రాజకీయ నాయకులు మామూలు రోజుల్లోనే తాము పోటుగాళ్ళమన్నట్లు మాట్లాడతారు. తమంత వారు లేరని విర్రవీగుతుంటారు. పొడిచేస్తాం … నరికేస్తాం అంటూ వీరంగం వేస్తుంటారు. ఇక ఎన్నికల సమయంలో వారికి పట్టపగ్గాలు ఉండవు. ప్రచారంలో చెలరేగిపోతుంటారు. ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాదు. పేక మేడలు, గాలి మేడలు కడుతుంటారు.
ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ బాస్ ఇలాంటి గాలి మేడలు కడుతున్నాడు. రాజకీయ నాయకులకు వివిధ మార్గాల ద్వారా సమాచారం వస్తుండవచ్చు. కాదనం. వారికి అలాంటి వ్యవస్థ ఉంటుంది. నెట్ వర్క్ ఉంటుంది. కానీ రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు ఊహాతీతంగా ఉంటాయి. నాయకుల అంచనాలు బోల్తా కొడతాయి. ఇది బీఆర్ఎస్ విషయంలోనే చూసాం.
తన పార్టీ విషయంలోనే అంచనాలు తప్పిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ ఎన్నికల విషయంలో అంచనాలు వేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని అదే పనిగా ఊదరగొడుతున్నారు. సరే.. కేసీఆర్ విషయానికొస్తే కేంద్రాల్లో హంగ్ వస్తుందని పాట పాడుతున్నాడు. తన పార్టీ చక్రం తిప్పుతుందని అంటున్నాడు.
ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడని చెప్పాడు. ఉత్తుత్తి మంత్రి పదవులే కదా. మరో రెండో మూడో ఇచ్చుకుంటే సరిపోయేది. కేసీఆర్ అంచనాల్లో చాలా దూరం వెళ్ళిపోయాడు. అప్పుడే మంత్రి పదవి కూడా ఇచ్చేశాడు. ఈ అంచనాలన్నీ ఆయనకు ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినట్లుగా కనబడుతోంది.
అసలు కేసీఆర్ అనుకునే హంగ్ ఏమిటో అర్థం కావడం లేదు. జాతీయ స్థాయిలో రెండే కూటములు ఉన్నాయి. బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ఒకటి. కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఒకటి. గులాబీ పార్టీ ఈ రెండు కూటముల్లోనూ లేదు. ఇండియా కూటమిలో ఐక్యత లేదు. అది కకావికలై పోయింది. మరి కేసీఆర్ చెబుతున్న సంకీర్ణ ప్రభుత్వం ఏమిటో? ప్రాంతీయ పార్టీల కూటమా? అలా అనుకున్నా ఈయనది ప్రాంతీయ పార్టీ కాదు కదా. హేమిటో…. కేసీఆర్ అంచనాలు అర్థం కావడంలేదు. ఆలూ లేదు చూలు లేదు… కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది.