దీనికి ముందు రాసిన ‘కర్ణాటక ఎన్నికల ముఖచిత్రం’, ‘కర్ణాటకలో యింటిపోరు’ చదివితే యీ వ్యాసం బాగా బోధపడుతుంది. రేపు ఫలితాలు వెలవడుతున్న సమయంలో జాతీయ మీడియాలో గణాంకాలతో, గ్రాఫులతో విశ్లేషణలు సాగుతున్నపుడు అర్థం చేసుకోవడానికి యీ సమాచారమంతా ఉపకరిస్తుంది. తొలి వ్యాసంలో చెప్పినట్లు కీలకమైన దక్షిణాదిన విస్తరించడానికి బిజెపి అవలంబించిన వ్యూహాలు ఏ మేరకు ఫలించాయో మనకూ ఒక అవగాహన వస్తుంది. రెండవ వ్యాసంలో నేను లింగాయతుల గురించి రాశాను. రెండవ పెద్ద కులమైన వొక్కళిగుల గురించి దీనిలో రాస్తాను. బిజెపికి పూర్తి మెజారిటీ రావాలంటే వొక్కళిగ ఓట్లు ఎంత కీలకమైనవో మొదటి వ్యాసంలో రాశాను. క్లుప్తంగా చెప్పాలంటే, పాత మైసూరు ప్రాంతంలో బిజెపి యింకా పాగా వేయలేకపోతోంది. అక్కడ వొక్కళిగుల పార్టీ ఐన జెడిఎస్దే ప్రభ వెలుగుతోంది.
వారికి 18-20% ఓట్లు ఉండడంతో ప్రతీ సారీ 30-40 సీట్లు వస్తున్నాయి. ఆ పార్టీని లుప్తం లేదా నామమాత్రం చేయగలిగితేనే బిజెపి ఎవరి సాయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. లేకపోతే జెడిఎస్‌తో బేరసారాలు తప్పవు. 2018లో నెగ్గిన 44 మంది వొక్కళిగ ఎమ్మెల్యేలలో జెడిఎస్ వారు 21, బిజెపి వారు 14, కాంగ్రెసు వారు 9. లింగాయతుల మద్దతు ఎలాగూ ఉంది కాబట్టి యీ ఎన్నికలలో వొక్కళిగల మద్దతు కూడా కూడగడితే పాత మైసూరులో జెడిఎస్‌తో సమానంగానో, ఎక్కువో సీట్లు తెచ్చుకుంటే తమకు తిరుగులేదని బిజెపికి తెలుసు. అందుకు పడుతున్న శ్రమ గురించి, యితర కులాలను ఆకర్షించడానికి అనుసరిస్తున్న విధానం గురించి కూడా రాస్తున్నాను.
కర్ణాటక జనాభాలో లింగాయతులు 17% (14-16 అని కొందరంటారు), వొక్కళిగలు 15% (10-11 అని కొందరంటారు). రాజకీయంగా లింగాయతుల తర్వాత ద్వితీయస్థానం వొక్కళిగలదే. ఇప్పటివరకు కర్ణాటక సిఎంలలో 7గురు ఆ కులం వారే. లింగాయత్, వొక్కళిగ ఎమ్మెల్యేలు కలిస్తే మొత్తం ఎమ్మెల్యేలలో 45% ఉన్నారు. మిగిలిన 55%ను తక్కిన కులాలు పంచుకోవాలి. వొక్కళిగలు ప్రధానంగా వ్యవసాయదారులు. దక్షిణ కర్ణాటకలో చెఱుకు పండిస్తారు. పాలవ్యాపారం కూడా చేస్తారు. కావేరీ జలాల సమస్యకు, స్థానిక సమస్యలకు వీళ్లు ఎక్కువ ప్రాధాన్యత యిస్తారు. 224 స్థానాల్లో 100 సీట్లను ప్రభావితం చేయగలరు. 8 జిల్లాల్లో (రామనగర, మండ్య, మైసూరు, చామరాజనగర్, కొడగు, కోలార్, తుమకూరు, హాసన్) 59 నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది. వీటిలో 2018లో జెడిఎస్‌కు 24, కాంగ్రెసుకు 18, బిజెపికి 15 వచ్చాయి. బెంగుళూరు అర్బన్ (28), రూరల్ (4), చిక్కబళ్లాపుర (8) ప్రాంతంలోని 28 స్థానాల్లో కూడా ఆధిపత్యముంది. ప్రధానంగా ఉన్న యీ కులంపై జెడిఎస్ పట్టుంది. కాంగ్రెసు నాయకుడు డికె శివకుమార్‌ది కూడా యీ కులమే.
