నామినేటెడ్ ఆశావహులకు షాక్!

చంద్రబాబులో పునరాలోచన రేకెత్తించగలిగితే గనుక.. నామినేటెడ్ పదవుల పందేరం అనేది కొన్ని రోజులు వాయిదా పడవచ్చు

చంద్రబాబు నాయుడు ఈ దఫా అధికారంలోకి వచ్చిన వెంటనే.. నామినేటెడ్ పదవుల పందేరం కూడా పూర్తి చేసేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకున్నారు. ఏ రకంగా అయితే అధికారంలోకి రాకముందు నుంచి కీలక స్థానాలలో ఉండాల్సిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు గురించి కసరత్తు పూర్తి చేసేసి జాబితాలు సిద్ధంగా ఉంచుకున్నారో.. అదే తరహాలో నామినేటెడ్ పదవులు గురించి కూడా ముందే కసరత్తు చేసి ఉండాలని భావించారు.

రెండు నెలలు గడిచాయి గానీ ఇప్పటిదాకా ఒక నియామకం కూడా జరగలేదు. గెలిచిన తర్వాత టీడీపీ మొదటిసారిగా నిర్వహించిన పోలిట్ బ్యూరో సమావేశంలో పదవుల పంపకం గురించి చర్చ జరిగింది. కానీ ఆశావహులకు చిన్న షాక్ లాంటి ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది.

మరో పదిరోజుల్లో తొలివిడత నామినేటెడ్ పదవులు ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో. చిన్న బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ పదవుల గురించి కీలకంగా చర్చ జరిగింది. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు గురించి కూడా చర్చ జరిగింది. పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి అయిదు లక్షల రూపాయల బీమా మొత్తం అందేలాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అయితే ఈ సందర్భంగా ముందు పార్టీ సభ్యుల నమోదు పర్వం పూర్తి అయిన తర్వాత.. నామినేటెడ్ పదవులను పంచితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు పదవుల పందారం వాయిదా వేస్తే.. అందరూ పార్టీ సభ్యుల నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారని సూచన వచ్చినట్లుగా తెలుస్తోంది.

ముందే పదవులను పంచేస్తే కొందరు నాయకులు అసంతృప్తికి గురై సభ్యత్వ నమోదు కార్యక్రమం లో సరిగా పాల్గొనరని వాదించినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన చంద్రబాబులో పునరాలోచన రేకెత్తించగలిగితే గనుక.. నామినేటెడ్ పదవుల పందేరం అనేది కొన్ని రోజులు వాయిదా పడవచ్చు. ఆ మేరకు ఆశావహులకు ఆశనిపాతం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

3 Replies to “నామినేటెడ్ ఆశావహులకు షాక్!”

Comments are closed.