వక్రీకరణకు ‘అమ్మ మొగుడు’

'అమ్మ మొగుడు' అనే మోటు పదం వాడడానికి బాధగా వున్నా..తప్పడం లేదు. ఎందుకంటే ఓ విషయాన్ని తిప్పి తిప్పి ప్రభుత్వం మీదకు నెట్టే ప్రయత్నం చూస్తుంటే మరీ ఇంత దిగజారుడా? మరీ ఇంత వక్రీకరణా?అనిపించినపుడు.…

'అమ్మ మొగుడు' అనే మోటు పదం వాడడానికి బాధగా వున్నా..తప్పడం లేదు. ఎందుకంటే ఓ విషయాన్ని తిప్పి తిప్పి ప్రభుత్వం మీదకు నెట్టే ప్రయత్నం చూస్తుంటే మరీ ఇంత దిగజారుడా? మరీ ఇంత వక్రీకరణా?అనిపించినపుడు. ఆ విషయాన్ని అంతకంటే ఘాటుగా వ్యక్తం చేయాలంటే ఇలాంటి పదం వాడక తప్పడం లేదు. ఈ రోజు ఓ మీడియాలో వచ్చిన వార్త గురించే ఇదంతా. 

ఇంజనీరింగ్ కళాశాలల్లో దాదాపు లక్ష మందికి జీతాలు లేవట. ఎందుకు? కాలేజీల దగ్గర డబ్బులు లేవు కాబట్టి, ఎందుకు? పిల్లలు ఫీజులు కట్టక కాదు, ప్రభుత్వం విధానం మార్చేసినందుకంట. ఏమిటా విధానం? ఏమిటా మార్పు? చూద్దాం. 

తెలుగు రాష్ట్రంలో ఒకప్పుడు ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. అందువల్ల అప్పట్లో అందరూ ఇంజనీరింగ్ చదవలేకపోయేవారు. అయితే టాప్ రాంకర్లు అయినా అయి వుండాలి.  లేదా డబ్బు దండిగా వుంటే పక్క రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాలి. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఫ్యామిలీ రామ్ టెక్ లో ఇలాంటి కాలేజీనే పెడితే మన కాంగ్రెస్ నాయకుల పిల్లలంతా బొలోమని అక్కడకు వెళ్లి చదువుకున్నారు. 

ఇలాంటి పరిస్థితి చూసి, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ల బ్యాక్ గ్రవుండ్ నుంచి వచ్చారు కాబట్టి, ఈ విషయాలపై అవగాహన వుంది కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి తొమ్మిది  ప్రైవేట్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు.

హాత్తెరీ, అందులో అన్యాయాలు, మతలబులు జరిగిపోయాయి అంటూ తెలుగుదేశం జనాలు అప్పట్లో కోర్టుకు వెళ్లారు. దానిపై సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఆయన పాపం పదవి కూడా కోల్పోయారు. కానీ ఈ రాష్ట్రంలో  ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్య ఇంతలా వృద్ది చెందడానికి కారణం మాత్రం నేదురుమల్లి అన్నది పచ్చి వాస్తవం. 

ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇబ్బడి ముబ్బడిగా  ప్రైవేట్ కాలేజీలు ఏర్పాటు చేయడం గమ్మత్తయిన విషయం. దాంతో ఈరాష్ట్రంలో సాఫ్ట్ వేర్ విద్య విలసిల్లడానికి కారణం చంద్రబాబే అనుకుంటారు చాలా మంది. ఇలా చంద్రబాబు తమవారికి ఎక్కవగా, పనిలో పనిగా కాంగ్రెస్ వారికి కొందరికి కాలేజీలు అప్పట్లో ఇచ్చేసారు. 

వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఫీజు తిరిగి చెల్లింపు అనే స్కీము తెచ్చారు. అదిగో ఆ స్కీము వచ్చి గేట్లు ఎత్తేసింది. వాడకు, వీధికి కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకువచ్చాయి. కేవలం ఈ స్కీము ఆలంబనగా కాలేజీలు బతికేయడం అలవాటు చేసేసుకున్నాయి. ఇందులో ఎన్నో మతలబులు వున్నాయని, చాలా బోగస్ అడ్మిషన్లు వున్నాయని కూడా వార్తలు వినిపించేవి. కానీ మొత్తానికి ఆ వ్యవహారం అలాగే నడిచింది. 

దరిమిలా చంధ్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా ఈ వ్యవహారం ఇలాగే సాగింది. ఒక దశలో ఆయన కూడా కాలేజీలకు ఫీజుల చెల్లింపు బకాయిలు పెట్టారు. ఆ విషయం మీదే నటుడు మోహన్ బాబు రోడ్ ఎక్కి మరీ చంద్రబాబును దుయ్య బట్టారు. 