బిజెపిపై లింగాయతు ముద్ర బలంగా ఉంది కాబట్టి వొక్కళిగలు తమకు దూరమౌతున్నారనే భయంతో బిజెపి వాళ్లను బాగా ఆకర్షించ సాగింది. వాళ్లకు దొరికిన వొక్కళిగ కులానికి చెందిన చారిత్రాత్మక వ్యక్తి నాదప్రభు కెంపెగౌడ. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి సామంతుడిగా ఉంటూ బెంగుళూరును నిర్మించాడు. అతని పేర బెంగుళూరులో ప్రధాన కూడళ్లు ఉన్నాయి. ఎయిర్‌పోర్టుకి కూడా అతని పేరే పెట్టారు. ఇప్పుడు 2022 నవంబరులో 108 అడుగుల కంచు విగ్రహాన్ని బిజెపి రాష్ట్రప్రభుత్వం నెలకొల్పి మోదీ చేత ఆవిష్కరింప చేసింది. ఆంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పితే దళిత ఓట్లు కురుస్తాయని అనేక పార్టీలు భావిస్తూ ఉంటాయి. కానీ వాళ్లు చలించటం లేదు. ఎవరికి వేద్దామనుకున్నారో వాళ్లకే వేస్తున్నారు. ఈ విగ్రహం బిజెపికి ఎన్ని ఓట్లు తెస్తుందో చూడాలి. ఈ విగ్రహావిష్కరణకు ముందు రాష్ట్రంలోని 22 వేల స్థలాల నుంచి మట్టి సేకరించి, పూజ చేశారు. అమరావతి శంకుస్థాపన కోసం బాబూ యిలాగే చేశారు. కానీ ప్రయత్నమంతా మట్టిపాలైంది.
ఎన్నికల ప్రచారం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ వచ్చి తమ గోరఖ్‌నాథ్ మఠానికి, మండ్యాలో వొక్కళిగులకు ఉన్న ఆదిచుంచనగిరి మఠానికి చారిత్రక సంబంధం ఉందన్నాడు! ఇదో కొత్త కోణం. ఇప్పటిదాకా వినలేదు. యుపిలో కూడా యిదే మాట చెప్తారో లేదో తెలియదు. దీనితో పాటు టిప్పు సుల్తాన్ వివాదం గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు వొక్కళిగలు బహుళంగా ఉన్న పాత మైసూరుకి చెందినవాడే టిప్పు సుల్తాన్. గొప్ప వీరుడిగా పేరు కెక్కిన టిప్పుకి ‘‘మైసూరు టైగర్’’ అనే బిరుదు ఉంది. మైసూరు ప్రాంతీయులే కాదు, యావత్తు కన్నడిగులు టిప్పు వారసత్వం గురించి గొప్పగా చెప్పుకుంటారు. టిప్పు నాటి కట్టడాలను, అతని సమాధిని జాగ్రత్తగా పరిరక్షించుకుని చూపించుకుంటారు.
