చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కు వీరాభిమానం వుంటే వుండొచ్చు. కమ్మ-కాపు కలిసి రాజకీయాలే లక్ష్యంగా ఆయన శ్రమిస్తే శ్రమించవచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్ లో కమ్మ..కాపు ఓట్లు కలిసే వ్యవహారమేనా? దశాబ్దాల కాలంగా ఈ రెండు కులాల మధ్య నెలకొన్న విబేధాలు ఇలా మంత్రం వేస్తే అలా మాయం అయిపోయేవేనా? కమ్మ ఓట్లు సాలిడ్ గా తెలుగుదేశం పార్టీకి పడతాయి. అలా అని అవే కమ్మ ఓట్లు కాపు అభ్యర్థులకు వేస్తారా? కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రెండు కులాల నడుమ ఓట్ల ట్రాన్సాఫార్మేషన్ జరిగే పనేనా?
దశాబ్దాల కాలంగా తూర్పు, దక్షిణ కోస్తా జిల్లాల్లో కాపు, కమ్మ వర్గాల నడుమ పొసగని పరిస్థితి వుండనే వుంది. విజయవాడలో రాధా, రంగాల వైనం జనాలకు గుర్తున్నదే. రంగా హత్యోదంతం తరువాత జరిగిన సంఘటనలు గుర్తున్నవే. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబుకు మేలు చేకూర్చే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ వీరిని కలిపి పెద్ద ఓటు బ్యాంక్ తయారుచేసే ఆలోచన చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో లోపాయకారీ పొత్తుతో కాస్త సీట్లు తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు బాహాటంగా పొత్తు పెట్టుకుంటే మరింత ఉపయోగం అని ఆయన ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇది ఎంత వరకు ఆచరణ సాధ్యం అన్నది చూడాలి. పొత్తు వరకు పవన్ చేతిలో పని కనుక, పదో, పాతికో సీట్లు తీసుకుని సై అనవచ్చు. కానీ ఓట్లు వేయించడం ఎవరికి సాధ్యం?
ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనే రామ్ చరణ్..ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోటా పోటీ పడుతున్నారు. మహేష్ ను బన్నీ ఫ్యాన్స్, బన్నీని మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో యాగీ చేస్తూనే వుంటారు. నిన్నటికి నిన్న ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ లో జనసేన జెండాను కిందకు లాగి పడేసింది ఎవరు?
అసలు పవన్ పొత్తు పలుకు పలకగానే జనసేన అభిమానుల నుంచే వ్యతిరేకత సోషల్ మీడియాలో ప్రారంభమైంది. మరోపక్కన పొత్తులేకుండా తెలుగుదేశం పార్టీ జగన్ ను ఓడించలేదు అనే విధంగా పవన్ చెప్పడం, ఆ పార్టీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. పొత్తు వుంటే 160 లేదంటే 110 అంటూ తెలుగుదేశం జనాలు సర్ది చెప్పుకుంటున్నారు. పొత్తు లేకపోతే 110 అని తెలుగుదేశం జనాలే అంటున్నారు అంటే వాస్తవమైన అంకె ఎంత వుంటుంది? ఎనబై నుంచి తొంభై అనుకోవాలా? ప్రభుత్వం ఏర్పాటుకు అవి సరిపోతాయా?
కాపులు పోటీ చేసిన చోట మరో పార్టీ కమ్మవారికి టికెట్ ఇచ్చినా, కమ్మవారు పోటీ చేసిన చోట ఇంకో పార్టీ కాపులకు టికెట్ ఇచ్చినా ఓట్లు అటు ఇటు కావని గ్యారంటీ వుందా? ఇద్దరు అభ్యర్థులు ఒకే కులం అయితే ఓట్లు చీలవని నమ్మకముందా?
అన్నింటి కన్నా కీలకమైన విషయం మరొకటి వుంది. కాపులు ఎటు వుంటే బిసి లు దానికి ఎదురుగా వుంటారు. ఎస్సీలు కూడా డిటో..డిటో. ఇది చిరకాలంగా వస్తున్న, చూస్తున్న వ్యవహారం. ఇప్పుడు కాపులను చేరదీయడం ద్వారా తెలుగుదేశం పార్టీ బిసి ఓట్లను పూర్తిగా దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఇఫ్పటికే బిసిలను వైకాపాకు దగ్గరయ్యారని, వారిని అక్కడి నుంచి వేరు చేసేందుకు జగన్ బావ అనిల్ లాంటి వాళ్లను ప్రయోగించే పనిలో పడ్డారు. అనిల్ ద్వారా బిసిలు, మైనారిటీలను లాగేయాలని ఓ పన్నాగం. అంటే ఆ ఓట్లు తమకు ఎలాగూ రావు, జగన్ కూ వుండకూడదనే కదా?
మరి ఇప్పుడు కాపులను చేరదీయడం ద్వారా పూర్తిగా ఆ ఓట్లను దూరం చేసుకోవడం అవుతుంది కదా? ఒకప్పటి అగ్రవర్ణాలు వేరు…ఇప్పుడు గోదావరి జిల్లాల్లో అగ్రవర్ణాలు వేరు. ఎస్సీలకు కాపులకు ఎక్కడో ఒక దగ్గర వైరుధ్యం కనిపిస్తూనే వుంటుంది. ప్రజారాజ్యం, జనసేన పార్టీలు స్వంతగా గెలవలేకపోవడానికి కారణం ఇదే.
శ్రీకాకుళంలో కాళింగులు, విజయనగరం జిల్లాలో కొప్పల వెలమలు, విశాఖ జిల్లాలో గవరలు వీరెవరికి కాపులతో సయోధ్య లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ ఓట్లు దూరం చేసుకుంటుందా? పైగా జనసేనతో పొత్తు పెట్టుకుంటే కనీసం పాతిక స్థానాలు అయినా వదిలేసుకొవాలి. వాటిని గెలిపించుకోవాలి కూడా. లేదూ అంటే అది వైకాపాకు ప్లస్ అవుతుంది.
జనసేన మెజారిటీ టికెట్ లు కాపులకు ఇవ్వాల్సి వుంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా కాపుల మీద ప్రేమ కనబర్చాలి. అలా అంటే టికెట్ లు ఇవ్వాలి. అప్పుడు బిసి ల పరిస్థితి ఏమిటి? మనో భావాలు ఏమిటి? కేవలం ఒక్క కాపుల పొత్తుకోసం అనేక కులాల ఓట్లు తెలుగుదేశం పార్టీ వదులుకుంటుందా?
కేవలం జగన్ ను ఓడించి, అధికారం అందుకోవడం అన్న రంథిలో పడి గ్రౌండ్ రియాల్టీని మరిచిపోతున్నట్లు కనిపిస్తోంది.