క‌డ‌ప‌లో వైసీపీకి ఆందోళ‌న క‌లిగించే స‌మాచారం!

రెండు వారాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్‌ను తేల్చే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వైఎస్సార్ జిల్లాలో జ‌ర్న‌లిస్టుగా రాజ‌కీయ వాతావ‌ర‌ణం తెలుసుకోవాల‌ని అనుకున్నా. ఈ నేప‌థ్యంలో మైనార్టీకి చెందిన…

రెండు వారాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్‌ను తేల్చే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వైఎస్సార్ జిల్లాలో జ‌ర్న‌లిస్టుగా రాజ‌కీయ వాతావ‌ర‌ణం తెలుసుకోవాల‌ని అనుకున్నా. ఈ నేప‌థ్యంలో మైనార్టీకి చెందిన జ‌ర్న‌లిస్టు మిత్రుడికి సోమ‌వారం రాత్రి ఫోన్ చేశాను.

“ఎట్లుంది” అని అడిగా.

“జిల్లా వ్యాప్తంగా వైసీపీకి సానుకూల వాతావ‌ర‌ణం ఉంది” అన్నాడు.

ఈ సంద‌ర్భంగా మా సంభాష‌ణ‌లోకి ష‌ర్మిల వ‌చ్చారు.

“చివ‌రి మూడు రోజులు ష‌ర్మిల క‌డ‌ప‌లోనే ఉంటాదంట‌బ్బి” అన్నాడు.

“ఆమెకు ఓట్లు ఏచ్చారంటావా” అన్నాను.

“ష‌ర్మిల‌ను తీసి ప‌డేయాకు. ఆమెకు కాదు, కాంగ్రెస్‌కు ఓట్లు ప‌డ్తాయి”

“అదేంది…యిచిత్రంగా చెప్తాండావేబ్బి”  ఆశ్చ‌ర్యంగా ప్ర‌శ్నించాను.

“యిచిత్రం ఏమీలేదు. ముస్లింల‌కు కాంగ్రెసోళ్లు ఆస్తులు రాయిస్తార‌ని ప‌దేప‌దే మోదీ చెప్తాండాడు. మోదీ మాటలు ముస్లింల‌ను రెచ్చ‌గొడ్త‌నాయి. అందుకే మ‌సీదుల్లో మా వాళ్లు అసెంబ్లీ వ‌ర‌కూ వైసీపీకి, ఎంపీకి మాత్రం కాంగ్రెస్‌కు ఓట్లు ఏయ‌మంట‌నారు”

“ఔనా” అన్నాను ఆశ్చ‌ర్యంగా…

“క‌డ‌ప పార్ల‌మెంట్ ప‌రిధిలో మా వాళ్ల ఓట్ల‌లో మెజార్టీ కాంగ్రెస్‌కే ప‌డేట్టున్నాయి. ఎట్లా మ‌న‌కే ఏస్తార్లే అని వైసీపీ వాళ్లు పెద్ద‌గా మా వాళ్ల‌ని ప‌ట్టించుకోలేదు. అందుకే ష‌ర్మిల‌కు ఓట్లు వ‌స్తాయ‌నేది” అని మైనార్టీ జ‌ర్న‌లిస్టు మిత్రుడు చెప్పుకుంటూ పోయారు.

“మ‌రి అవినాష్‌రెడ్డి గెలుచ్చాడా” అని ప్ర‌శ్నించా.

స‌మాధానం కోసం జ‌ర్న‌లిస్టు మిత్రుడు కాసేపు ఆలోచించారు.. “మెజార్టీ త‌గ్గుతాది. గెలుచ్చాడులే” అని మిత్రుడు చెప్పారు.

ఆ త‌ర్వాత వెంట‌నే ఒక సాధార‌ణ ముస్లిం మైనార్టీ మిత్రుడికి ఫోన్ చేశాను. మ‌సీదుల్లో ఏమైనా చెబుతున్నారా? అని అడిగాను.

మోదీకి వ్య‌తిరేకంగా ఓట్లు వేయాల‌ని మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌ని, ప్ర‌త్యేకంగా ఎంపీకి కాంగ్రెస్‌, ఎమ్మెల్యేకు వైసీపీ అభ్య‌ర్థికే వేయాల‌ని మాత్రం ఎవ‌రూ చెప్ప‌లేద‌ని అన్నాడ‌త‌ను. ఇద్ద‌రు మిత్రులు క‌డ‌ప పార్ల‌మెంట్ ప‌రిధిలోని వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన మైనార్టీ వ్య‌క్తులు.

ఇద్ద‌రితో మాట్లాడిన త‌ర్వాత ఇత‌ర జిల్లాల్లో ఎలా వుందో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి పెరిగింది. తిరుప‌తి జిల్లాలోని వైసీపీ ముఖ్య నాయ‌కుడి అనుచ‌రుడికి ఫోన్ చేశాను. ముస్లిం మైనార్టీల్లో ఎక్కువ మంది ఎంపీ ఓట్ల విష‌యానికి వ‌స్తే, కాంగ్రెస్‌కు వేస్తామ‌ని చెబుతున్నారన్నారు. వైసీపీ అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రాన్ని పైన పేర్కొన్న అభిప్రాయాలు గుర్తు చేస్తున్నాయి. జాతీయ‌స్థాయిలో మోదీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తుండ‌డంతో మైనార్టీలు ఆ పార్టీపై సానుభూతితో ఉన్నార‌న్న‌ది వాస్త‌వం.

కాంగ్రెస్‌లో కొంచెం బ‌ల‌మైన నాయ‌కులు క‌నిపిస్తే, అండ‌గా నిలిచే వాతావ‌ర‌ణం లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో న‌ష్ట నివార‌ణ‌కు ఎలాంటి వ్యూహాలు ర‌చించాలో నిర్ణ‌యించుకోవాల్సింది వైసీపీనే. ముస్లింలంతా త‌మకే అండ‌గా నిలుస్తార‌ని గుడ్డిగా న‌మ్మి, వారిని గాలికి వ‌దిలేస్తే మాత్రం… ఎంపీ ఎన్నిక‌ల్లో ఎంతోకొంత త‌ప్ప‌క మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

-ఆర్ఆర్‌