బ్రిటిషు రాణి ఇండియాను నేరుగా పాలించడానికి ముందు పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ వారు వ్యాపారనిమిత్తం మన దేశానికి వచ్చి సంస్థానాధీశుల మధ్య పేచీలు పెట్టి, తాము విస్తరిస్తూ పోయారని చరిత్రలో చదువుకున్నాం. వారిలో దక్షిణాదిన గట్టిగా నిలదొక్కుకున్నది ఫ్రెంచ్, బ్రిటిషు వారు. రాజుల్లో కొందరు యిటు వుంటే, వారి ప్రత్యర్థులు అటు వుండేవారు. టిప్పు, అతని తండ్రి హైదరాలీ ఫ్రెంచ్ వారి తరఫున ఉండి బ్రిటిషువారిని అడలెత్తించారు. అందువలన బ్రిటిషు వారికి టిప్పు అంటే మహా కోపం. అతను కూడా వీళ్లని బాగా కవ్వించాడు. టిప్పు యంత్రాలను ఉపయోగించడంలో దిట్ట. 1782లో ఆంగ్లో-మైసూరు యుద్ధంలో ఆంగ్లేయుల ఓటమికి కారణమైన టిప్పు రాకెట్ గురించి చదివే ఉంటారు. దాంతో బాటు టిప్పు ఒక ఆటబొమ్మ చేయించాడు. ఇంగ్లీషు సైనికుణ్ని తినేస్తూన్న పులి బొమ్మ అది. కీ యిస్తే సైనికుడి అరుపులు, పులి గాండ్రింపులు వినబడుతూ ఉంటాయి.
ఈ మధ్యే ‘‘వీక్’’లో బెంగుళూరులో నడిచిన టాక్సిడెర్మీ పరిశ్రమ గురించి పెద్ద వ్యాసం చదివాను. ఈ బొమ్మ కారణంగా ఇంగ్లీషు వాళ్లు పులులపై కోపాన్ని పెంచుకున్నారట. టిప్పుకి మైసూరు పులి అని పేరుండడంతో పులులను టిప్పుకు ప్రతీకలుగా చూసి పులుల వేటను ఉధృతంగా సాగించి, ఆ ప్రాంతంలో పులులన్నిటిని సంహరించారట. ఇంత ఉక్రోషం వాళ్లకు టిప్పు మీద. చివరకు 1799లో టిప్పును ఓడించి, అతని మరణానంతరం రాజ్యాన్ని నాలుగు ముక్కలు చేసి యుద్ధంలో తమకు సాయపడిన నిజాం, మరాఠాలకు చెరో ముక్కా యిచ్చి, ఒకటి తాముంచుకుని, నాలుగో ముక్కకు అధిపతిగా ఒడయార్ వంశస్తుడైన కృష్ణరాజ్ అనే ఐదేళ్ల కుర్రాణ్ని సింహాసనంపై కూర్చోబెట్టి దాన్నీ పరోక్షంగా పాలించేశారు.
టిప్పుపై యింత క్రోధం ఉన్న ఆంగ్లేయులు రాసిన చరిత్రంతా అక్షరసత్యం కానక్కరలేదు. సర్వాబద్ధమూ కానక్కరలేదు. అప్పటి పరిస్థితులను బట్టి అతని ప్రవర్తనను అంచనా వేయగలగాలి. ఇటీవల కొంతకాలంగా టిప్పును హిందూద్వేషిగా, మూకుమ్మడిగా హిందువులను చంపించిన క్రూరుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. టిప్పు, అతని తండ్రి హైదరలీకి హిందూ మంత్రులుండేవారు. టిప్పు చేయించిన పూజలు అని గతంలో ఒక వ్యాసం కూడా రాశాను. రాజకీయ కారణాల చేత జరిపిన యుద్ధాలను, హింసాకాండను కూడా మతం ఖాతాలో వేసేసి, టిప్పును రాక్షసుడిగా చూపిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమాలో చోళులు, పాండ్యులు ఒకరినొకరు ఎలా నరుక్కున్నారో చూపించారు. దానికి మతం రంగు పులమగలమా? బహమనీ సుల్తానులు తమలో తాము పోరాడుకున్నారు. ఔరంగజేబు గోల్కొండపై దండెత్తి సరందాజ్ ఖాన్ అనే సేనాన్ని డబ్బుతో లోబరుచుకుని, కుతుబ్షాహిని ఓడించి జైల్లో పడేశాడు. ఇక్కడ అందరూ ముస్లిములే.
