రేవంత్ సవాలును స్వీకరించగల వారెవ్వరు?

మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల నివాసాలను కూల్చడం ప్రారంభించిన తర్వాత.. ప్రతిపక్షాలు ఆశించినది వేరు.

హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో నిరాటంకంగా కొనసాగిస్తున్న కూల్చివేతలు రాజకీయ నాయకుల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైడ్రా కూల్చివేతల కారణంగా నష్టపోతున్న బడా నాయకులు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం ఒక ఎత్తు. వారి పర్వం నిజానికి ముగిసిపోయింది. మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల ఇళ్లను కూడా కూల్చివేయడం ప్రారంభించిన తరువాత.. ప్రతిపక్ష నాయకులందరికీ ఊపిరి లేచొచ్చింది. ఇక ప్రభుత్వం మీద దాడి చేయడం మొదలెట్టారు.

కానీ వారందరికీ కౌంటరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న సవాలును స్వీకరించే ధైర్యం వారిలో ఎవరికైనా ఉందా? రేవంత్ సవాలుకు స్పందించి.. మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతల వలన నష్టపోయే ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చే వాళ్లెవ్వరు? అనే చర్చ ఇప్పుడు ప్రారంభం అవుతోంది.

హైడ్రా కూల్చివేతలు మొదలైన తర్వాత.. తొలిరోజుల్లో సాధారణ ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. నీటి వనరులను కూడా తమ స్వార్థం కోసం ఆక్రమించుకునే బడాబాబులకు మంచి శాస్తి జరుగుతున్నదని చాలామంది సంతోషించారు. పెద్ద పెద్ద చెరువులను, నీటి వనరులను ఆక్రమించుకుని ఫాంహౌస్ లు, విల్లాలు, కన్వెన్షన్ సెంటర్లు కట్టుకునేంత దృశ్యం పేదలకు లేదు. మధ్యతరగతికి కూడా లేదు. కాబట్టి వారికి హైడ్రా కూల్చివేతల మీద పెద్దగా వ్యతిరేకత రాలేదు.

కానీ మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల నివాసాలను కూల్చడం ప్రారంభించిన తర్వాత.. ప్రతిపక్షాలు ఆశించినది వేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాందోళనలు మిన్నుముడతాయని వారు అనుకున్నారు. అలా కూడా జరగలేదు. రేవంత్ సర్కారు అక్కడ నిర్వాసితులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం ద్వారా.. వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడింది. ఈలోగా కేవీపీ వంటి వారి ఫాంహౌస్ వంటివాటి గురించి ప్రస్తావించారు గానీ.. ఆయనే స్వయంగా సర్వే చేయించి.. నిర్మొగమాటంగా తప్పు ఉంటే కూల్చివేయాలని సీఎంకు లేఖ రాసిన తర్వాత విమర్శకు అవకాశం లేకుండా పోయింది. అయితే భారాస నేతలు మాత్రం.. మూసీ కూల్చివేతలపై నానా రాద్ధాంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎంత చేస్తున్నా.. వారికి రేవంత్ విసిరిన సవాలును స్వీకరించే ధైర్యముందో లేదో అర్థం కావడం లేదు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మూసీ నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. అవసరమైతే మలక్ పేటలోని రేస్ కోర్సును, అంబర్ పేట్ లోని పోలీసు అకాడమీని ఊరి బయటకు తరలిద్దాం. అక్కడ ఈ పేదలందరికీ మంచి ఇళ్లు కట్టిద్దాం’ అంటున్నారు. ఏ ఒక్కరినీ కూడా నిర్వాసితుల్ని చేయబోయేది లేదంటున్నారు. తాను చెప్పినవన్నీ చాలకపోతే.. మూసీ నిర్వాసితులకోసం ఇంకా ప్రభుత్వం ఏం చేయాలో చర్చించి, నిర్ణయించడానికి హరీష్ రావు, ఈటల రాజేందర్, కేటీఆర్ తదితరులతో పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఒక అఖిలపక్ష కమిటీ వేద్దాం రమ్మని అంటున్నారు.

మరి ప్రతిపక్షనాయకులు అందుకు సిద్ధమేనా అనేది ప్రజల సందేహం. వీరందరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఉత్సాహం చూపించేవారే తప్ప.. వాస్తవంగా ప్రజలకు మేలు చేయడానికి శ్రద్ధ చూపించే వారు కాదని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

7 Replies to “రేవంత్ సవాలును స్వీకరించగల వారెవ్వరు?”

  1. హాయిగా డబల్ బెడ్రూం ఇల్లు ఇస్తే ఆ మూసి మురికిలో ఎవడుంటాడు..

  2. First..the 50 lacs to 1 cr. Flats / houses are demolished and being demolished. The innocent poor and middle-classe people with their lifetime hard-earning money and with bank loans purchased the same. Government also authenticated such purchases by registration 20 / 30 years back. The same government is now demolishing the said structures in the name of FTL and Buffer zone.

    How many years or decades it will take to form

    a committee and construct alternative houses

    to the victims. Everyone knows including the

    government knows the way all such programmex are implemented and how long it will take.

    It is a matter of humanity also.

  3. రేవంత్ అతి తెలివితేటలకి మళ్ళీ మీ మీడియా చిడతలు పట్టుకొని తయారు! ప్రభుత్వం చేసిన దాన్ని అఖిల పక్షం పేరుతో అన్ని పార్టీ ల మీద రుద్దే అతి తెలివితేటలు!

Comments are closed.