ఇక వర్తమానికి వస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక, ఈ అవకతవకలు అన్నీ కట్టడి చేయడానికి నట్లు బిగించడం ప్రారంభించింది. కాలేజీలకు కాకుండా నేరుగా విద్యార్థులకే ఫీజులను జగనన్న విద్యాదీవెన, జననన్న వసతి దీవెన కింద నేరుగా తల్లుల ఖాతాలకే జమచేసేలా నిర్ణయం తీసుకొన్నారు. వాళ్లు కాలేజీలకు కట్టాలి.

ఇక్కడ బోగస్ వ్యవహారాల ఆట కట్టేసింది. కానీ ఆ మాట ఎవ్వరూ ఒప్పుకోరు కదా. ఇప్పుడు కాలేజీల తరపున ఈ మీడియా రివర్స్ ప్రచారానికి తెరతీసింది. ప్రభుత్వం డబ్బులిచ్చినా విద్యార్ఢులు కాలేజీలకు కట్టడం లేదని, అందువల్ల కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయని రాసుకొస్తోంది. 

ఆ మాటకు వస్తే కరోనా నేపథ్యంలో మీడియా దగ్గర నుంచి అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అన్ని రంగాల్లోనూ వేతనాల్లో కోత, సిబ్బందిలో కోత తప్పలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. కానీ ఇంజనీరింగ్ కాలేజీలు పరిస్థితిని భూతద్దంలో చూపించి సిబ్బందికి జీతాలు ఎగనామం పెడుతున్నాయి. 

నిజానికి గతంలో ఏం జరిగేది బోధనా సిబ్బంది చేత లక్షలకు సంతకాలు చేయించుకోవడం వేలల్లో జీతాలు ఇవ్వడం. చాలా కాలేజీలు  అర కొర సిబ్బందితో నిర్వహించడం, తనిఖీలు జరిగినపుడు మాత్రం 'అద్దె సిబ్భంది'ని ప్రదర్శనకు వుంచడం. కరోనా కు ముందు వరకు కాలేజీలు అన్నీ రకరకాల ఫీజుల పేర్లు చెప్పి కోట్లలో సంపాదించాయి. ఇక పెయిడ్ సీట్ల వ్యవహారం అయితే చెప్పనక్కరలేదు. 

ఆ విషయం ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు అందరికీ తెలుసు. ఆ డబ్బంతా మూటకట్టి లోపల పెట్టి ఇప్పుడు బీద అరుపులు అరుస్తూ, సిబ్బందికి ఇచ్చే అరకొర జీతాలు కూడా ఇవ్వడం లేదు. 

నిజానికి ఈ పరిస్థితి నిందించాల్సింది యాజమాన్యాలను. అది మానేసి ఈ మీడియా రాసే ఈ రాతలు ఎలా వున్నాయి అంటే ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలది అస్సలు తప్పు లేదు. కేవలం ప్రభుత్వం డబ్బులు తీసుకెళ్లి విద్యార్ధుల తల్లులకు ఇవ్వడం వల్లే సమస్య అంతా, అందువల్ల మళ్లీ నేరుగా కాలేజీలకే ఇచ్చేయాలి అని. అంటే అలా అయితే మళ్లీ గతంలో మాదిరిగా బోగస్ అడ్మిషన్లు అనే మాట వినిపించడం ప్రారంభిస్తుంది.

ఇలాంటి నేపధ్యంలో జగన్ చేయాల్సింది ఏమిటంటే,  ప్రతి జిల్లాకు ఓ హైపవర్ ఇన్వెస్టిగేషన్ కమిటీ వేసి, ఫీజుల తిరిగి చెల్లింపు పొందిన ప్రతి విద్యార్థి వివరాలు ఆరా తీయించాలి. వాళ్లు నిజంగా చదువుకున్నారా? లేదా? తేల్చాలి. అవసరం అయితే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు తదితర సమాచారాన్ని క్రోడీకరించి, ఎవరు ఎక్కడ చదివారు అన్నది తేల్చడం ప్రారంభించాలి. 

చావుకు పెడితే కానీ లంఖణానికి రాదు అని సామెత. అలా నిజాలు నిగ్గుతీయడం ప్రారంభిస్తే తప్ప, ఇలాంటి మీడియా వంటింట్లో తయారయ్యే మసాలా కథనాలకు అడ్డుకట్ట పడదు. ఎందుకంటే మూడు వంతుల కాలేజీలు రాజకీయ నాయకులు లేదా రాజకీయ ఆశ్రితుల చేతుల్లో వున్నాయి. చాలా వాటికి ఏదో పేరు చెప్పి ప్రభుత్వ భూములు ముట్టాయి. 

మ‌రో జోస్యం వ‌దిలిన స‌బ్బం