అయినా ఎప్పుడో చచ్చిపోయిన టిప్పు గురించి యింత చర్చ అవసరమా? టిప్పును హిందూద్వేషిగా ఎస్టాబ్లిష్ చేసి, యిప్పుడు కర్ణాటకలో ఉన్న ముస్లిములను అతనికి వారసులుగా చూపించి, వారూ టిప్పు అంత హిందూద్వేషులే అని ప్రతిపాదించి, ఆ బూచితో హిందువులను ఏకం చేసి రాజకీయంగా లబ్ధి పొందుదామని చూసే హిందూత్వ ఎజెండాలో భాగంగా యిదంతా జరుగుతోంది. టిప్పు చరిత్ర గురించి చర్చలోకి దిగితే యిప్పట్లో తేలే వ్యవహారం కాదు కాబట్టి దాని గురించి చర్చించవద్దని కోరుతున్నాను. 200 ఏళ్ల క్రితం చచ్చిపోయిన టిప్పును ఎన్నికలలో ఎలా వాడుకుంటున్నారు అన్నదే మనకు ప్రధానాంశం. హిందూత్వవాదులు టిప్పు వారసత్వం గురించి రకరకాలుగా ఆందోళనలు చేస్తూండగా, దానికి విరుగుడుగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఒక ఆలోచన చేశాడు.
నిజానికి టిప్పును ఆకాశానికి ఎత్తినా, కింద పడేసినా యిప్పటి కన్నడ ముస్లిములకు తేడా పడదు. అతనేమీ వాళ్లకు మతగురువు కాదు. కేవలం ఒక రాజు. తన ప్రత్యర్థి హిందువైనా, ముస్లిమైనా టిప్పు క్రూరంగానే ప్రవర్తించాడు. బెంగుళూరుకి దగ్గర్లో నంది హిల్స్‌లో టిప్పూస్ డ్రాప్ అని ఒక ప్రదేశాన్ని చూపిస్తారు. శత్రువులను అక్కణ్నుంచి తోయించేవాడట. అది ఎంత లోతంటే ఎముకలు కూడా నుగ్గునుగ్గయిపోతాయి. టిప్పుని గౌరవిస్తే ముస్లిములందరూ మురిసి ముక్కలై తమ పార్టీకి ఓటేస్తారనే లెక్కతో సిద్ధరామయ్య 2015లో టిప్పు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతీ ఏడూ నవంబరు 20న జరపడానికి నిశ్చయించాడు. దీనివలన 2018 ఎన్నికలలో కాంగ్రెసుకు ఓట్లేమీ పెరగలేదు. 2019లో యెడియూరప్ప అధికారంలోకి రాగానే టిప్పు జయంతిని రద్దు చేసి పడేసారు. జరిపి తీరాలని ముస్లిములెవరూ ఆందోళన చేయకపోవడం గమనార్హం.
ఆంగ్లేయులను తొలుతనే ఎదిరించిన వాడిగా టిప్పును చూపిస్తున్న స్కూలు పాఠ్యపుస్తకాల్లో పాఠాలను సవరించ వలసినదిగా యెడియూరప్ప కాబినెట్‌లోని విద్యామంత్రి ఆదేశాలిచ్చారు. టిప్పు జయంతికి వ్యతిరేకంగా ఆందోళనలు సలిపిన ఆరెస్సెస్ నాయకుడు, నాటక రచయిత ఐన ఎసి కరియప్పను ‘రంగాయణ’ అనే ప్రభుత్వ నాటక సంస్థకు డైరక్టరుగా వేశారు. టిప్పు ఆరాధనను అంతం చేస్తాను అనే ప్రతినతో ఆయన ‘టిప్పు నిజ కణసుగళు’ (టిప్పు అసలైన కలలు) అనే నాటకం రాశాడు. 1997లో గిరీశ్ కర్నాడ్ రాసిన ‘టిప్పు కణసుగళు’కు యిది సమాధానం అన్నమాట. 2022లో బయటకు వచ్చిన యీ పుస్తకంలో టిప్పును చంపినది బ్రిటిషు సైనికులు కాదు, ఊరి గౌడ, నంజె గౌడ అనే యిద్దరు వొక్కళిగ వీరులు చంపారని రాశాడు. ఇవి కల్పిత పాత్రలు. 1994లో కన్నడ సాహిత్య పరిషత్ వేసిన ‘‘సువర్ణ మండ్యా’’ పుస్తకంలో వీరి ప్రస్తావన లేదు. 2007లో వేసిన రివైజ్డ్ ఎడిషన్‌లో ఏ చారిత్రక ఆధారాలూ లేకుండానే వీరి పేర్లు చేర్చారు. వాటిని యీయన వాడుకున్నాడు.
