కరోనా సైడ్ ఎఫెక్టులపై దాదాపు రెండేళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇబ్బందులు పడ్డారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం, కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు లాంటి ఎన్నో ప్రతికూల ప్రభావాల్ని కరోనా చూపెట్టింది. తాజాగా ఇప్పుడు మరో సైడ్ ఎఫెక్ట్ కూడా బయటపడింది.
కరోనా బారిన పడిన పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందట. ఐఐటీ ముంబయి యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత వారం విడుదలైన ఏసీఎస్ ఒమేగా జర్నల్ లో ఈ పరిశోధన ఫలితాల్ని వెల్లడించారు.
తమ అధ్యయనం కోసం 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్ని ఎంచుకుంది ఐఐటీ ముంబయి. 10 మంది ఆరోగ్యవంతమైన పురుషులు, కరోనా నుంచి కోలుకున్న 17 మంది పురుషుల నుంచి వీర్యకణాల్ని సేకరించి విశ్లేషించింది. వీళ్లలో కరోనా బారిన పడి కోలుకున్న పురుషుల్లో.. వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు.
కరోనా బాధితుల వీర్యకణాల్లో సంతానోత్పత్తికి సంబంధించిన 2 కీలకమైన ప్రొటీన్లు తగ్గినట్టు గుర్తించారు. ఆరోగ్యవంతమైన పురుషులతో పోలిస్తే.. కరోనా బాధితుల్లో ఈ ప్రొటీన్ల సంఖ్య చాలా తక్కువగా ఉందంట. మన దేశంలో కరోనా బారిన పడిన పురుషుల సంఖ్య కోట్లలో ఉంది.