హంగ్ లో చక్రం తిప్పాలనేదే కేటీఆర్ కోరికా?

తెలంగాణలో భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.. తొందర పడిన కోయిల ముందే కూసినట్టుగా ఇంకా నాలుగున్నరేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే జోస్యం చెబుతున్నారు. అప్పుడు భాజపా, కాంగ్రెస్…

తెలంగాణలో భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.. తొందర పడిన కోయిల ముందే కూసినట్టుగా ఇంకా నాలుగున్నరేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే జోస్యం చెబుతున్నారు. అప్పుడు భాజపా, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగల మ్యాజిక్ ఫిగర్ సాధించలేవని ఆయన సెలవిస్తున్నారు.

తద్వారా.. నెక్ట్స్ ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి తమ మద్దతు తప్పదు అని అభిప్రాయపడుతున్నారు. తద్వారా, ఈ రెండు పార్టీల్లో ఒకరి చంక ఎక్కి వచ్చేసారికి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అధికారం అనుభవించాలని ఉవ్విళ్లూరుతున్నారులాగా ఉంది.

‘బాప్ 2024 కా అయితే.. బేటా 2029 కా’ అన్నట్టుగా ఉంది ఈ తండ్రీ కొడుకుల వ్యవహారం. 2024 ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వస్తుందని కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా కలలు కన్నారు. తమ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎటూ ఏడాది ముందే పూర్తియపోతాయి గనుక.. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పేయాలని ఆశపడ్డారు. అందుకే చాలా ఆశతో.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దేశమంతా పార్టీని విస్తరిస్తానని, ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేస్తానని రకరకాల ప్రగల్భాలు పలికారు. మహారాష్ట్ర, ఏపీ, ఒదిశా, తమిళనాడు రాష్ట్రాల్లో పార్టీ కార్యవర్గాలను కూడా ప్రకటించారు.

తెలంగాణలో అసెంబ్లీ గెలిచిన వెంటనే.. ఇక దేశమంతా పర్యటనలతో హోరెత్తించాలని.. కనీసం కేంద్రంలో ఏర్పడబోయే సంకీర్ణంలో చక్రం తిప్పగల కీలక భాగస్వామి కాగలనని కేసీఆర్ నమ్ముకున్నారు. ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీలో దారుణమైన పతనం తర్వాత- భారత రాష్ట్ర సమితి అనే పేరు మాత్రమే మిగిలింది. ఆ పార్టీ జాతీయ రాజకీయాల ఆలోచన యావత్తూ మంటగలిసిపోయింది.

తెలంగాణ అనే పదాన్ని పేరులో తొలగించడమే రాష్ట్రంలో శాపంగా మారిందని కూడా పలువురు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా పార్టీని గట్టిగా కాపాడుకోవడం మీదనే నాయకత్వం కసరత్తు చేస్తోంది.

ఇదంతా ఇలా ఉండగా.. హర్యానా ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ వెలిబుచ్చుతున్న ఆశలు చిత్రంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచిన, ఓడిన రెండు పార్టీలతోనూ ఆయనకు వైరం ఉంది. అందుకని ఆయన నర్మగర్భంగా.. ఈ ఎన్నికల ఫలితాలతో కొన్ని విషయాలు తెలిశాయని 2029 ఎన్నికల్లో కేంద్రంలో భాజపా, కాంగ్రెస్ రెండూ కూడా మ్యాజిక్ ఫిగర్ కు దూరంగానే ఆగుతాయని జోస్యం చెబుతున్నారు. అలా జరిగితే.. భారాస సారథిగా తాను కేంద్రంలో చక్రం తిప్పగలనని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు.

కానీ ఇల్లు చక్కబెట్టుకోకుండా.. కేంద్ర రాజకీయాల గురించి అతిశయమైన ఆలోచనలు చేస్తే తండ్రికి లాగానే తల బొప్పి కడుతుందని కేటీఆర్ తెలుసుకోవాలి.

7 Replies to “హంగ్ లో చక్రం తిప్పాలనేదే కేటీఆర్ కోరికా?”

  1. సెంటర్ లో వచ్ఛే హంగ్ గురించి తర్వాత స్టేట్ లో రాబోయే హంగ్ గురించి ఆలోచించండి…. తెలంగాణ లో బీజేపీ బలపడి 2028 ఎన్నికలకి తెరాస, కాంగ్రెస్ రెంటికి మెజారిటీ రాని పరిస్థితి వస్తే ఏమి చేస్తారో చూసుకోండి….కొంత ప్రభావితం చెయ్యగలిగే పరిస్థితిలో టీడీపీ-జనసేన కూడా ఉంటాయి….

Comments are closed.