అయినా యెడియూరప్ప శిష్యురాలు, కేంద్రమంత్రి, వొక్కళిగ కులస్తురాలైన శోభా కరంద్లాజే ఔనౌను, యిది నిజం అన్నారు. ఈ పాత్రలపై ఓ సినిమా తీయబోయారు. దాని సంగతి ‘ప్రచార చిత్రాలు’ అనే వ్యాసంలో చెప్తాను. హిందూత్వ శక్తులు టిప్పును వదిలిపెట్టలేదు. అతని రాజధాని శ్రీరంగపట్నలో కట్టిన జామా మసీదును హనుమాన్ దేవాలయాన్ని కూల్చి కట్టారనే ఆరోపణతో 2022 జూన్‌లో దాన్ని ఆక్రమించుకోబోయాయి కొన్ని హిందూ సంస్థలు. దానిలో హనుమంతుడికి పూజలు చేస్తామంటూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, శ్రీరామ సేనె నవంబరులో హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఇలా మతం పేరుతో, టిప్పుకు వ్యతిరేకంగా వొక్కళిగలను సంఘటితం చేయాలని బిజెపి ప్రయత్నించింది. ఇవి ఏ మేరకు సఫలమయ్యాయో ఎన్నికల ఫలితాలు చెప్తాయి.
రాష్ట్ర జనాభాలో ముస్లిములు 13%. కానీ కర్ణాటక అసెంబ్లీలో 2018లో వారి శాతం 0.3 మాత్రమే, నెగ్గిన ఏడుగురూ కాంగ్రెసు నుంచే! బెంగుళూరు అర్బన్, బెళగావి, కలబురిగి దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో వీరి జనాభా 5 లక్షల కంటె ఎక్కువ. అందుచేత ప్రభావం ఎక్కువ. కాంగ్రెసు ముస్లిములకు ఈసారి 15 సీట్లు యిచ్చింది. అయితే నిషేధిత పిఎఫ్ఐ నుంచి ఆవిర్భవించిన ఎస్డిపిఏ (సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) కొన్ని రాష్ట్రాలలో మజ్లిస్ చేసినట్లు ముస్లిం ఓట్లు చీల్చి తమకు గండి కొడుతుందనే భయం కాంగ్రెసుకు ఉంది. కానీ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ముస్లిములు ఓట్లు గతంలో కంటె 10% ఎక్కువగా 88% యీసారి కాంగ్రెసుకు పడ్డాయని, గతంలో కంటె 10% తక్కువగా జెడిఎస్‌కు 8% పడ్డాయని, బిజెపికి 2% పడ్డాయని చెప్తోంది.
వొక్కళిగలలో చాలామంది పాడి రైతులున్నారు. వారిని అమూల్ తగాదా కలవర పెట్టింది. కర్ణాటకలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని పాల డెయిరీ చాలా ప్రసిద్ధమైనది. 2022 డిసెంబరులో కేంద్ర సహకార మంత్రిగా కూడా ఉన్న అమిత్ షా మండ్యా జిల్లాలో ఒక డెయిరీ ప్రారంభిస్తూ ‘అమూల్, నందిని కలిసి కర్ణాటకలో ప్రతీ గ్రామంలోనూ డెయిరీలను స్థాపిస్థాయి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు కావలసిన సాంకేతిక సహకారం. యంత్రాంగం అమూల్ సమకూరుస్తుంది.’ అన్నాడు. అమూల్ డెయిరీ సహకార రంగానికి చెందినదే అయినా యిప్పుడు కర్ణాటకలో విస్తరిస్తాననడంతో దానిపై గుజరాతీ ముద్ర పడింది. నందినిపై పెత్తనం చలాయించి దాన్ని నిర్వీర్యం చేయడానికే గుజరాతీ పాలు తెస్తున్నారని గొడవ మొదలైంది.
