ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ పరోక్ష సంకేతాలు ఇచ్చారా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. పలు అభివృద్ధి పనుల ప్రారంభం అనంతరం పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించకుండానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే వారు అవినీతికి పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం.
“తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి పెరిగింది. వారి స్వలాభం కోసమే పని చేస్తున్నారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే. అవినీతిని ముక్తకంఠంతో ఖండించాలి. ఎంత పెద్దవారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. చట్టపరమైన సంస్థలను అడ్డుకోవద్దు. విచారణ సంస్థలను బెదిరిస్తున్నారు” అని ఆయన పరోక్షంగా కేసీఆర్, కవిత వైఖరులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎంతటి పెద్ద వారైనా అనే కామెంట్‌తో కవితను విడిచిపెట్టేది లేదనే సంకేతాలను ఆయన ఇచ్చారనే చర్చకు తెరలేచింది. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మోదీ విరుచుకుపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి కలగాలని ఆయన పిలుపు నిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతోందనేది తన బాధ, ఆవేదన అని ఆయన చెప్పుకొచ్చారు. తామేమో ప్రజల కోసం పని చేస్తుంటే.. కొందరు మాత్రం అవినీతికే పనులు చేస్తున్నారని కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రతి ప్రాజెక్టులో కుటుంబ సభ్యుల ఆసక్తి తప్ప మాత్రమే ఉందని.. ప్రజల ప్రయోనాలు లేవని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు.
అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా.. వద్దా అంటూ ప్రజలను ప్రశ్నించడం గమనార్హం. తద్వారా కవితపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అని ప్రశ్నించడమే అంటున్నారు. మొత్తానికి హైదరాబాద్ పర్యటనలో అందరూ ఊహించినట్టే కేసీఆర్ సర్కార్ పేరు ఎత్తకుండానే చీవాట్లు పెట్టారు.