జీవితాన్ని ఆనందంగా గడపడానికి రకరకాల థియరీలను మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం! కొన్ని వందల సంవత్సరాల నుంచి అనేక మంది తత్వవేత్తలు, మేధావులు, రచయితలు తమ తమ ఆలోచనలను రాతలుగా, మాటలుగా చెబుతూనే ఉన్నారు! ఎన్ని ఉన్నా కొత్తవి వస్తూ ఉంటాయి. కాస్త రూపం మార్చుకుని.. బోలెడన్ని థియరీలు వస్తూ ఉంటాయి.
జీవితంలో తాము ఎదుర్కొన్న అనుభవాలన్నీ ఐపోయాకే తత్వవేత్తలు ఆ థియరీలను చెప్పారని అనుకోవాలి! అయితే ఇవన్నీ వినడానికి చదవడానికి బాగుంటాయి కానీ, ఆచరించడానికి కాదనే వారూ ఉంటారు. అలాగే ఎంత చదివినా.. తీరా సందర్భంలో వాటిని ఆచరణలో పెట్టలేని వాళ్లూ ఉంటారు!
ఆ సంగతలా ఉంటే.. మనషులు ప్రశాంతతను బాగా కోల్పోయే సందర్భాల్లో ఒకటి.. ఇతరులు తాము చెప్పినట్టుగా వినడటం లేదని ఫీలవ్వడం! మన చుట్టూ ఉన్న వాళ్లో, మన ఇంట్లోని వాళ్లో, మనకు కావాల్సిన వాళ్లో, మనం అభిమానించే వాళ్లో.. ఎవరైనా కావొచ్చు, అందరూ మన మాట వినాలని కోరుకుంటాం! అందరికీ సూచనలు ఇస్తాం, సలహాలిస్తాం! మంచిని చెబుతాం, పద్ధతులు వివరిస్తాం, బాగుపడటానికి బోలెడన్ని చెబుతాం!
కొన్ని సార్లు అథారిటీతో, మరి కొన్ని సార్లు బాధ్యతతో, ఇంకొన్ని సార్లు ఉత్సాహంతో, మరి కొన్ని సార్లు ప్రోత్సాహంతో… ఇలా రకరకాల ఉద్ధేశాలతో చాలా మందికి చాలా రకాల విషయాలను ఆచరించమని చెబుతూ ఉంటాం! అయితే అలాంటి వారు అలాంటి మాటలను విననప్పుడు, మనం చెప్పింది పట్టించుకోనప్పుడు.. వచ్చే కోపం, కోల్పోయే ప్రశాంతత అంతాఇంతా కాదు!
మనం ఎంతమంచిగా చెప్పినా వారు వినలేదు, పాటించలేదని కోపం! ఇది అక్కడితో పరిమితం కూడా కాదు! ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమ గురించి ఎంత వివరించి చెప్పినా ఆ అమ్మాయి లెక్క చేయదు! ఎవరో మోసగాడిని మాత్రం ఆమె నమ్ముతుంది! ఇలా కొత్త, పాత రిలేషన్ షిప్స్ విషయంలో మన మాట వినకపోవడం అనేది బాగా అసహనానికి, అసంతృప్తికి గురి చేసే అంశం. దీని ఫలితంగా.. అసహనాలు, పెరిగి లైఫ్ లోనే చాలా మంది ప్రశాంతతను పోగొట్టుకుంటారు!
ఈ కేటగిరి జనాలకు బాగా ఉపయోగపడే థియరీ ఏమిటంటే.. లెట్ దెమ్ థియరీ! వారి మానాన వారిని వదిలేయండి.. అనేది ఈ థియరీ సారాంశం! ఎవరికీ ఏదీ సలహా ఇవ్వొద్దు, ఎవరి నుంచి ఏదీ ఎక్స్ పెక్ట్ చేయొద్దు.. వారి చిత్తానికి వారిని వదిలేయండి! లెట్ దెమ్ .. అప్పుడు వారు చేయాలనుకున్నది చేస్తారు! వారు చేసేది మీకు నచ్చితే ఓకే, నచ్చకపోయినా ఓకే.. లెట్ దెమ్!
ఎవరి నుంచి ఏదీ ఆశించకు, ఎవరి నుంచి అడగకు, ఎవరినీ ఏ విషయంలో ఒత్తిడి చేయొద్దు, వారు నువ్వు కోరుకున్నట్టుగా వ్యవహరించాలని అనుకోకు! వారికి తోచినట్టుగా, నచ్చినట్టుగా చేయనీ.. వారు జీవితాన్ని నువ్వు జీవించొద్దు! అనేది ఈ థియరీ సారాంశం!
మరీ అంతగా వేరే వాళ్లపై అంత బాధ్యత ఉన్నప్పుడు వారి విషయంలో అయినా నువ్వు చేయాల్సింది పర్ఫెక్ట్ గా చేస్తే చాలు! నీ పని నువ్వు పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతే.. ఎంత క్లోజెస్ట్ రిలేషన్ విషయంలో కూడా ప్రత్యేకంగా దగ్గరుండి వాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడదు!
ఎవరికైనా ఏదైనా ఎక్కువగా చెప్పాలనుకోవడం, వారు చెప్పినట్టుగా చేయాలేదని ఫీలవ్వడం ఇలా ప్రశాంతత పోగొట్టుకోవడం కంటే, మీ పని మీద అంతే ధ్యాస పెట్టి పని చేసుకోవడం ఉత్తమం! లెట్ దెమ్ అన్నట్టుగా వ్యక్తులను వారి చిత్తానికి వదిలేసి.. ప్రశాంతంగా గడిపేయడం ఉత్తమం అనేది ఈ థియరీ చెప్పే సూచన!