పొలిటికల్ కాన్సెప్ట్ తో గేమ్ ఛేంజర్ సినిమా వస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే, ఇప్పటికే రిలీజైన టీజర్ లో రాజకీయ నాయకుల గెటప్ లో నటులున్నారు. ఓ బహిరంగ సభ ఎపిసోడ్ కోసం విశాఖ సాగరతీరంలో అప్పట్లో వేసిన భారీ సెట్ సన్నివేశాలు కూడా లీక్ అయ్యాయి. పైగా ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి.
కాబట్టి గేమ్ ఛేంజర్ ను ఓ పొలిటికల్ మూవీగా చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి మరింత బజ్ యాడ్ చేశాడు నిర్మాత దిల్ రాజు. గేమ్ ఛేంజర్ సినిమాలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో జరుగుతున్న కొన్ని ఘటనలుంటాయని ప్రకటించాడు.
“మీకు ఈ సినిమాలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చాలా ఘటనలు కనిపిస్తాయి. అయితే అవి చూసి ఈ సినిమా రాసుకోలేదు. దర్శకుడు శంకర్, నాలుగేళ్ల కిందటే రాసుకున్న సన్నివేశాలవి. అవిప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో జరుగుతున్నాయి. అవే థియేటర్లలో ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టిస్తాయి. కచ్చితంగా ప్రేక్షకులకు ఓ కిక్ ఇస్తుంది.”
ఇలా గేమ్ ఛేంజర్ లో ఏపీ, తెలంగాణల రాజకీయాలుంటాయనే విషయాన్ని దిల్ రాజు స్పష్టం చేశాడు. అమెరికాలోని డాలస్ లో జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.
సుకుమార్.. చిరంజీవి.. పవన్ కల్యాణ్
డాలస్ ఈవెంట్ తో సినిమా గ్రౌండ్ ఈవెంట్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి. యూఎస్ ఈవెంట్ కు సుకుమార్ ప్రత్యేక అతిథి. మరో 2 భారీ ఈవెంట్స్ ఉన్నాయి. త్వరలోనే ఓ గ్రౌండ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. దీనికి చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. ఇదే వేదికపై గేమ్ ఛేంజర్ ట్రయిలర్ రిలీజ్ అవుతుంది.
ఇక మరో భారీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి రాజమండ్రిని ఫైనలైజ్ చేశారు. వేదిక ఇదే ఉంటుందా లేదా విజయవాడ పరిసర ప్రాంతాలకు మారుస్తారా అనేది మరికొన్ని రోజుల్లో డిసైడ్ అవుతుంది. పవన్ కల్యాణ్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.
Fake publicity