హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి నెలకొల్పిన సమతామూర్తి విగ్రహం పేరుతో వ్యాపారం చేసుకుంటున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. సమతామూర్తి అంటే శ్రీరామానుజాచార్యులు. వెయ్యేళ్ల తర్వాత ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఆయన విగ్రహం నెలకొల్పడానికి చారిత్రక నేపథ్యం ఉంది.
ఆయన స్ఫూర్తి నేటి తరానికి తెలియజెప్పాలనే సదాశయం చినజీయర్ స్వామిలో కనిపించింది. శ్రీరామానుజాచార్యులు గొప్ప సమతావాది. మానవులంతా సమానమే అని నినదించిన సంస్కరణ వాది. కులమతాల కంటే మనుషుల గుణగణాలే ముఖ్యమని చాటి చెప్పిన ఆయన స్ఫూర్తిని నలుదిశలా చాటేందుకు సమతామూర్తి విగ్రహాన్ని నెలకొల్పడం వరకూ బాగుంది.
కానీ ఆ మహనీయుడి ఆశయాలను ఆదిలోనే తుంగలో తొక్కారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమతామూర్తి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి, తెలుగు రాష్ట్రాల సీఎంలు సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించి పరవశించారు. దీంతో సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించాలన్న కోరిక ప్రతి ఒక్కరిలో కలిగింది. కానీ సమతామూర్తిని సామాన్య ప్రజలకు దూరం చేయడానికి అన్నట్టు… సందర్శన రుసుంలు ఉన్నాయనే విమర్శ వెల్లువెత్తుతోంది.
సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల అనంతరం సామాన్య ప్రజలకు దర్శనభాగ్యం కల్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా చిన్నపిల్లలకు, పెద్దలకు రేట్లను ఖరారు చేశారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకునేం దుకు భక్తులు, సందర్శకుల కోసం ప్రకటించిన ప్రవేశ రుసుంలు సామాన్యులకు షాక్ కొట్టేలా వున్నాయి.
6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ.75, పెద్దలకు రూ.150గా ప్రవేశ రుసుంలు నిర్ణయించారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఉచితంగా అనుమతిస్తారు. సమతామూర్తిపై వ్యాపారం చేసుకోడానికి అన్నట్టుగా నిర్వాహకుల ధోరణి కనిపిస్తోందని విమర్శలున్నాయి.
నిజంగా సమతామూర్తిని సామాన్యులకు చేరువ చేయాలని అనుకుంటే… ఈ స్థాయిలో ప్రవేశ రుసుంలు పెట్టాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నామమాత్రపు ప్రవేశ రుసుంలను పెడితే… అందరూ అక్కడికెళ్లి స్ఫూర్తి పొందే అవకాశం వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.