కర్నూలు జిల్లా రాజకీయంలో ఒక వెలుగు వెలిగిన కుటుంబం భూమా ఫ్యామిలీ. పార్టీలు ఏవైనా తమ ప్రతిష్టను నిలుపుకున్నారు. అటు ఎస్వీ కుటుంబం, ఇటు భూమా కుటుంబం రాజకీయంగా దశాబ్దాలుగా తమ ఉనికిని చాటుకుంటూ వచ్చింది.
భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల హయాంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఎక్కడా భూమా ప్రభ తగ్గలేదు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ చేత ఆదరణ పొందేంత చాకచక్యంగా వ్యవహారాలను నడిపించుకున్నారు.
పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. ఒకే స్థాయి విలువను పొందారు. అయితే.. ఒకే ఒక యాక్సిడెంట్ ఆ కుటుంబం రాజకీయ గమనాన్ని మార్చేసింది. భూమా శోభా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబ రాజకీయ పయనంలో అనేక తప్పటడుగులు పడ్డాయి.
అంత వరకూ ఓర్పుతో నేర్పుతో కుటుంబ రాజకీయ ఉనికిని కాపాడారు శోభ. భూమా నాగిరెడ్డిది భుజబలం అయితే, శోభ బుద్ధిబలంతో రాణించారు. విషాదకరంగా శోభా నాగిరెడ్డి మరణంతో.. రాజకీయంగా భూమా కుటుంబానికి ఒడిదుడుగులు మొదలయ్యాయి.
ఆరేళ్లు గడిచే సరికి ఇప్పుడు ఒక కిడ్నాప్ కేసులో భూమా నాగిరెడ్డి కూతురు అరెస్టు అయ్యేంత వరకూ వచ్చింది పరిస్థితి. ఈ అరెస్టు ఏ ఏపీలోనో జరిగి ఉంటే.. రాజకీయ కక్ష సాధింపు అంటూ సులువుగా తీసి పడేసేవారు. అయితే కిడ్నాపింగ్ వ్యవహారం కావడం, అఖిలప్రియ భర్త పరారీలో ఉండటం, అఖిలను నిందితురాలిగా తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి మహిళా పోలిస్ స్టేషన్ కు తరలించడం… వ్యవహారం తీవ్రతను తెలియజేస్తూ ఉంది.
చంద్రబాబు నాయుడి వేధింపులను తట్టుకోలేకే భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు అనేది తేటతెల్లం అయ్యే అంశం. అలా పార్టీ మారినా నాగిరెడ్డికి దక్కింది ఏమీ లేదు.
చంద్రబాబు మార్కు రాజకీయాలతో ఆయనకు గుండెపోటు తప్పలేదు. ఆ తర్వాత ఊరడింపుగా అఖిలప్రియకు మంత్రి పదవిని ఇచ్చారు. ఆ తర్వాత అఖిలప్రియ రాజకీయాలను గమనిస్తే.. అపరిపక్వంగా సాగుతున్నట్టుగా ఉంది ఆమె తీరు.
భూమా నాగిరెడ్డి హయాంలో ఆయనకు ఆత్మల్లా వ్యవహరించిన అనేక మంది అనుచరులు అఖిలకు పూర్తిగా దూరం అయ్యారు. కేవలం అనుచరులే కాదు.. సొంత కుటుంబీకులు కూడా దూరం అయ్యారు.
నాగిరెడ్డి సోదరుల కొడుకులు ఇప్పుడు తలో దిక్కున కనిపిస్తారు. కొందరు బీజేపీ అంటారు, మరి కొందరు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇలా తలో వైపున ఉన్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి కూడా గత కొంతకాలంగా అఖిలతో సఖ్యతగా కనపడకపోవడం గమనార్హం.
దీనికంతటికీ ప్రథమ కారణం.. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ అనే మాటే అనుచరవర్గంలో, వారి కుటుంబీకుల నుంచి ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది. భార్గవ్ రామ్ తీరు నచ్చక చాలా మంది దూరమయినట్టుగా చెప్పుకుంటూ ఉంటారు.
అయితే కర్నూలు రాజకీయంతో కానీ, ఆళ్లగడ్డతో కానీ ఏ రకంగానూ సంబంధం లేదని భార్గవ్ రామ్ ను అఖిల కుటుంబ వ్యవహారాల వరకే పరిమితం చేసి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చేది కాదేమో! కనీస అవగాహన, ఏ మాత్రం సంబంధం లేని భార్గవ్ రామ్.. రాజకీయాల్లోకి తలదూర్చడం.. తనను తాను మరో భూమా నాగిరెడ్డిలా ఫీలయిపోవడం వల్ల ఇప్పుడు అఖిలప్రియ అరెస్టు వరకూ వచ్చేసినట్టుగా ఉంది.
భార్యను అరెస్టు చేస్తే.. తను పరారీలో ఉన్నాడంటే ఆయన తీరును అర్థం చేసుకోవచ్చనే మాట ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఇది తొలి కిడ్నాపింగ్ అంశం కాదు, ఆ మధ్య పాల డైరీ సంఘం ఎన్నికకు సంబంధించి కూడా ఈ తరహా రచ్చ జరిగింది.
అయితే ఇప్పుడు ఏపీ పోలీసులు వీళ్లను ఏం చేసినా అది రాజకీయ కక్ష సాధింపు అంటారు. అందుకే అప్పుడు ఇలాంటి అరెస్టులు జరిగినట్టుగా లేవు. తెలంగాణ పోలీసులకు అలాంటి మొహమాటాలు ఉండవు కాబట్టి.. మాజీ మంత్రిని అరెస్టు చేసేశారు. భర్త కోసం గాలిస్తున్నారు.
ఏడేళ్ల కాలంలో.. భూమా కుటుంబ రాజకీయం ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ వచ్చిందనే అంశం సర్వత్రా చర్చనీయాంశం అవుతోందిప్పుడు.