హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోని చేవేళ్ల కేంద్రంగా ఉన్న లోక్ సభ నియోజకవర్గంలో సూపర్ రిచ్ రెడ్డీస్ పోరాటం సాగుతోంది. ఒకరేమో బార్న్ విత్ సిల్వర్ స్పూన్, మరొకరు సామాన్యుడిగానే జన్మించినా మాన్యుడయ్యాడు! ఒకరి ఆస్తులు వేల కోట్లలో చూపిస్తే, మరొకరి ఆస్తులు వందల కోట్లలో చూపిస్తున్నారు! ఎలాగైనా.. ఇద్దరు సూపర్ రిచ్ రెడ్డీస్ మధ్యన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పోరాటం సాగుతూ ఉంది!
వీరిద్దరూ గత ఎన్నికల్లో పోరాడిన వారే, అయితే ఈ సారి గుర్తులు మార్చుకుని పోరాడుతున్నారు! వారే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి. రంజిత్ రెడ్డి. గత ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. రంజిత్ రెడ్డి కారు సింబల్ పై నాటి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడ్డారు. విశ్వేశ్వర్ రెడ్డిపై రంజిత్ రెడ్డి అతి స్వల్ప మెజారిటీతో గెలిచారు. అప్పుడు రంజిత్ కు దక్కిన మెజారిటీ కేవలం 14 వేలు! ఒక లోక్ సభ నియోజకవర్గం స్థాయిలో ఇది స్వల్ప మెజారిటీ అని చెప్పక తప్పదు!
ఈ ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు! ఇలా ఈ ఇద్దరూ గుర్తులు మార్చుకుని మళ్లీ పోరాడుతున్నారు! గత ఎన్నికల్లో బీజేపీ తరఫున ఈ లోక్ సభ సీటు నుంచి జనార్ధన్ రెడ్డి పోటీ చేసి రెండు లక్షల ఓట్లను పొందాడు. అది కేవలం ఐదు శాతమే! ఇప్పుడు విశ్వేశ్వర్ రెడ్డి వ్యక్తిగత చరిష్మా దాన్ని ఏ స్థాయి వరకూ తీసుకొస్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఆస్తుల విషయానికి వస్తే విశ్వేశ్వర రెడ్డి కుటుంబ ఆస్తులు నాలుగు వేల ఐదు వందల కోట్ల పైమాటే! తన వ్యక్తిగత ఆస్తులనే విశ్వేశ్వర రెడ్డి 1200 కోట్ల రూపాయల పై స్థాయిలో డిక్లేర్డ్ చేశారు. ఐదేళ్ల కిందట ఈయన తన వ్యక్తిగత ఆస్తులను 895 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు! అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ అయిన తన భార్య సంగీతారెడ్డి పేరిట ప్రస్తుతం 3,208 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టుగా విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు!
ఇక తను విశ్వేశ్వర్ రెడ్డిలా సిల్వర్ స్పూన్ తో పుట్టలేదని రంజిత్ రెడ్డి అంటారు. తను పౌల్ట్రీ వ్యాపారంలో స్వతహాగా ఎదిగిన వాడని ఆయన చెబుతారు. ఆయన ఈ ఎన్నికల్లో డిక్లేర్డ్ చేసిన ఆస్తుల విలువ 445 కోట్ల రూపాయల వరకూ ఉన్నాయి. అందులో 256 కోట్ల రూపాయలు ఆయన పేరిట ఉన్నాయట. గత ఎన్నికల్లో ఈయన తన పేరిట ఉన్న ఆస్తులు 163 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన భార్య సీతారెడ్డి పేరిట 179 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టుగా పేర్కొన్నారు.
మొత్తానికి హైదరాబాద్ కు ఒక వైపు ఆవరించి ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలో ఇలా ఇద్దరు సూపర్ రిచ్ రెడ్డీస్ అమీతుమీ తేల్చుకుంటున్నారు. పార్టీల పట్టింపు లేకుండా.. వీరు వ్యక్తిగత ప్రతిష్టలతోనే అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయ్యారు!