జగన్ ప్రభుత్వంపై ఐదేళ్ల వ్యతిరేకత ఉంది, రాజధాని అంశమో, రోడ్ల అంశమో కన్నా.. చంద్రబాబు నాయుడు చూపే తెలివి తేటలే తమను గట్టెక్కిస్తాయిన పచ్చచొక్కాలు భావించాయి. చంద్రబాబు నాయుడును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, ఎవరి కాళ్లైనా, ఎవరి గడ్డాలైనా పట్టుకుని చంద్రబాబు నాయుడు పార్టీని గట్టెక్కిస్తాడనే లెక్కలు వారు వేశారు.
తమ వంతుగా జగన్ పై వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ పోతే చాలని పచ్చ దండు భావించింది. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు లైన్లో పెట్టుకుంటారని, జనసేన అభిమానులు తమకు ఓట్లుగా కలిసి వస్తారని.. అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు బీజేపీతో కూడా వ్యూహాలను అల్లుకుంటాడని తమ్ముళ్లు ఆశించారు. అయితే ఒకవర్గం తమ్ముళ్లు ఈ పొత్తులను మొదటి నుంచి నిరసించారు. ఒంటరిగా తేల్చుకోవచ్చన్నారు.
అయితే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 23 సీట్లకు పరిమితం కావడం, ఏనాడూ చంద్రబాబు నాయుడు ఒంటరిగా గెలిచిన చరిత్రను కలిగిన వాడు కాకపోవడంతో.. పొత్తులే రక్ష అని తమ్ముళ్లు భావించారు. ఆ మేరకు పొత్తులన్నీ కుదిరాయి కూడా!
అయితే.. అంతా బాగానే ఉందని వారు ఫీలవుతున్న దశలో.. తీరా అభ్యర్థుల ప్రకటన వచ్చాకా కథ అడ్డం తిరగింది! ఒకవైపు పొత్తులతో ముప్పైకి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశంలో చిచ్చు రగులుకుంది! బీజేపీ, జనసేన లతో ఓట్లు కలిసి రావాలని, వాటితో తాము నెగ్గాలని ఆశించే తెలుగు తమ్ముళ్లు ఆ పార్టీలకు సీట్లను కేటాయించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు! అందునా ఎవరైతే త్యాగం చేశారో వారు బాగా అసహనభరితులు అయ్యారు.
ఇలా ఏకంగా ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, ఎనిమిది లోక్ సభ సీట్లలో తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేగింది. అది కొనసాగుతూనే ఉంది! అంతకు మించిన ఝలక్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత రేగిన దుమారం! తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు కొత్త వారు తెరపైకి వస్తారని, చాలా చోట్ల ఇన్ చార్జిలకు టికెట్ విషయంలో చంద్రబాబు నో చెబుతారనే ప్రచారం ఎక్కడా జరగలేదు.
డైరెక్టుగా పత్రికా ప్రకటనలతో చాలా మంది ఇన్ చార్జిలకు, మాజీ ఎమ్మెల్యేలకు తమకు టికెట్ లేదనే క్లారిటీ వచ్చింది! వారికంటూ ఉన్న అనుచవర్గం కూడా ఈ వ్యవహారాలతో రగిలిపోయింది. ఇన్ చార్జిలకు, లేదా మాజీ ఎమ్మెల్యేలకు టికెట్ ఉండదనే విషయాన్ని కాస్త ముందుగానే చెప్పి ఉంటే, ముందే క్లారిటీ ఇచ్చి ఉంటే అదో లెక్క. అయితే వారి మనోభావాలు, వారు పెట్టిన ఖర్చులతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు తోచిన అభ్యర్థులను ప్రకటించారు! ఇక్కడే కథ అడ్డం తిరిగింది! అప్పటి వరకూ విజయం పై తెలుగుదేశం వర్గాల్లో ఏదైనా ధీమా పెంపొంది ఉన్నా.. అది అభ్యర్థుల ప్రకటన తర్వాత జారిపోవడం మొదలైంది!
ఎంతలా అంటే.. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే మైనస్ అని, ఆఖరి నిమిషంలో చేసిన మార్పులు ఆ పార్టీని ఈ ఎన్నికల్లో పోటీలో కూడా లేకుండా చేశాయనే భావన సామాన్య ప్రజల్లో కూడా గట్టిగా ఏర్పడింది. సైకలాజికల్ గా టీడీపీ ఓడిపోతుందనే భావనను పెరిగింది అభ్యర్థుల ప్రకటన తర్వాతే! ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలపై గట్టిగా పడే అవకాశం పుష్కలంగా ఉంది.