బెంగుళూరులో తాము ఆన్లైన్ పాల, పెరుగు వ్యాపారం ప్రారంభిస్తున్నామని ఏప్రిల్ 5న అమూల్ ట్వీట్ చేయడంతో కర్ణాటక భగ్గుమంది. 26 లక్షల మంది పాడిరైతులకు యిది దెబ్బ అని సిద్ధరామయ్య ప్రకటించాడు. దీని కారణంగా పాత మైసూరులో, వొక్కళిగల్లో తమకు నష్టం కలుగుతుందని భయపడిన కర్ణాటక కోఆపరేషన్ మంత్రి అమూల్, నందిని విలీనం గురించి ఆలోచించటం లేదని, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌లోని 15 పాల యూనియన్లు లాభాల్లో ఉన్నాయని, నందిని తన ఉత్పాదనలను గుజరాత్‌తో సహా 12 రాష్ట్రాలలో ఆన్లైన్లో అమ్ముతోందని, అమూల్ కూడా ఈకామెర్స్ ద్వారానే పాలు అమ్ముతోందని వివరించబోయాడు. ఆన్లైన్ వ్యాపారానికి ఎవరూ అడ్డు చెప్పలేరు. కానీ కర్ణాటకలో అమూల్, నందిని కలిసి ఊరూరా డెయిరీలు పెడతాయని అమిత్ అనడమే పాల రైతులను గాభరా పెట్టింది. ఓటింగుపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి.
చాలాకాలంగా వొక్కళిగలు, లింగాయతులు తమకున్న 4%, 5% రిజర్వేషన్స్ పెంచమని అడుగుతున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న పటేల్, మరాఠా, కాపు, జాట్ కులాలు రిజర్వేషన్స్ అడుగుతున్నట్లే వీరూ అడిగారు. ఎన్నికలలో తన ఓటు బ్యాంకు పెంచుకోవడానికి బిజెపి వీరిద్దరికీ చెరో 2% పెంచింది. అయితే దాన్ని కొత్తగా సృష్టించకుండా ఒబిసిలో ముస్లిములకున్న కోటా 4%ను తీసేసి, వీళ్ల కిచ్చింది. దాంతో వొక్కళిగలకు 6%, లింగాయతులకు 7% రిజర్వేషన్ అయింది. దీని కొరకు ఏ కమిషనూ ఏర్పరచి, అధ్యయనం చేయమనలేదు. ఏ గణాంకాలూ లేకుండా తమంతట తామే నిర్ణయం తీసుకున్నారు.
మతపరంగా రిజర్వేషన్లు యివ్వడం తప్పు అని చాలామంది జనరల్‌గా అనేస్తున్నారు కానీ లోతుకి వెళ్లటం లేదు. మొదటగా మనను మనం అడగవలసిన ప్రశ్న – ఒబిసిలు హిందువులు కారా? ప్రాథమిక విభజన అదే కదా, ఆ తర్వాత కులవిభజన జరుగుతోంది. మైనారిటీ మతాల్లో కూడా అదే జరుగుతోంది. ఒబిసిలకు రిజర్వేషన్లు యిచ్చినంత మాత్రాన యావన్మంది హిందువులకు యిచ్చినట్లు కాదు. అలాగే ఒబిసి కోటాలో ముస్లిములకు, క్రైస్తవులకు, జైనులకు, బౌద్ధులకు, శిఖ్కులకు యిచ్చినంత మాత్రాన ఆ మతాల్లోని యావన్మందికి యిచ్చినట్లు కాదు. వారిలో సామాజికంగా వెనకబడిన వారికి మాత్రమే అవి వర్తిస్తాయి.
