రెండు దఫాలుగా నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే ప్రధాన పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల నియామకంలో మాత్రం జాప్యం చేస్తుండడం చర్చనీయాంశమైంది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా), విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీజీటీఎమ్), విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ల నియామకాల్ని ప్రభుత్వం చేపట్టలేదు.
కీలకమైన ఈ నియామకాల జాప్యానికి కారణాలపై టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇంకా బేరాలు కుదర్లేదని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటికి పోటీ ఎక్కువగా వుంది. ఆశావహులతో కూటమి ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఒక్కోసారి ఒక్కొక్కరి పేరు తెరపైకి వస్తోంది. అయితే ఎవరికీ ఇంకా ఖరారు కాలేదని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
భారీ మొత్తంలోనే పదవికి వేలం పాట వుందని కూటమి నేతలు వ్యంగ్యంగా అంటున్నారు. అందువల్లే ఆలస్యం అవుతోందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం… మరోలా చెబుతున్నారు.
ఎవరైతే అధికారంలోకి రావడానికి శ్రమించారో వాళ్లకు కీలక పదవి కట్టబెట్టడానికి కసరత్తు చేస్తున్నామని అంటున్నారు. ఇందులో నిజం సంగతి దేవుడెరుగు. పదవులు దక్కని నేతలు మాత్రం, అడిగినంత ఇవ్వకపోవడం వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆరోపించడం ఖాయం.