సాధారణంగా తమకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగే వారు తెలివైన వారని అంటారు. అదే సమయంలో, ఇతరులకు తగిలిన దెబ్బల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగే వాళ్లని ఏమనాలి? బహుశా ఈ సిద్ధాంతాన్ని వర్తమాన రాజకీయాలకు అన్వయించి చూసినప్పుడు.. అలాంటివారిని చంద్రబాబునాయుడు అని అనాలేమో!
ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి పాఠాలు నేర్చుకుని, చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఎలాంటి వ్యవహార సరళి వల్ల అపకీర్తిని మూటగట్టుకున్నారో.. చంద్రబాబు నాయుడు ఆయా విభాగాల్లో ముందు జాగ్రత్తగా అప్రమత్తం అవుతున్నారు.
ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించిన చంద్రబాబు.. తమ కూటమికి చెందిన మంత్రులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఎవ్వరూ ఆ ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోనే వద్దని చాలా ఖచ్చితంగా హెచ్చరించారు.
జగన్మోహన్ రెడ్డి తాను పరిపాలన చేపట్టిన తర్వాత.. ఇసుక విక్రయాల విషయంలో ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఆయన అధికారంలోకి రాగానే ఇసుక విక్రయాలు, తవ్వకాలు మొత్తం స్తంభింపజేసేసి.. కొత్త విధానం తెచ్చే దాకా నిర్మాణ రంగాన్ని పట్టించుకోలేదు. అది ఆ దిశగా ఆయనకు తొలి అపకీర్తి. కొత్త విధానం వచ్చిన తర్వాత.. కేవలం నగదు చెల్లిపులకు మాత్రమే విక్రయిస్తూ మరో అపకీర్తిని మూటగట్టుకున్నారు.
వీటిని మించి.. జగన్ ప్రభుత్వం మీద సామాన్య ప్రజలు కూడా కోపగించుకోవడానికి ఒక ప్రధాన కారణం.. ఇసుక వ్యాపారాల్లో అక్రమాలకు నెలవుగా ప్రతిచోటా స్థానిక ఎమ్మెల్యేలే ఉండడం. ఇసుక అక్రమాలన్నీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరుగుతుండడం.
కొందరు ఎమ్మెల్యేలు ఇసుక విక్రయాల విషయంలో ఎంతగా బరితెగించి ప్రవర్తిస్తున్నారో ఆయన ప్రభుత్వ సమయంలో ఆడియో రికార్డులు పలుమార్లు బయటకు వచ్చాయి. అయితే జగన్ నామమాత్రంగా కూడా అలాంటి ఆరోపణల పట్ల స్పందించలేదు. తమ ఎమ్మెల్యేలను కట్టడి చేయడానికి ప్రయత్నించలేదు. కొన్ని విషయాల్లో ఎంతటి అవినీతి కూడా ఎలాగైతే గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోతుందో.. కొన్ని విషయాల్లో చిన్న చిన్న తప్పుడు పనులు కూడా ఎక్కువ బజార్నపడేస్తాయి. ఇసుక వ్యాపారంలో ఎమ్మెల్యేల పాత్ర అలాంటిదే. అయితే జగన్ వారిని ఉపేక్షిస్తూ వచ్చారు. దాని పర్యవసానం ప్రజల్లో చెడ్డపేరు.
జగన్ పాలనలో ఇసుక వ్యాపారం వారిని ఎలా దెబ్బకొట్టిందో స్వయంగా చూశారు గనుక.. చంద్రబాబు ముందుగానే తన వారిని హెచ్చరిస్తున్నారు. ఎవ్వరూ కూడా ఇసుకలో వేలు పెట్టవద్దని అంటున్నారు. ఆయన హెచ్చరికను ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాజిటివ్ నోట్ తో అర్థం చేసుకుని తమ హద్దుల్లో ఉంటే వారికే మంచిది. ప్రభుత్వం తమదే కదా అని ఎవరైనా హద్దులు దాటితే.. చెడ్డపేరు మొత్తం ప్రభుత్వానికి వస్తుంది.