కేసీఆర్ కు, ఆయన కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి సీఎం కావడం కంటే కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తున్న తీరు ఎక్కువ ఆగ్రహం కలిగిస్తోంది. తెలంగాణ తల్లి మారిపోయింది. ప్రభుత్వ చిహ్నం మారిపోయింది. అధికారిక గీతం మారిపోయింది. ధరణి మారిపోయింది.
కేసీఆర్ ప్రవేశపెట్టినవన్నీ మార్చేశాడు రేవంత్ రెడ్డి. కొత్త తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో బతుకమ్మను తీసేయడం రేవంత్ చేసిన తప్పు. ఈ విగ్రహాన్ని కేసీఆర్ ఫ్యామిలీ, గులాబీ పార్టీ నాయకులు అంగీకరించలేదు. ముఖ్యంగా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత చాలా ఆగ్రహంగా ఉంది.
విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంతో ఆమెకు నిద్రపట్టడం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆమె బతుకమ్మను పాపులర్ చేసింది. విదేశాల్లో కూడా బతుకమ్మను ఆడించింది. బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అనే రేంజ్ కు వెళ్ళింది. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో కవిత పోలికలు ఉన్నాయని, అందుకే మార్చామని రేవంత్ రెడ్డి అన్నాడు.
ఆయనకు కవిత పోలికలు కనిపించాయోమో ! ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను రాష్ట్రంలో ఊరూరా పెడతామని ఇదివరకే చెప్పింది. మొదట జగిత్యాలలో ఇరవైరెండు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించింది. తాజాగా ఎన్నారైల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమ తెలంగాణ తల్లి కోసం పోరాటం చేస్తామని ప్రకటించింది.
ఇందుకు అందరూ సహకరించాలని కోరింది. ప్రతి ఊరి నుంచి ఉద్యమ తెలంగాణ విగ్రహాలు పెట్టాలని తనకు విజ్ఞప్తులు అందుతున్నాయని చెప్పింది. ప్రతి ఒక్కరు ఉద్యమ తెలంగాణ తల్లిని కోరుకుంటున్నారని చెప్పింది. మరి పాత తెలంగాణ తల్లి కోసం కవిత పోరాట రూపం ఎలా ఉంటుందో?