రిజర్వేషన్లు కులప్రాతిపదికన యిస్తున్నారు. నిజానికి కులం అన్నది హిందూమతంలోనే ఉంది. మన మతగ్రంథాల్లో అడుగడుగునా కులప్రస్తావన కనబడుతుంది. అయితే భారత సంస్కృతిలో కులం ఎంతలా భాగం అయిపోయిందంటే, యిక్కడి జనం యితర మతాల్లోకి మారినా కులాన్ని విడిచి పెట్టటం లేదు. ఆ మతగ్రంథాల్లో కుల ప్రస్తావన లేదు. అయినా ఆచరణలో ఉంది. అందుకే శిఖ్కు దళితులు, బౌద్ధ దళితులు, క్రైస్తవ దళితుల పట్ల వివక్షత కనబడుతోంది. క్రైస్తవ రెడ్డి క్రైస్తవ హరిజనుణ్ని సమానంగా చూస్తున్నాడా? ముస్లిం నవాబు దూదేకుల సాయిబును అల్లుడిగా ఆదరిస్తున్నాడా? ఇది గమనించి సామాజికంగా వెనకబడిన హిందూ బిసిలనే కాక, యితర మతాలలో వెనకబడిన వారిని కూడా బిసిలలో చేర్చి వార్షికాదాయ పరిమితికి లోబడి రిజర్వేషన్లు యిస్తున్నారు.
కర్ణాటకలో వెనకబడిన ముస్లిముల స్థితిగతులపై ఆ ప్రభుత్వం చిన్నప్పరెడ్డి కమిషన్‌తో సహా అనేక కమిషన్లు యిచ్చిన నివేదికలను ఆధారం చేసుకుని దేవెగౌడ ముఖ్యమంత్రిగా ఉండగా 1994లో ముస్లిములలో వెనకబడిన వర్గాలకు 4% యిచ్చింది. వీరిలో చాకళ్లు, మంగళ్లు, కటికవారు, పారిశుధ్య పనివారు యిలాటివాళ్లు ఉంటారు. ఇప్పుడు 2023 మార్చిలో బొమ్మయ్ ప్రభుత్వం దీన్ని రద్దు చేస్తూ మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు అంది. అదే మాటకు కట్టుబడితే కర్ణాటక ప్రభుత్వం బ్రాహ్మణ క్రైస్తవులు, కురుబ క్రైస్తవులు, మాదిగ క్రైస్తవులు, సెట్టిబలిజ క్రైస్తవులు, దిగంబర జైనులు, బౌద్ధ దళితులు, యిత్యాదులకు యిస్తున్న ఒబిసి రిజర్వేషన్లు తీసేయాలి. కానీ వాళ్లకు తీసేయలేదు. ఇది అన్యాయమని ముస్లిములతో సహా అందరూ గోల పెట్టారు. వ్యవహారం కోర్టుకి వెళ్లింది.
ఇది అస్తవ్యస్తంగా, లోపభూయిష్టంగా, అశాస్త్రీయంగా ఉందని సుప్రీం కోర్టు అంది. తుది తీర్పు వచ్చేదాకా అమలు చేయవద్దంది. ఈ వ్యవహారం కోర్టులో ఉండగా దీనిపై వ్యాఖ్యానించినందుకు అమిత్ షాను మందలించింది. ఆయన దేశమంతా దీన్నే అమలు చేస్తామని హామీలు గుప్పిస్తున్నాడు. సుప్రీం కోర్టు కలగజేసుకుని కర్ణాటక ఒబిసి వ్యవహారాన్ని ఆపకపోతే అదే జరిగేట్లుంది. మైనారిటీల్లో కేవలం ముస్లిములనే టార్గెట్ చేసినట్లవుతుంది. మతమార్పిడులకు విచ్చలవిడిగా పాల్పడే క్రైస్తవులను వదిలేసినట్లవుతుంది. కర్ణాటక ప్రభుత్వం ముస్లిములను తీసుకెళ్లి అగ్రవర్ణాల పేదలకిచ్చే 10% రిజర్వేషన్లలో చేర్చేసింది. ఇప్పటికే రిజర్వేషన్ల వలన అగ్రవర్ణాలు నష్టపోతున్నాయి. మోదీ హయాంలో యిచ్చిన 10% రిజర్వేషన్ వలన వారిలో పేదలకి కాస్త రిలీఫ్ దొరికింది. ఇప్పుడు బొమ్మయ్ సర్కారు దానికి కోత పెట్టింది. దీన్ని వారు ఏ మేరకు హర్షిస్తారో తెలియదు.
