చంద్రబాబునాయుడు రాజగురువు రామోజీరావు భయాన్ని మాటల్లో చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే జగన్‌తో చావోరేవో అన్నట్టు రామోజీరావు తన పత్రికలో గతంలో ఎప్పుడూ ఇంతగా దిగజారి రాతలు రాయలేదనే మాట వినిపిస్తోంది. ప్రతిదీ జగన్‌కు ముడిపెట్టి వైసీపీపై వ్యతిరేకతను క్రియేట్ చేసి, తద్వారా కూటమికి రాజకీయ ప్రయోజనం కలిగించాలని రామోజీ పత్రిక తపన పడుతోంది.
దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష పడితే, అదేదో జగన్‌కే సంబంధం వుందన్నట్టు ఈనాడు పత్రిక పుంఖాను పుంఖాలుగా కథనాలు రాసింది. అలాగే దళిత సంఘాల పేరుతో అభిప్రాయాలు ప్రచురించి, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై దళితుల్లో వ్యతిరేకత కలిగించాలనే దురుద్దేశం రామోజీ పత్రికలో కనిపించింది. చంద్రబాబు హయాంలో శిరోముండనం జరిగిన విషయం తాను చెప్పక పోతే ఎవరికీ తెలియదని రామోజీ భ్రమిస్తున్నారు. అలాగే ఆ కేసును చంద్రబాబు ప్రభుత్వం నాడు ఎత్తివేస్తే, హైకోర్టు జోక్యం చేసుకోవడంతో సజీవంగా నిలిచిందనే వాస్తవం లోకానికి తెలియదని రాజగురువు అనుకుంటున్నారు.
అలాగే త్రిమూర్తులుకు టీడీపీ టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడాన్ని జనం మరిచిపోయారనేది ఆయన భావన. శిరోముండనం చేసిన వారికి చంద్రబాబు టికెట్ ఇస్తే లోక కల్యాణం కోసమే. ఇదే తోటకు జగన్ ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం లోక వినాశనం కోసమే అని నమ్మించే ప్రయత్నాన్ని చూడొచ్చు.
ఇటీవల కాలంలో ఈనాడు నైతికంగా పాతాళం దిగువకు పడిపోవడం చూస్తే, అయ్యో పాపం అని జాలి కలుగుతోంది. మరోసారి జగన్ వస్తే తన వ్యాపార సామ్రాజ్యం కూలిపోతుందనే భయం రామోజీని వెంటాడుతోందన్న చర్చకు తెరలేచింది. అలాగే ఉండవల్లి అరుణ్‌కుమార్ పట్టువదలని విక్రమార్కుడిలా చేస్తున్నన్యాయ పోరాటం పుణ్యమా అని రామోజీ జైలుకు వెళ్లక తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. జగన్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఉండవల్లి పోరాటానికి తిరుగులేని మద్దతు లభించి, రామోజీ కటకటాలపాలు తప్పదని సర్వత్రా వినిపిస్తున్న మాట.
మార్గదర్శి ఫైనాన్ష్ కేసులో ఆయనకు భారీ జరిమానా విధిస్తే, చెల్లించేందుకు ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం రామోజీకి అత్యంత ప్రాధాన్యమైంది. ఎందుకంటే ఇంతకాలం నిర్మించుకున్న వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాకూడదని రామోజీరావు కోరిక. జగనే మళ్లీ వస్తే … ఈ ఆలోచనే రామోజీకి నిద్రలేని రాత్రుల్ని మిగిల్చుతోంది. బహుశా చంద్రబాబుకు కూడా ఇంత భయం వుండదేమో.
ఎన్డీఏ గొడుగు కిందకు చేరడంతో జగన్ తననేమీ చేయలేరనే ధైర్యం చంద్రబాబులో వుంది. కానీ రామోజీ పరిస్థితి అది కాదు. వ్యవహారం కోర్టులో నడుస్తోంది. అందులోనూ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎవరో చెబితే వినే మనిషి కాదు. ఉండవల్లి వేసిన కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్టీడ్ కావడంతో రామోజీకి భయం పట్టుకుంది. మరీ ముఖ్యంగా ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రామోజీ వెన్నులో వణుకు పుట్టించింది. జీవిత చరమాంకంలో ఏమవుతుందో అనే భయం ఆయన్ను వెంటాడుతోంది.
జగన్ అందరి రాజకీయ నాయకుల్లా మీడియా అంటే భయపడే రకం కాదు. అందుకే వ్యవహారం ఇంత వరకూ వచ్చింది. జగన్ విషయంలో రామోజీ ఏదో అనుకుని భయపెట్టేందుకే వ్యతిరేకంగా రాస్తే, కాలం మరేదో చేసింది. జగన్‌లో మీడియా అంటే భయానని ఎల్లో మీడియా పోగొట్టింది. ఇక భయం పోయిన తర్వాత జగన్‌ను చేసేదేముంది? ఇప్పుడు భయం అంటే ఏంటో జగన్ రుచి చూపిస్తున్నారు. రామోజీకి తన మీడియా, వ్యాపార సామ్రాజ్యం కూలిపోతుందనే భయం. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయం. ఇవన్నీ పోయిన తర్వాత తన వారసులు భవిష్యత్ ఏమవుతుందో అనే భయం. ఇన్ని భయాల మధ్య బతుకుతుండడం వల్లే … ఏ భయమూ లేని జగన్‌ను చూస్తే రామోజీకి వణుకు.
జగన్‌కు జైలంటే భయం లేదు. ఎందుకంటే సోనియా, చంద్రబాబు… అందరూ కలిసి ఆయన్ను జైలుకు పంపారు కాబట్టి. 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌కు ఇక భయం ఏముంటుంది? అలాగే తనపై వ్యతిరేక వార్తలు రాస్తారనే భయం కూడా జగన్‌లో ఇసుమంతైనా లేదు. దీనికి కారణం… తెల్లారి లేస్తే, జగన్‌పై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుండడం వల్ల, ఓస్ ఇంతే కదా? అని ఆయన అనుకున్నారు. జగన్‌పై వ్యతిరేక కథనాలను జగన్ లైట్ తీసుకున్నారు.
కానీ చుట్టూ గాజు భవంతిని నిర్మించుకుని, ఇంత కాలం మీడియాను అడ్డం పెట్టుకుని ఎదుటి వాళ్లపై రాళ్లు విసురుతున్న రామోజీకి భయపడాల్సిన పరిస్థితి ఎదురైంది. అందుకే ఆయన మీడియాలో సిబ్బంది కూడా సిగ్గుపడేంతగా జగన్‌పై విషపు రాతలు. జగన్ మరోసారి రాకుండా తన పత్రిక రాతలు అడ్డుకుంటాయని రామోజీలో చిన్న ఆశ. అయితే అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని ఆయనకు తెలియంది కాదు.
మీడియా ద్వారా తన బుర్రలోని విషాన్ని జనంలో నింపి, జగన్‌ను నిలువరించాలనే తపన. చంద్రబాబు కంటే ఎక్కువ భయపడుతుండడం వల్లే కూటమి ఎజెండాను కూడా రామోజీనే నిర్దేశిస్తున్నారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే, ఏమవుతుందో అందరి కంటే ఎక్కువ రామోజీకి బాగా తెలియడం వల్లే, వికృత రాతలు, విద్వేష దృశ్యాలు ఆయన మీడియాలో చూడొచ్చు. ఒక మనిషి బతికి ఉండగానే, తన పతనం తెలిస్తే ఎంత ఆవేదన కలుగుతుందో రామోజీని చూస్తే… అర్థం చేసుకోవచ్చు.