తండ్రీ కొడుకులు ఇక ప్రజల్లోకి!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఒక్కసారే అసెంబ్లీకి వచ్చాడు. ప్రజల్లోకి రావడం లేదు. ఏ అంశం…

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడు. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఒక్కసారే అసెంబ్లీకి వచ్చాడు. ప్రజల్లోకి రావడం లేదు. ఏ అంశం మీద కూడా తన అభిప్రాయం చెప్పడంలేదు. సర్కారును పొగడటంలేదు, తెగడటంలేదు. నోరు మెదపడంలేదు.

ప్రభుత్వాన్ని తిట్టేపని బావా బావమరుదులైన కేటీఆర్ అండ్ హరీష్ రావు భుజాన వేసుకున్నారు. వారు ప్రభుత్వాన్ని వీలైనంతగా విమర్శిస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాను తొందరలోనే రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించడం విశేషం. తండ్రి కూడా వినూత్న కార్యక్రమాలతో జనంలోకి వస్తాడని చెప్పాడు.

కేసీఆర్ త్వరలో బయటకు వస్తాడని చెప్పడం ఇప్పుడు కొత్త విషయం కాదు. ఇదివరకు చాలాసార్లు చెప్పినా ఆయన బయటకు మాత్రం రాలేదు. ఇప్పుడు ఎందుకు బయటకు రావాలనుకుంటున్నాడంటే … డిసెంబర్ లో కాంగ్రెస్ పాలనకు ఏడాది నిండుతుంది. కాంగ్రెస్ సర్కారుకు కేసీఆర్ ఇప్పటికే కావలసినంత సమయం ఇచ్చాడట.

కాబట్టి నూరు తప్పులు చేసిన శిశుపాలుడిని అలనాడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో వధిస్తే, ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి రేవంత్ రెడ్డి అసలు స్వరూపం చూపిస్తాడట. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాడట. కేటీఆర్ పాదయాత్రతోనూ చేసే పని ఇదే. కొడుకు కాలినడకన తిరుగుతుంటే, కేసీఆర్ సభలు పెడతాడేమో!

తండ్రి ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదని కొడుకు సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. కూతురు కవిత లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు రాగానే తాను రాష్ట్రంలో పాదయాత్ర చేసి లిక్కర్ కుంభకోణంలో ఒక్కొక్కరి బండారం బయట పెడతానని, తనను దీంట్లో ఇరికించినవారి అంతు చూస్తానని ప్రతిజ్ఞ చేసింది. కానీ ఆ తరువాత గమ్మున ఉండిపోయింది. తండ్రి మాదిరిగానే మాటా పలుకు లేకుండా ఉండిపోయింది. మరి ఆమె ఎప్పుడు జనంలోకి వస్తుందో!

3 Replies to “తండ్రీ కొడుకులు ఇక ప్రజల్లోకి!”

Comments are closed.