కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి. బాహాటంగానే తెలుగుదేశం, జనసేన, భాజపా ఇలా అన్ని పార్టీల సభ్యులకు ఏదో వంకతో మద్దతు బాహాటంగానే ప్రకటిస్తున్నారు.
పవన్ కు మద్దతు అంటే అర్ధం చేసుకోవచ్చు. రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముడు కనుక. వేరే వాళ్లకి మద్దతు పలకాలి అని వున్నా, తాను న్యూట్రల్ గా వుండాలనుకున్నా, కాంగ్రెస్ పార్టీని వదిలేయాలి కదా. అలా చేయకుండా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే కదా.
ఓ పార్టీలో వున్నపుడు ఆ పార్టీ విధానాలకు కట్టుబడి వుండాలి కదా. జనసేన నాయకుడు ఎవరైనా వైకాపాకి మద్దతు పలికితే పవన్ ఊరుకుంటారా? పార్టీ నుంచి బయటకు పంపించేయరూ? కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ కనుక.
సరే, మెగాస్టార్ కనుక, ఏం చేసినా, ఎవరు ప్రశ్నించరు కనుక ఆ సంగతి వదిలేద్దాం.
ప్రజారాజ్యం పార్టీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కోరి కోరి కన్నబాబును పదే పదే టార్గెట్ చేస్తున్నారు. మరి చిరంజీవి ఈ విషయంలో తమ్ముడికి చెప్పాలి కదా. అలా వద్దు, నా ఇష్టం మేరకే నేను విలీనం చేసా పార్టీని అని. ఆ విధంగా కేంద్ర మంత్రిని అయ్యాను అని చెప్పాలి కదా. పోనీ తమ్ముడికి చెప్పలేకపోవచ్చు. తనే ఓ ట్వీట్ వేయచ్చుగా, ప్రజారాజ్యం వ్యవహారం అంతా తన స్వంతం, ఎవరి ప్రమేయం లేదు అని. అదీ చేయరు.
చిరు మొదటి నుంచీ అంతే. తన తరపున ఎవరైనా ఎగబడితే, అది తప్పు అని తెలిసినా మౌనంగా వుంటారు తప్ప మాట్లాడరు. అది ‘గరికపాటి’ ఉదంతం అయినా, కన్నబాబు సంగతి అయినా. కానీ ఇండస్ట్రీలో తన వెనుక ఏం మాట్లాడుతున్నారు అన్నది కూడా మెగాస్టార్ ఆలోచించాలి.
ప్రజారాజ్యం విలీనం తరువాత గంటా శ్రీనివాసరావు మంత్రి అయ్యారు. కానీ ఆయన పవన్ కు మంచి వాడయ్యారు. కన్నబాబు మాత్రం చెడ్డవాడు అయ్యారు. పైగా ‘ఇలారా’ అంటే వచ్చేవాడు అంటూ ఎద్దేవా. ఎంత చిన్న చూపు.
ఇలాంటి వైఖరిని అయినా మెగాస్టార్ ఖండించాలి కదా. ఫోన్ లోనో, మరోలాగనో కన్నబాబును అనునయించడం కాదు, బాహాటంగా చెప్పాలి కదా. మెగాస్టార్ అంటే ఉన్నతమైన హోదా లాంటిది. దాన్ని ఆయనకు ఆయనే తగ్గించేసుకుంటున్నారు. వన్స్ సినిమాలు వదిలేసిన తరువాత ఈ తప్పు ప్రభావం తెలుస్తుంది. మరోసారి జగన్ ప్రభుత్వం వస్తే అప్పుడు చిరు, ఏ విధంగా మళ్లీ దగ్గరకు వెళ్తారో చూడాలి.