బొమ్మయ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో కూడా వేలు పెట్టింది. ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఉంటే దాన్ని 17%కు పెంచి, వాళ్లను వర్గీకరించి, అంతర్గత రిజర్వేషన్లు పెట్టింది. ఎస్సీ లెఫ్ట్ (మాదిగ వంటి అత్యంత వెనకబడిన వారు) కు 6%, ఎస్సీ రైట్‌కు 5.5%, టచబుల్స్ (బంజారా, భోవి వంటి సృశ్యులు) 4.5%, ఇతరులకు 1% అంది. ఈ వర్గీకరణ వలన తాము దెబ్బ తింటామని బంజారాలు ఆందోళన చేశారు. వారిని ఊరడించడానికి మోదీ కలబురిగి జిల్లాకు వెళ్లి ‘మీ బిడ్డ (తనను ఉద్దేశించి) దిల్లీలో ఉండగా మీకు చింతేల?’ అనేసి వచ్చాడు. వాళ్లు ఏ మేరకు నమ్ముతారో తెలియదు. వర్గీకరణ అనేక చిక్కులతో కూడుకుని ఉన్నది కాబట్టి ఏ రాష్ట్రమూ సాహసించటం లేదు. అంతిమంగా కోర్టు కొట్టేయవచ్చు కూడా.
స్థూలంగా చెప్పాలంటే ఒబిసి 1లో ‘మోస్ట్’ బ్యాక్వర్డ్లకున్న 4%, 2(ఎ) కింద ‘మోర్’ బ్యాక్వర్డ్లకున్న 15%లలో మార్పు లేదు. గతంలో 2(బి)కింద ముస్లిములకున్న 4% ఎగిరిపోయింది. ఇడబ్ల్యుఎస్ కింద ఉన్న 10%లో వెళ్లి కలిసింది. గతంలో వొక్కళిగలకు 3(ఎ) కింద 4% ఉంటే యిప్పుడు వాళ్లని 2(సి) కిందకు తీసుకువచ్చి 6% చేశారు. గతంలో 3(బి) కింద లింగాయతులకు, క్రైస్తవులకు, జైన్లకు, మరాఠాలకు కలిపి 5% ఉంటే యిప్పుడు వాళ్లని 2(డి) కిందకు తీసుకుని వచ్చి 7% చేశారు. గతంలో ఎస్సీలకు 15% ఉంటే యిప్పుడు 17% చేశారు. ఎస్టీలకు 3% ఉంటే 5% చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బిసిలకు కలిపి 50% సీలింగు ఉంటుంది. దీనికి 10% ఇడబ్ల్యుఎస్ కోటా కలిపితే 60 వరకు కోర్టు అనుమతిస్తుంది. ఈ మార్పుతో 66 అయింది. ఈ పెరుగుదలను కోర్టు అనుమతించక పోవచ్చు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరిస్తేనే రక్షణ ఉంటుంది. ఈ రిజర్వేషన్ల వలన రాజకీయ లబ్ధి చేకూరిందని ఎన్నికలలో నిరూపితమైతే బిజెపి ఆ ప్రయత్నం చేయవచ్చు. ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎస్సీలలో ఎక్కువమంది కాంగ్రెసుకి వేశారని వచ్చింది మరి! రేపే ఫలితాలు వస్తాయి. టీవీల్లో రోజంతా విశ్లేషణలు వస్తాయి. తర్వాతి రోజుల్లో పేపర్లలో సర్వేల ఫలితాలు వస్తాయి. రాజకీయ పార్టీలు వాటి ఆధారంగా వ్యూహరచనలు చేసుకుంటాయి. ఇవన్నీ గమనించడం ఆసక్తికరం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2023)