ఆ ఇద్దరికీ కలిపి ఆరింటిలో ఒక్కటి!

ప్రస్తుతం శాసనసభలో 164 మంది సభ్యుల బలం ఉన్న ఎన్డీయే కూటమి పార్టీలకే ఈ మూడు స్థానాలు కూడా దక్కే అవకాశం ఉంది.

ఇప్పుడు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నిక వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన రాజ్యసభ ఎంపీలు ముగ్గురు సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసేశారు. అందువల్ల ఏర్పడిన ఖాళీలకు ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ మూడు స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎంపీ స్థానాలే. ప్రస్తుతం శాసనసభలో 164 మంది సభ్యుల బలం ఉన్న ఎన్డీయే కూటమి పార్టీలకే ఈ మూడు స్థానాలు కూడా దక్కే అవకాశం ఉంది. అయితే కూటమిలోని మూడు పార్టీల మధ్య పంపకాలు ఎలా సాగుతాయనే అంచనాలు రాజకీయ వర్గాల్లో షికారు చేస్తున్నాయి. రాజ్యసభకు దగ్గబోయే ప్రతి ఆరుస్థానాలకు ఒకటి జనసేన/ బిజెపిలకు ఇవ్వడానికి చంద్రబాబునాయుడు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది.

ఆ మేరకు ఇప్పుడు ఉపఎన్నిక జరగబోయే మూడుతో పాటు మరో మూడు స్థానాలకు కూడా ఎన్నిక జరిగితే.. ఆ ఆరింటిలో ఒక్క స్థానాన్ని ఈ రెండు పార్టీలకు కలిపి కేటాయించాలనేది ఆయన ప్రతిపాదన. జనసేన, బిజెపిలలో ఎవరు దక్కించుకోవాలనేది ఆ ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

చంద్రబాబునాయుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన ఫార్ములానే ప్రతిదానికి వాడేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బిజెపిలను కలిపి ఒక యూనిట్ గా చూశారు చంద్రబాబునాయుడు. తొలుత జనసేనకు ఇస్తానని చెప్పిన 30 సీట్లను ఇద్దరికీ కలిపి ఇస్తానని ఆ తర్వాత ప్రతిపాదించారు. ఆ ఇద్దరూ మల్లగుల్లాలు పడి 20-10 వంతున పంచుకున్న తర్వాత.. జనసేనకు ఒకటి అదనంగా కేటాయించారు. మొత్తంగా వారిద్దరికీ కలిపి 18 శాతం సీట్లు గిట్టుబాటు అయ్యాయి.

ఆ దామాషానే అన్నింటికీ వర్తింపజేయాలనేది చంద్రబాబు ఆలోచన. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా.. 18 శాతం పోస్టులు ఆ రెండు పార్టీలకు చెందిన వారికి ఇచ్చేలా కూర్పు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా అదే అనుసరించబోతున్నారని సమాచారం.

ఈ మూడు ఎంపీ స్థానాలు కూటమిలో ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో ఈ మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. తొలి ఇద్దరు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. వారికి చంద్రబాబు మళ్లీ అవకాశం కల్పిస్తారా? అలాంటి ఆఫర్ తోనే వారితో రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకున్నారా? అనేది ఇప్పుడు తేలనుంది.

11 Replies to “ఆ ఇద్దరికీ కలిపి ఆరింటిలో ఒక్కటి!”

  1. వాళ్లు వాళ్లు చూసుకుంటారులే..నువ్వు ఎక్కువ ఆలోచించి మనసు పాడుచేసుకోకు..

Comments are closed.