతోంది.

‘ప్రజలు ఆశీర్వదిస్తే నేను ముఖ్యమంత్రి అయిపోతాను’ అని ప్రగల్భాలు పలుకుతూ ఉండే పవన్ కళ్యాణ్.. కనీసం తన పార్టీకి సరైన స్టార్ క్యాంపెయినర్లను ఏర్పాటు చేసుకోలేకపోవడం జాలి గొలిపే సంగతి. నాగేంద్రబాబు, అంబటి రాయుడు లను మినహాయిస్తే ఎందుకు కొరగాని అనాకానీ జబర్దస్త్ బ్యాచ్ ను స్టార్లుగా ఆయన పరిగణించడం ప్రజలకు నవ్వు తెప్పించిన విషయం. కాగా తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన స్టార్ క్యాంపెనర్ జబర్దస్త్ ఆది, ఆ సీటు నుంచి పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారంటూ జోస్యం చెప్పారు.

పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో లక్ష ఓట్లు మెజారిటీ వస్తుందా? అంతకంటే ఎక్కువే వస్తుందా? అనేది వేరే సంగతి. కానీ ఆయన విజయం గురించి చెప్పడానికి అక్కడికి స్టార్ క్యాంపెనర్లు వెళ్లి ఉద్ధరించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అసలే ఫస్ట్ ర్యాంక్ స్టార్ క్యాంపెయినర్ నాగేంద్రబాబు కొన్ని రోజులుగా పిఠాపురంలోనే తిష్ట వేసి తమ్ముడు విజయం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. మళ్లీ ఆదిలాంటి వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఏమిటి?

నిజానికి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పలు విడతలుగా సర్వేలు చేయించి కాపు ఓటు బ్యాంకు అత్యంత స్థిరంగా పదిలంగా ఉండే పిఠాపురం నియోజకవర్గంను వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. కాపు ఓట్లు అన్ని గంపగుత్తగా పడతాయనేది ఆయన నమ్మకం. దానికి తోడు ఐదేళ్ల నుంచి ఆ నియోజకవర్గంలో కష్టపడి పని చేసుకుంటున్న తెలుగుదేశం అభ్యర్థి వర్మ ఇప్పుడు బాధ్యత మొత్తం భుజాన వేసుకొని పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇన్ని సమీకరణాల మధ్య పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే అది అద్భుతం ఎంత మాత్రమూ కాదు.

కానీ ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు కూడా పిఠాపురానికి వెళ్లి పవర్ స్టార్ కోసం పనిచేయడం కామెడీ కాక మరేమిటి. ఈ క్యాంపెయినింగ్ స్టార్లకు నిజంగా అంత సత్తా ఉంటే పోటాపోటీగా ఉండే స్థానాలకు వెళ్లాలి. ఉదాహరణకు తిరుపతి వంటి నియోజకవర్గంలో వలస వచ్చిన జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే ఆయనకు సరైన సహకారం లభించడం లేదు. అలాంటి చోట్లకి వీరు వెళ్లి అసంతృప్త నాయకులను బుజ్జగించడంతోపాటు, ప్రజలను కూడా మాయ చేసి విజయాన్ని దక్కించగలిగితే అది వారి కష్టం ఖాతాలోకి వస్తుంది.

అంతే తప్ప ఎక్కడెక్కడ అయితే జనసేన అభ్యర్థులకు మెరుగైన విజయావకాశాలు ఉన్నాయో.. ఆయా నియోజకవర్గాలలో మాత్రం పర్యటించి ఏదో నామమాత్రంగా చిన్న డ్రామాలు నడిపించి అక్కడితో అంతా తమ కష్టమే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకోవడం అనవసరం. ఈ సంగతిని జనసేన ప్రచార స్టారులు అందరూ గ్రహించాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?