సీఎంతో భేటీ.. జరిగే పనేనా?

ముఖ్యమంత్రికి కాస్త సన్నిహితంగా ఉండే వ్యక్తులందర్నీ కలుపుకొని, రేవంత్ ను కలిసే ప్రయత్నం చేస్తోంది.

నటుడు అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వైరం గురించి అందరికీ తెలిసిందే. మరోవైపు అసెంబ్లీ సాక్షిగా టాలీవుడ్ ను ముఖ్యమంత్రి ఏకి పడేసిన సంగతి కూడా తెలిసిందే.

ఒక్క రాత్రి జైళ్లో ఉండి వచ్చిన వ్యక్తిని పరామర్శించడానికి క్యూ కట్టిన టాలీవుడ్ ప్రముఖులు, హాస్పిటల్ లో చావుబతుకుల మధ్య ఉన్న పిల్లాడ్ని చూడ్డానికి ఎందుకు రాలేదంటూ నేరుగా ప్రశ్నించారు. దీనికి టాలీవుడ్ నుంచి సమాధానం లేదు.

ఇంకా చెప్పాలంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత వివాదం అటుఇటు తిరిగి, వయా బన్నీ మీదుగా, టాలీవుడ్ కు పాకినట్టయింది. దీంతో టాలీవుడ్ ప్రముఖులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సమాయత్తమవుతున్నారు.

ఇకపై పెద్ద సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఉండవని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. అటు మంత్రి కోమటిరెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు, సందేశాత్మక చిత్రాలకు మాత్రమే ఇకపై ప్రత్యేక అనుమతులుంటాయని ఆయన వెల్లడించారు.

అసలే వస్తున్నది సంక్రాంతి. పెద్ద సినిమాలన్నీ ప్రత్యేక అనుమతులపైనే ఆశలు పెట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా నైజాం మార్కెట్ ఎంత కీలకమనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే టాలీవుడ్ ఏకమైంది.

ముఖ్యమంత్రికి కాస్త సన్నిహితంగా ఉండే వ్యక్తులందర్నీ కలుపుకొని, రేవంత్ ను కలిసే ప్రయత్నం చేస్తోంది. గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ కోసం అమెరికా వెళ్లిన దిల్ రాజు, తిరిగొచ్చిన వెంటనే ఆయన ద్వారా అపాయింట్ మెంట్ తీసుకునే ఆలోచన చేస్తున్నారు కొందరు పెద్దలు. ఎందుకంటే, ముఖ్యమంత్రికి, సినిమాటోగ్రఫీ మంత్రికి దిల్ రాజు క్లోజ్. రీసెంట్ గా ఆయన్ను తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.

అయితే ఈ రాయబారం ఫలిస్తుందా.. పరిశ్రమపై ముఖ్యమంత్రి కోపం చల్లారుతుందా? అసలు ఈ మీటింగ్ లో కేవలం ఇండస్ట్రీ విషయాలే మాట్లాడతారా.. అల్లు అర్జున్ వ్యవహారంలో ఎవరైనా రాయబారం చేసే ధైర్యం చేస్తారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాల్లేవ్.

6 Replies to “సీఎంతో భేటీ.. జరిగే పనేనా?”

  1. సినిమాలలోని పాత్రల వరకే హీరోలు పేదల పక్షం. బయట జనాలను పీల్చి పిప్పి చేసే నీచమైన పనులు. ప్రజలు నిజాన్ని గ్రహించి సినిమాలను స్వచ్చందంగా బహిష్కరించాలి.

  2. జైలు నుంచి బయటకు రావడానికి 7 కోట్లు ఖర్చుపెట్టావు అదే

    ఒక్క కోటి రూపాయలు రేవతి కుటుంబానికి ఇచ్చి క్షమాపణలు చెప్పాల్సింది స్మగ్లర్.

Comments are closed.