ఒక్కడిని ఓడించడానికి అందరూ. అందర్నీ ఎదిరిస్తూ ఒక్కడు. ఇలాంటి యుద్ధాలు జగన్‌కి కొత్త కాదు. తండ్రి మరణం తర్వాత నిరంతరం పోరాటం. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఆరోపించినా జగన్ లాంటి నాయకుడు భారత రాజకీయ చరిత్రలో ఎవరూ లేరు. తండ్రి నుంచి అప్పనంగా వస్తే అందిపుచ్చుకున్న వాళ్లే కానీ, జాతీయ పార్టీతో, ప్రాంతీయ పార్టీతో, సొంత పార్టీలోని వ్యతిరేక శక్తులతో, చివరికి చెల్లెలుతో కూడా పోరాటం చేస్తున్న నాయకుడు గతంలో లేడు, భవిష్యత్‌లో అంత సులభంగా వచ్చే అవకాశం లేదు.
రాజకీయ ప్రత్యర్థులపై ఎవరైనా యుద్ధం చేస్తారు. అయితే పాతుకుపోయిన రెండు బలమైన పత్రికలతో యుద్ధం చేయడం అంత సులభం కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీని దుర్మార్గపు రాతలతో వీళ్లే భ్రష్టు పట్టించారు. అయితే వీళ్లు రాసేవన్నీ అబద్ధాలంటే కానే కాదు. వీళ్ల ప్రత్యేకత అర్ధ సత్యాలు రాయడం.
జగన్ వేస్తే స్కెచ్.. చంద్రబాబు వేస్తే వ్యూహం
జగన్ తెస్తే అప్పు.. బాబు తెస్తే సర్దుబాటు
బాబు హయాంలో జరిగితే ఘర్షణ.. జగన్ హయాంలో జరిగితే వైసీపీ దౌర్జన్యం
ప్రత్యేక భాషతో జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఈ ప్రమాదాన్ని గుర్తించే జగన్ సాక్షి పెట్టుకున్నారు.
రెండు పత్రికల్లో ప్రతిరోజూ టన్నుల కొద్ది అక్షరాల్లో జగన్ సైకో, విధ్వంసకుడు, అరాచకవాది అని రాస్తున్నారు. జగన్ కొత్త తరం నాయకుడు. సాంప్రదాయ పద్ధతుల్లో ఒదగడు. ఈ విషయం తెలియదా అంటే తెలుసు. కానీ గుర్తించరు.
జగన్‌ని ఓడించడం, ప్రజాక్షేమానికి ఎందుకు లింకు పెడతారంటే ఈ ముసుగుతో దశాబ్దాలుగా నాటకం ఆడుతున్నారు కాబట్టి. జగన్ దిగిపోవడం ప్రజలకి కాదు, వీళ్లకి అవసరం. 95లో ఎన్టీఆర్‌ని దించి బాబుని కుర్చీలో కూర్చోపెట్టడంలో ఎంత ప్రజాస్వామ్యం వుందో అందరికీ తెలుసు. సొంత ప్రయోజనాలు నెరవేరడమే ప్రజాస్వామ్యం. దానికి ఎవరైనా అడ్డు తగిలితే నియంతృత్వం.
ఈ పత్రికల ప్రమాదాన్ని గుర్తించే కేసీఆర్ కొరడా తీసుకున్నారు. ఆస్తులన్నీ హైదరాబాద్‌లో వుండడంతో వీళ్లు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకున్నారు. తెలంగాణలో ఎవరు గెలిచినా, ఓడినా వీళ్లకి పెద్ద ప్రయోజనం లేదు. ఆంధ్రాలో చంద్రబాబు గెలిస్తే సామ్రాజ్యాలు విస్తరించుకోవచ్చు.
పేదలకి పథకాలు ఇస్తే జగన్ విధ్వంసకుడు.. పెద్దలకి ప్రయోజనాలు కల్పించే చంద్రబాబు వీళ్ల దృష్టిలో విజనరీ.
46 ఏళ్ల రాజకీయ జీవితంలో పేదల సంక్షేమాన్ని ఎప్పుడూ కోరని చంద్రబాబు ఈ సారి గెలుపు కోసం సంవత్సరానికి 1.50 లక్షల కోట్ల పథకాలు ప్రకటిస్తే … ఈ రెండు పత్రికలు పొరపాటున కూడా ప్రశ్నించవు.
చంద్రబాబు 14 ఏళ్ల హయాంలో ఒక్క పథకం పేరు కూడా ఆయనని గుర్తు తెచ్చేవి లేవు. అన్నీ అనివార్యంగా కొనసాగించినవే.
పేదలకి డబ్బులిస్తే అది పంచుడు.. కాంట్రాక్టర్లు, లిక్కర్ సిండికేట్ , రియల్ ఎస్టేట్ మాఫియాను ప్రోత్సహిస్తే అది అభివృద్ధి
విద్య, వైద్యం పేదలకి అందుబాటులో వుండాలని ఆకాంక్షించింది మొదట వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత జగన్.
విద్య, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేట్‌కి అమ్మేసింది చంద్రబాబు. నారాయణ, కామినేని శ్రీనివాస్‌లకి మంత్రి పదవులు ఇవ్వడమే దీనికి ఉదాహరణ.
పేద తల్లులు డబ్బులకి ఇబ్బంది పడకుండా చేసింది అమ్మ ఒడి. ఈ పథకం దేశంలో ఎక్కడైనా వుందా?
ఇంగ్లీష్ మీడియం పెడితే అందరూ గగ్గోలు పెట్టి చేంతాడంత వ్యాసాలు రాశారు. వీళ్ల మనుమళ్లు, మునిమనుమళ్లు మాత్రమే ఇంగ్లీష్ చదువు చదివి అధికారులు కావాలి. పేదవారి పిల్లలు ఆటో డ్రైవర్లు, మెకానిక్‌లు కావాలి. ఇంగ్లీష్ మీడియం అమలులో తొలుత ఇబ్బందులున్నా, పదేళ్ల తర్వాత దాని ఫలితం అర్థమవుతుంది. చంద్రబాబు ఐటీ బిల్డింగ్‌లు మాత్రమే నిర్మిస్తే, జగన్ భావి తరాల్ని నిర్మిస్తున్నారు.
పల్లెల్లో ఫ్యామిలీ క్లీనిక్‌లు, వాలంటరీ వ్యవస్థ, సచివాలయాలు ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయేవి. చంద్రబాబు వస్తే ఇవన్నీ దశల వారీగా ఫినీష్ చేసుకుంటూ వెళ్తారు. ఆయనకు కావాల్సింది పెద్దలు, పేదలు కాదు. సంపదని ఆయన సృష్టించింది నిజమే. కానీ ఎవరి కోసం? తన కోసం, తన వాళ్ల కోసం, పేద వాళ్ల కోసం కాదు.
ఈ యుద్ధంలో జగన్ గెలిస్తే అర్జునుడు, ఓడితే అభిమన్యుడు. గెలిచినా, ఓడినా ఆయన కోసం చరిత్రలో ఒక పేజీ వుంటుంది. దాన్ని ఎవరూ చెరపలేరు.