త‌మ ఫామ్ హౌస్‌లోకి బుల్డోజ‌ర్ వ‌స్తుంద‌ని హ‌రీష్‌, కేటీఆర్‌కు భ‌యం

తెలంగాణ‌లో మూసీ ప్ర‌క్షాళ‌న రాజ‌కీయ వివాదానికి దారి తీసింది. ఇప్ప‌టికే చెరువులు, కుంట‌లు, కాలువ‌ల్ని ప‌రిర‌క్షించుకునే పేరుతో హైడ్రా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. వేలాది మంది రోడ్డున ప‌డ్డామ‌ని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ప్ర‌భుత్వ‌మే అనుమ‌తులు ఇచ్చి,…

తెలంగాణ‌లో మూసీ ప్ర‌క్షాళ‌న రాజ‌కీయ వివాదానికి దారి తీసింది. ఇప్ప‌టికే చెరువులు, కుంట‌లు, కాలువ‌ల్ని ప‌రిర‌క్షించుకునే పేరుతో హైడ్రా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. వేలాది మంది రోడ్డున ప‌డ్డామ‌ని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ప్ర‌భుత్వ‌మే అనుమ‌తులు ఇచ్చి, ఇప్పుడు చెరువులు, కుంట‌ల్లో నిర్మాణాలున్నాయ‌ని కూల్చ‌డం ఏంట‌నే ప్ర‌శ్న వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ పాలిట హైడ్రా శాపంగా మారుతుంద‌నే శాప‌నార్థాలు లేక‌పోలేదు.

మ‌రోవైపు తాజాగా మూసీ ప్రాజెక్టు తీవ్ర ర‌చ్చకు దారి తీసింది. ఇవాళ చార్మినార్ వ‌ద్ద రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ‌లో అక్ర‌మార్కుల కంటిపై కునుకు లేకుండా చేస్తాన‌ని హెచ్చ‌రించారు. మూసీ ద‌గ్గ‌రికి వ‌చ్చాన‌ని, స‌వాల్ విసిరిన హ‌రీష్‌రావు ఎక్క‌డికి వెళ్లాడ‌ని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. గ‌తంలో కాళ్ల‌కు తొడుక్కోడానికి హ‌రీష్‌కు చెప్పులు కూడా లేవ‌ని రేవంత్ ఎద్దేవా చేశారు. తాను చేసిన సాయాన్ని మ‌రిచిపోయావా? అంటూ హ‌రీష్‌ను రేవంత్ నిల‌దీశారు.

హైడ్రా అనగానే కేటీఆర్‌, హ‌రీష్‌రావు, ఈటెల బ‌య‌టికి వ‌చ్చార‌ని రేవంత్ ఎద్దేవా చేశారు. హైడ్రాకి పేద‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. చెరువులు, నాలాలు ఆక్ర‌మించిన వారు మాత్ర‌మే భ‌య‌ప‌డుతున్న‌ట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు. హైడ్రా అధికారులు అడిగిన‌ప్పుడు అనుమ‌తుల్ని చూపాల‌ని సీఎం తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాల‌ని అనుకుంటున్న ఆర్థిక ఉగ్ర‌వాదుల భ‌రతం ప‌డ‌తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. హైడ్రా, మూసి ప్ర‌క్షాళ‌న వేర్వేరు అని ఆయ‌న అన్నారు. మూసి మురికిలో మునిగి ఇబ్బందులు ప‌డుతున్న వాళ్ల‌కు సాయం చేస్తామ‌న్నారు. బుల్డోజ‌ర్ ఖాళాగా ఉంచాన‌ని, ఎవ‌రు అడ్డం వ‌చ్చి ప‌డుకుంటారో రావాల‌ని ఆయ‌న స‌వాల్ విస‌ర‌డం గ‌మనార్హం. కేవ‌లం త‌మ ఫామ్‌హౌస్‌లలోకి బుల్డోజ‌ర్ వ‌స్తుంద‌ని కేటీఆర్‌, హ‌రీష్‌రావు భ‌య‌ప‌డుతున్నార‌ని సీఎం ఆరోపించారు.

5 Replies to “త‌మ ఫామ్ హౌస్‌లోకి బుల్డోజ‌ర్ వ‌స్తుంద‌ని హ‌రీష్‌, కేటీఆర్‌కు భ‌యం”

Comments are closed.